Sunday, October 12, 2025
E-PAPER
Homeకథఎగిరే గాలిపటం

ఎగిరే గాలిపటం

- Advertisement -

ప్రకాశం మాస్టర్‌ గారికి బదిలీ ఆర్డర్‌ వచ్చిందన్న వార్త గ్రామం అంతాకారుచిచ్చులా వ్యాపించడంతో ఆక్కడి వారి మనసు దుఃఖము, విచారముతో నిండిపోయింది.
ఆ వార్త తెలుసుకున్న రామంగారు గబగబా ఇంట్లోకి వచ్చి ఈ విషయం భార్య లక్ష్మికి చెప్పడంతో ఆమె, ”అయ్యో! ఇంత మంచిమనిషి మన గ్రామం వదిలి వెళ్లడం పిల్లలకే కాదు ప్రజలకి కూడా తీరని లోటు” అన్నది బాధగా.
”అవును లక్ష్మీ, ఇంత మంచి మాస్టారుని మన గ్రామం నుండి బదిలీ చేయవద్దని అంతా కలెక్టర్‌ గారికి అర్జీ పెట్టాలనుకుంటున్నారు” అన్నాడు భార్యకి ధైర్యం ఇస్తూ.
”ఏమోనండి, నాకు మన గోపిగాడి కోసమే దిగులుగా ఉంది. వాడు ఇప్పుడిప్పుడే ఓ దారిలోకి వస్తున్నాడు అంటే ప్రకాశం మాస్టారు చలవే కదండీ. ఎప్పుడూ స్కూలుకి వెళ్లనని మారం చేసేవాడు. ఇప్పుడు వాడే పొద్దునే లేచి స్కూలుకి సరదాగా వెళ్తున్నాడు. మాస్టారు పాఠం చెప్పే విధానం అటువంటిది. పిల్లలకి అది చదువులా కాక సరదాగా ఉంటుందని గోపి చెపుతూ ఉంటాడు. ఏమో మన పిల్లల అదష్టం ఎలా ఉంటుందో” అని వాపోయింది.
”అందుకే కదా ఈ ప్రయత్నం, విద్యార్థులు అంతా మన గోపి లాంటి వారే కదా, మరేం బెంగపడకు. అది సరే కానీ, నేను వచ్చి ఇంతసేపు అయ్యింది, కొంచం కాఫీ అయినా ఇస్తావా?” అనడంతో లక్ష్మి పరుగున వెళ్లి వేడివేడి కాఫీ అందించింది.
ఇలా ఆ గ్రామంలో ఇంచుమించు అందరి ఇంట ప్రకాశం మాస్టారి బదిలీ ఓ చర్చనీయ విషయంగా మారింది. ప్రకాశం మాస్టారుని అక్కడి వారు అంతగా ప్రేమించడానికి కారణం ఆయన మంచితనమేకాక అందరి పట్ల చూపించే ప్రేమ, దయార్థ గుణం. ఆయన ఆ స్కూలుకి వచ్చిననాటి నుండి ఆ స్కూల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఆడుతూ పాడుతూ సరదాగా క్లాసులో చదువు చెప్పే విధానం విద్యార్థులను ఆక్కట్టుకుని ఒక్కరోజు కూడా స్కూలు మానకుండా వచ్చేట్టు చేసారు. అదేకాక బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు చిన్నచిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి విద్యార్థుల చేత స్వాతంత్య్ర సమరయోధుల వేషాలు వేయించి, దేశభక్తి గీతాలు పాడించి, ఆడించేవారు. దానికి అవసరం అయితే సొంత సొమ్ము ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. స్పోర్ట్స్‌ డే తో పాటు విద్యార్థులలో మానవీయ విలువలు పెంపొందించడానికి పోటీ నిర్వహించి గ్రామంలో విద్యార్థులకు బహుమతులు ఇచ్చేవారు. ఆయన స్కూల్‌ కాంపౌండ్‌లో పిల్లల చేత మొక్కలు నాటించి వాటికి వారి పేరే పెట్టి, వాటిని పెంచే బాధ్యత కూడా వారికే అప్పచెప్పడంతో పిల్లలు వాటికి నీరు పోసి, అవసరం అయితే ఎరువులు తెచ్చి వేసి జాగ్రత్తగా పెంచి స్కూలు ఆవరణని నందనవనంగా మార్చేశారు.
ప్రకాశం మాస్టారు విద్యార్థులను ప్రతి ఏటా ఓ రెండు, మూడు రోజుల కోసం చుట్టుపక్కల ఉన్న చారిత్రాత్మక ప్రాముఖ్యత గల ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకొనివెళ్లి, వారు చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించేటట్లు చేసేవారు. ఇలా చెప్పుకుంటూపొతే మాస్టారులో లెక్కలేనన్ని గుణాలు. ఒక విధంగా చూస్తే మాస్టారుకి పిల్లలంటే ప్రాణం, వారికి కూడా ఆయన అంటే అంతే. ఆయన విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం కోసం ప్రయత్నించేవారు. ఓ శిల్పి తన ఉలితో రాయిని చెక్కినట్లు ప్రకాశం మాస్టారు ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
స్కూల్లోనే కాక ఆయన గ్రామ ప్రజలకు కూడా చాలా సహాయపడేవారు. చదువురాని వారికి బ్యాంక్‌ పనులలో, అర్జీలు రాయడం లాంటి చాలా విషయాలలో సహాయపడేవారు. అక్కడివారు చాలామంది ఆయన సలహా తీసుకుంటేకానీ ఏ పనీ చేసేవారు కాదు. కొంతమంది అయితే ఆయన్ని ప్రాణం పోసిన గొప్పమనిషి అనేవారు. దీని వెనక ఒకనాడు స్కూల్లో జరిగిన ఒకసంఘటన కారణం.
