ట్రంప్ టారిఫ్ వార్
నవంబర్ 1 నుంచి అమల్లోకి…
ట్రూత్ సోషల్ పోస్ట్‌లో వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా ప్రజలకే భారమంటున్న విశ్లేషకులు
ట్రంప్ చర్యలపై స్వదేశంలోనే వెల్లువెత్తుతున్న విమర్శలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ వాణిజ్య యుద్ధం అనే తేనెతుట్టెను కదుపుతున్నారు. చైనా టార్గెట్‌గా మరోసారి టారిఫ్‌లకు దిగారు. చైనాకు చెందిన అన్ని దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు చెప్పారు. అలాగే అమెరికా తయారు చేసిన కీలకమైన సాఫ్ట్‌వేర్‌పై కఠినమైన ఎగుమతి నియంత్రణలను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ ప్రణాళికలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్‌లో ఈ విషయాన్ని వివరించారు. ట్రంప్ తాజా చర్య ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచుతుందనీ, మరోసారి అనిశ్చిత పరిస్థితులు నెలకొనే ప్రమాదమున్నదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్యం విషయంలో చైనా అత్యంత దూకుడు ప్రదర్శిస్తున్నదని ట్రంప్ ఆరోపించారు.
ఇందుకు అమెరికా కఠినంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 1 లేదా చైనా తదుపరి చర్యలను ఆధారంగా చేసుకొని అంతకు ముందుగానే యూఎస్ వంద శాతం సుంకాలను విధిస్తుందని వివరించారు. ప్రస్తుతం చైనా చెల్లిస్తున్న సుంకానికి అదనంగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే చైనాపై యూఎస్ 30 శాతం సుంకాలు విధించిన విషయం విదితమే. చైనా తయారీ వస్తువువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా, చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ వివరించారు. ఇది అన్ని దేశాలనూ ప్రభావితం చేస్తుందనీ, దీనిలో ఎలాంటి మినహాయింపూ ఉండబోదని పేర్కొన్నారు. తాము తయారు చేసే దాదాపు అన్ని ఉత్పత్తులపై చైనా విస్తృతంగా ఆంక్షలు విధించాలని యోచిస్తోందనే నివేదికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ వివరించారు. ఈ చర్యను ఆయన నైతిక అవమానంగా అభివర్ణించారు. అలాగే నవంబర్ 1న అన్ని కీలకమైన సాఫ్ట్‌వేర్‌లపై ఎగుమతి నియంత్రణలు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్య కేవలం అమెరికన్ విధానానికి మాత్రమే వర్తిస్తుందనీ, ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు కాదని స్పష్టం చేశారు.
రేర్ ఎర్త్స్‌పై చైనా ఆంక్షలు.. ట్రంప్ ఆగ్రహం
అయితే ట్రంప్ అకస్మాత్తుగా వంద శాతం అదనపు సుంకాలు విధించటానికి గల కారణం అరుదైన భూఖనిజాల(రేర్ ఎర్త్ మెటీరియల్స్)పై చైనా విధించిన కొత్త ఆంక్షలే అని తెలుస్తున్నది. ఈ నిర్ణయంపై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగానే చైనాను టార్గెట్‌గా చేసుకుంటూ అదనంగా వంద శాతం సుంకాలు విధించారని వాణిజ్య విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ అరుదైన ఖనిజాలను సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఇతర అధునాతన టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం ఉన్నది. సరఫరాలో దాదాపు 70 శాతం చైనా నుంచే ఉన్నది. ఈ నేపథ్యంలో రేర్ ఎర్త్ ఖనిజాలపై చైనా ఆంక్షలు విధించటమనేది నేరుగా అమెరికా పారిశ్రామిక, రక్షణ అవసరాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ ఖనిజాల కోసం అమెరికా.. చైనా మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నది.
జిన్‌పింగ్‌తో భేటీ రద్దు చేసుకుంటానంటూ ట్రంప్ బెదిరింపులు
మరో రెండు వారాల్లో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించటంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించటం లేదన్న ట్రంప్.. ఆయనతో భేటీని రద్దు చేసుకుంటానని బెదిరించారు. ఇది జరిగిన కొన్ని గంటలకే చైనాపై సుంకాలు విధిస్తూ ట్రంప్ నుంచి ప్రకటన రావటం గమనార్హం.
యూఎస్ కంపెనీలకు నష్టం
ట్రంప్ నిర్ణయాలు ‘తాను తీసిన గొయ్యిలో తానే పడ్డ..’ చందంగా ఉంటున్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చైనాపై ద్వేషమో, ఖజానా నింపుకోవాలన్న ఆలోచనో.. కారణమేదైనా ట్రంప్ చర్యలు అమెరికానే తిరిగి దెబ్బ తీసేలా కనబడుతున్నాయి. ట్రంప్ సుంకాలు సొంత దేశ కంపెనీలనే దెబ్బ తీసే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. అమెరికాలో చాలా కంపెనీలు చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండటమేనని నిపుణులు చెప్తున్నారు.
ఈ విషయం మర్చిపోయిన ట్రంప్.. చైనాపై అదనపు సుంకాలకు దిగుతున్నారు. ట్రంప్ తాజా చర్యకు ప్రతిస్పందనగా చైనా కూడా పరస్పర సుంకాలకు దిగితే అమెరికాకు కష్టాలు తప్పవని వారు అంటున్నారు. గతంలోనూ ఇదే విధంగా సుంకాలు విధిస్తే.. చైనా కూడా గట్టిగా సమాధానం చెప్పింది. పరస్పర సుంకాలకు దిగటంతో ఆ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని వాణిజ్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా పరస్పర సుంకాలతో అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోతున్నాయని షాంఘైలోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సర్వే ఇప్పటికే హెచ్చరించిందని వివరిస్తున్నారు.
అమెరికా వినియోగదారులకే భారం
కొన్ని నెలల క్రితం పరస్పర సుంకాలతో చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలతో ట్రేడ్ వార్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అది ఇంకా కొలిక్కి రాకముందే ఇప్పుడు ట్రంప్ మళ్లీ టారిఫ్ విధింపులతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. చైనాయే టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ట్రంప్ చర్యల పట్ల స్వదేశంలోనే అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పలువురు ఆర్థిక నిపుణులు, మేధావులు, వాణిజ్య విశ్లేషకులు, పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక సుంకాలు, ఎగుమతి నియంత్రణలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని, అది అంతిమంగా అమెరికాలోని వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు. చైనాపై ట్రంప్ చర్యలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు అమెరికన్లతో పాటు ప్రపంచ మార్కెట్‌ను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్యం, ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలుంటాయనీ, సమీప భవిష్యత్తులోనూ ఈ అనిశ్చితి కొనసాగే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. తాజా ఉద్రిక్తతలు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాన్ని కూడా మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని వారు చెప్తున్నారు.