హైదరాబాద్ పికిల్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు
హైదరాబాద్ : మహిళల, పురుషుల సింగిల్స్, డబుల్స్ సహా ఐదు విభాగాల్లో 200 మంది క్రీడాకారులు పోటీపడుతున్న పికిల్‌బాల్ ఓపెన్ టోర్నమెంట్ శనివారం ప్యాడిల్‌వేవ్ స్పోర్ట్స్ సెంటర్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్ పికిల్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు రెండు రోజుల పాటు జరిగే రౌండ్ రాబిన్, నాకౌట్ టోర్నమెంట్‌ను అధికారికంగా ఆరంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ..’ పికిల్‌బాల్‌కు ఆరంభంలో కాస్త ప్రతికూల వాతావరణం కనిపించినా.. ప్రస్తుతం పికిల్‌బాల్‌కు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతుంది. పికిల్‌బాల్‌ను మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తానని’ అన్నారు. హైదరాబాద్ పికిల్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుమిరన్ కొమ్మరాజు, కోశాధికారి శ్రీధర్, నిర్వాహకులు కార్తీక్, సత్యదీప్, మహేశ్ తదితరులు ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.