ఆనాడు స్కూల్‌ ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిది ఏళ్ళ సూర్యం కాలిపై పాము కాటేసింది అన్న వార్త తెలిసిన మరుక్షణం తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నా ప్రకాశం మాష్టారు లెక్కచెయ్యకుండా వచ్చి సూర్యంకి భయపడవద్దని ధైర్యం ఇచ్చి, పాము కాటేసిన చోటుని నీళ్లతో శుభ్రపరరిచి, బ్యాండేజ్‌ వేసి, కాలు కదపకుండా ఒక కర్రస్కేలుతో స్ప్లింట్‌ కట్టి ఆయనను మరో మాస్టారి సాయంతో వెంఠనే బైక్‌ మీద పక్క ఊరి పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఏ మాత్రం గాబరా పడకుండా చేసిన ఫస్ట్‌ ఎయిడ్‌ వల్లే సూర్యం ప్రాణాలతో ఉన్నాడని డాక్టర్స్‌ చెప్పడంతో సూర్యం తల్లితండ్రులకే కాక అక్కడి వారికందరికి ఆయన గొప్పవారు అయ్యారు.
అలాంటి మనిషికి బదిలీ ఆర్డర్స్‌ వచ్చాయి అన్న విషయం వారికి సహించలేదు. అనుకున్నట్టే గ్రామ సర్పంచ్‌తో పాటు కొంతమంది పెద్దలు జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి ప్రకాశం మాష్టారు బదిలీ రద్దు చెయ్యమని వినతి పత్రం అందించిన కొద్ది రోజులలోనే వారి అభ్యర్ధనని మన్నించి కలెక్టర్‌ గారు మాస్టారు బదిలీ ఆర్డర్‌ రద్దు చేసారు.
కానీ కాలం ఆగదు కదా, ఓ నదీప్రవాహంలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మాస్టారుగారి రిటైర్మెంట్‌ దగ్గర పడింది. మాస్టారు రిటైర్మెంట్‌ ఫంక్షన్‌ని గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఆయన వద్ద చదువుకుని ఉన్నత పదవులలో, దేశ విదేశాలలో ఉన్న విద్యార్థులు చాలా ఘనంగా ఏర్పాటు చేసారు. విశేషం ఏమిటంటే ముఖ్యఅతిథిగా ఆహ్వానించబడిన జిల్లా కలెక్టర్‌, మాస్టారు పాముకాటు నుండి కాపాడిన సూర్యం కావడం.
ఆనాడు వేదికపై స్కూల్‌ సిబ్బంది, గ్రామ ప్రముఖులతో పాటు కలెక్టర్‌ సూర్యనారాయణ మూర్తి మాస్టారుకి, పూలదండ వేసి, శాలువా కప్పి సత్కరించిన తదుపరి ప్రసంగిస్తూ, ”విద్యార్థిఎ గిరే గాలిపటం అయితే, దానికి ఆధారమైన దారం గురువు అనేవారు మా తాతగారు. నా జీవితమే దానికి మంచి ఉదాహరణ. మాస్టారు నాకు అక్షరాలు నేర్పించిన గురువే కాదు, నాకు ప్రాణభిక్ష పెట్టిన గొప్పవ్యక్తి. నేను ఈనాడు యిలా ఉండడానికి కారణం మాస్టారే. ఇంటి పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత స్థిరంగా ఉంటుంది అన్నట్టే నా పునాది అయిన ప్రాథమిక విద్య ఈ స్కూల్లో ప్రకాశం మాస్టారు వద్దే. మనమేంటో మనకే తెలియని క్షణంలోనే మన భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుంది. నాలాంటి బడి ఎగొట్టి, గోళీలాట ఆడే పిలాడిని ఒక్క రోజు కూడా స్కూలు మానకుండా చేసిన ఘనత మాస్టారిదే. ప్రతి ఉపాధ్యాయుడు తన జీవితంలో కొన్ని వేలమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతారు. కొందరి విషయంలో కొన్నిసార్లు కఠినంగానే ఉన్నా, అది వారిని సరైన మార్గంలో నడిపించి ప్రయోజకులను చేయడానికే. తన దగ్గర చదువుకున్నవారు ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకోవడం మినహా తన శిష్యుల నుంచి ఏ రోజూ, ఏమీ ఆశించలేదు మాస్టారు. ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. మాస్టారులాంటి వారి ప్రభావం అనునిత్యం మనపై కనిపిస్తూనే ఉంటుంది. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, వారు వెలిగించిన జ్ఞానమనే దీపం ఎప్పుడూ దారి చూపుతూనే ఉంటుంది. మాస్టారులాంటి వారు మరింత మందికి వెలుగు పంచాలని కోరుకుంటున్నాను. మనం ఆయన ఋణం ఎప్పటికీ తీర్చుకోలేం” అని మాస్టారు పాదాలకు మొక్కడంతో సభ అంతా కరతాళధ్వనులతో మారు మ్రోగిపోయింది.
ఆ దశ్యం చూసిన ప్రకాశం మాస్టారు కారుతున్న కన్నీటి భాష్పాలు, రిటైర్‌ అవుతున్నందుకు బాధ కన్నా, జీవితంలో ఉపాధ్యాయవత్తికి న్యాయం చేసి ఇంతమంది ప్రేమ, అభిమానాలు పొందినందుకు సాక్షిగా ప్రవహించసాగాయి.

  • తాతా కామేశ్వరి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -