Sunday, October 12, 2025
E-PAPER
Homeసోపతిప్రళయమై చెలరేగిన పాట

ప్రళయమై చెలరేగిన పాట

- Advertisement -

అన్యాయంగా హింసిస్తున్నప్పుడు చూస్తూ ఊరుకోకూడదు. ఎదురు తిరగాలి. ప్రతిఘటించాలి. అధర్మం తలెత్తి విర్రవీగినప్పుడు ధర్మం అలలెత్తి విజృంభించాలి. ఎక్కడ అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు కనబడినా కాలరాయాలి. శత్రు సంహారం చేయాలి. ధర్మకోపాన్ని, ఆవేశాన్ని విశ్వరూపమెత్తి చూపించాలి. మంచికి ఓపిక నశించి విరుచుకపడితే ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించాడు గీతరచయిత వెన్నెలకంటి. 2011 లో రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.

తెలుగు సినీగీత రచయితల్లో వెన్నెలకంటిది ప్రత్యేకమైన అధ్యాయం. ఎలాంటి సన్నివేశానికైనా అలవోకగా పాట రాయగలడు. ఈ పాట కూడా అత్యద్భుతంగా రాశాడు. పదునైన బాణాల్లా దూసుకొస్తాయి ఈ పాటలోని పదబంధాలు. అంత వాడిగా, వేడిగా రాశాడు. ఆవేశపూరితమైన భావనాబలం ఈ పాట నిండా ఉంది.
సినిమాకథ పరంగా చూసినట్లయితే.. హిజ్రా జాతికి చెందిన కాంచన అనే పేరు గల ఓ వ్యక్తిని మోసం చేసి, వారి జాతికి చెందిన భూములను కాజేస్తారు కొందరు అవినీతిపరులు. అంతేకాదు ఆ హిజ్రా కుటుంబాన్ని అన్యాయంగా చంపేస్తారు. చనిపోయిన ఆ హిజ్రా తన పగ తీర్చుకోవాలనుకుంటుంది. అమాయకుడైన ఓ యువకుడిలోకి ప్రవేశిస్తుంది. అవినీతిపరులను, వారికి సహాయపడే శత్రువులందరినీ మట్టుపెట్టేముందు మరణమృదంగాన్ని వినిపిస్తుంటుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.
కటిక వాళ్ళు. అమాయకుల బతుకులతో ఆడుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళ కథల్ని ముగించడానికి, కంటి కొసలందు అగ్నుల్ని వెలిగించుకుని కాంచన వచ్చింది. శత్రువుల కండలు చీల్చి చెండాడడానికి, కసి తీరా గొంతులు కొరకడానికి వచ్చింది. మృత్యువులా మీదికొచ్చి కేకలు పెడుతోంది. కాంచన చేసే ప్రళయనాదం ప్రపంచమంతటా వినిపిస్తోంది. శత్రువుల శరీరాల్లో నుంచి చుక్క చుక్కగా, ధారగా రక్తం పారిస్తుంది. దిక్కులన్ని గజగజ వణుకుతూ నక్కిచూస్తుండగా చిత్రహింసలు పెట్టి మరీ చంపుతుంది. శత్రుమూక అనేదే ఇక ఈ భూమి మీద లేకుండా చేయడానికి కాంచన వచ్చింది. విలయ ప్రళయమూర్తిలా వచ్చింది. మరణమృదంగం తానే అయి చీల్చవచ్చింది.
అలా వచ్చిన కాంచన కన్నులు రెండు ఉరిమి చూస్తున్నాయి. ఒక కన్ను ఘోరె కన్ను. అంటే.. యువకుడిది. ఒక కన్ను పండు కన్ను. పండు వయసు వారిది. అంటే.. ఇక్కడ యువకుడిలోకి ప్రవేశించింది కాబట్టి సగం అతనిలా.. సగం తనలా కనబడుతోందని అర్థం. తన కోపంలో అగ్నులే కురుస్తున్నాయి. తనని చూస్తే చాలు.. పెదవులు వణుకుతాయి. శరీరాలు కంపిస్తాయి. చివరకు శత్రుసంహారం చేసేదాకా తన కోపం చల్లారదు. కసికసిగా ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. కాలరాచి దుర్మార్గుల కథలు ముగించేస్తుంది. హోరుగాలిలాగా వచ్చింది. నరికి పోగులెడుతుంది. ఆడా మగా కలిసి ఒకే రూపంలో వచ్చింది. అంటే.. హిజ్రా జాతి స్త్రీ కదా.. అని ఇక్కడ అర్థం. అర్ధనారీశ్వరుడైన శివుని అంశలా దర్శనమిస్తోంది. నటరాజస్వామిలా విలయతాండవం చేస్తోంది. కాళికాదేవిలాగ కనిపిస్తోంది. మింగేయడానికి సిద్ధంగా ఉంది.
శత్రువులను సంహరించి వాళ్ళ పుర్రెల్ని దండగా చేసి మెడలో వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన శత్రువుల్ని చంపడానికి సిద్ధమైంది. శత్రుశేషం లేకుండా చేయడానికే ఇపుడు తాను వచ్చింది. ఆమె మెడలో ఉన్న కపాలమాలలు అగ్నులను వెదజల్లుతున్నాయి. కన్నుల మంటల సెగలు మెరిసిపోతున్నాయి. అసురసంధ్య వేళలో అసురులను వేటాడడానికి వచ్చింది.. అంటే.. సాయం సంధ్యావేళలో వచ్చింది. లోకమంతా అదిరిపోయేలా, బెదిరిపోయేలా వచ్చింది. టక్కరి నక్కల వేషాలు వేసుకున్న మనుషులు చేతికి చిక్కారు. వాళ్ళ పీకలు నొక్కేస్తుంది. కాళికలా నాలుక తెరిచి కోసి పడేస్తుంది. కాలం ఆగిపోయేలా, సమస్త జీవరాశులు భయంతో ఊగిపోయేలా వచ్చింది.
నిలువెల్లా విషాన్ని నింపుకున్న నీచులను చంపడానికి పాములను మెడలో వేసుకుని వచ్చింది. ఎన్నిరకాలుగా నరరూప సర్పాలు అమాయకులను చంపుతున్నారో అన్నిరకాల పాములను తన శరీరమంతటా వేసుకుని వచ్చింది కాంచన. ఆమె కన్నుల్లో పాములు.. గొంతుల్లో కోడె తాచుపాములు, అందంగా మెరిసే నాగుపాములు, కట్లపాములు, చుట్లపాములు, శ్వేతనాగులు, పడగలు విసిరే పాములు, మట్టిలో తిరిగే పాములు, నీళ్ళలో నడిచే పాములు, పుట్టల్లో దాక్కుని కసిగా కాటేయడానికి సిద్ధంగా ఉన్న పాములు, బుట్టల్లో దాక్కుని నక్కి చూసే పాములు.. ఇలా ఇన్ని పాములు తనకి తోడుగా ఉండగా కాలసర్పంలా వచ్చేసింది కాంచన.. మహాగ్నిని విషంలా చిమ్మడానికి వచ్చేసింది.
ఉరిమి ఉరిమి గొంతులు బాగా నులిమి.. నలిపి నలిపి చంపడానికి ఎదురుచూస్తోంది కాంచన. ఆమె కన్నుల్లో నిప్పుల మంట మండుతోంది. యముడి గజ్జెల గంట మోగుతోంది. పగలు అనే పొగల సెగలు రగులుతున్నాయి. అణువు అణువు భీకరంగా మండుతోంది. శత్రువుకిక కాలం మూడింది. చుక్కలు అన్నీ రాలిపోతాయి. దిక్కులు ఇక పేలిపోతాయి. సింహం నడకల సింగారి రూపంలో మత్యువే వచ్చిందా అన్నంత భయంకరంగా ఉంది కాంచన.
ఆ విలయతాండవరూపం చూడడానికి ధైర్యం చాలదు. అది మానవరూపం కాదు. మత్యువు చేసే భీకరహాస్యం. మండే తన కళ్ళు చూసి ధగధగమండే సూర్యుడే చిన్నబోతాడు. చెలరేగే ఆమె వేగం చూసి సెలయేళ్ళు కూడా అదిరిపోతాయి. అంతటి జ్వాల, అంతటి వేగం ఆమె తనువులోని అణువు అణువులో ఉంది. కుత్తుకలను కోసి నెత్తుటి వరదలు పారిస్తుంది. కాంచన చేసే సింహ గర్జనకు, కాంచన చేసే పులి గాండ్రింపుకు, కాంచన చేసే ఏనుగు ఘీంకారానికి అందరూ గజగజ వణికిపోతున్నారు.
చేసిన శపథం ముగిసేవరకు తన కళ్ళలోని కోపోద్రిక్త యాగం ఆగిపోదు. ప్రజ్వలించే ఆమె నేత్రాల్లోని విలయాగ్నిభాండం ఆరిపోదు. అప్పటిదాకా కంటిరెప్పలకు కునుకంటే ఏమిటో తెలియదు. అదిలిస్తే చాలు ఆకాశం బెదిరిపోతుంది. కదిలిస్తే చాలు భూమి అదిరిపోతుంది. ఆమె కంటి ఎరుపులో ఆరిపోని సెగలున్నాయి. వేనవేల సూర్యబింబాలున్నాయి. ముష్కర సమూహాన్ని ముక్కలు చేస్తుంది. మూఢులందరిని చెక్కలు చేస్తుంది. ఆమె నిప్పుల కన్ను తెరుచుకుంది. కాబట్టి ఇక అసురసంహారం జరగక తప్పదు. అసురులను సంహరించేదాకా ఆమె ఊరుకోదు.
కాంచన ప్రచండరూపాన్ని ఈ పాటలో చూపించాడు వెన్నెలకంటి. కాంచన ప్రళయరూపంతో పాటు వెన్నెలకంటి కవితావిశ్వరూపాన్ని కూడా ఈ పాట సహస్రముఖాలుగా చూపిస్తోంది.

పాట:
కటికవాళ్ళ కథలు ముగియ/కంటి కొసల అగ్నులెగయ/ కండకండగా ఒళ్ళునరక/కసికసిగా గొంతుకొరక/ మత్యువొచ్చి కేకలిడగ/ ప్రళయనాదం జగతి వినగ/చుక్కచుక్కగ నెత్తురోడ/ దిక్కులన్ని నక్కిచూడ/చిత్రహింస చేయుచుండ/ శత్రువులే మాసిపోవగా/ విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన/ఘొరే కన్ను పండు కన్ను కోపంలో అగ్నులే/మరణ మదంగం అరు నిను చీల్చవచ్చే కాంచన/ పెదవి వణుకు వళ్ళు వణుకు కడకు శత్రుసంహారం జరుగు/కసిగ కసిగ కసిగ నిన్ను ఖండించేసిపోగా/కాలరాచి నేడు నీ కథ ముగించేసిపోగా/వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చిందిరా/హౌరుగాలిలాగ వచ్చెరా/నిన్ను నరికిపోగులెట్టవచ్చెరా/ఆడామగా కలిసివచ్చెరా/ నిన్ను మింగివేయ కాళికొచ్చెరా/ కపాలమాలలు అగ్గిని కురియ/ కన్నులమంటల సెగలు మెరియ/ అకాలవేళలో వేటకువచ్చె లోకమదిరిపోగా/ టక్కరి నక్కలు చేతికి చిక్కంగ/రక్కసి మూకల పీకలు నొక్కంగ/కాళిక నాలుక తెరుచుకువచ్చే కాలమాగిపోగా/కన్నుల పాములు గొంతుల త్రాచులు/అందంగ మెరిసే నాగులు కట్లపాము చుట్లపాము/తెల్లంగ మెరిసే నాగులు/పడగపాము మన్నుపాము నీటైన నీటిపాము/పుట్టలనాగులు బుట్టలనాగులు తోడై వచ్చిందే/ఉరుమురిమి గొంతునులిమి కడతేరుస్తానే/కన్నుల నిప్పులమంట మండుతుంది/కాలుడి గజ్జెల గంట మోగుతుంది/పగల పొగల సెగ రగిలెను మండే కాలం వచ్చింది/చుక్కలు నేలకు రాలిపోయెవేళ/దిక్కులు అన్ని పేలిపోయెవేళ/సింగపు నడకల సింగారి రూపాన మత్యువు వచ్చింది/మండే తన కళ్ళు చూసి సూరీడే చిన్నబోగా/చెలరేగే వేగం చూసి సెలయేళ్ళే అదిరిపోగా/కుత్తుకలే కోసి కోసి నెత్తుటేళ్ళు పారిస్తుంది/లోకాలన్ని భయంతోటి వణికిపోవగా/చేసిన శపథం ముగియు వరకు/రెప్పలకేది కునుకు కునుకు/అదిలిస్తే నింగి బెదురు/కదిలిస్తే భూమి అదురు/కంటి ఎరుపు చూడు చూడు/ఆరిపోని సెగలు రేపు/ముష్కర మూకలు ముక్కలు ముక్కలు/మూఢుల గుంటలు ముక్కలు చెక్కలు/చిచ్చరకన్ను తెరుచుకున్నది/జరుగునిక్కడ అసుర సంహారం.

  • డా||తిరునగరి శరత్‌చంద్ర,
    sharathchandra.poet@yahoo.com
    సినీ గేయరచయిత, 6309873682
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -