యూపీ సీఎం యోగికి ఎస్పీ ఎంపీ ప్రశ్న
యూపీలో అఫ్ఘాన్ మంత్రి పర్యటన
లక్నో: భారత్‌లో పర్యటిస్తున్న తాలిబన్ పాలనలోని ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శనివారం యూపీకి వెళ్లారు. సహారన్‌పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఇస్లామిక్ సెమినరీని ఆయన సందర్శించారు. అలాగే ఆదివారం ఆగ్రా వెళ్లి ఆయన తాజ్ మహల్‌ను కూడా సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ నేత షఫీకర్ రెహమాన్ బార్క్ గతంలో తాలిబన్‌ను సమర్ధించగా.. ఆయనపై కేసు నమోదు చేయడాన్ని గుర్తు చేశారు. కాగా, ఇప్పుడు అదే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాలిబన్ మంత్రికి పూర్తి భద్రత కల్పిస్తున్నదని ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తెలిపారు.
”భారత ప్రభుత్వం స్వయంగా తాలిబన్ మంత్రి ముత్తాకిని భారత్‌కు ఆహ్వానించి స్వాగతించినప్పుడు, ఎవరూ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తరు. కానీ సంభాల్ ఎంపీ డాక్టర్ షఫీకర్ రెహమాన్ బార్క్ తాలిబన్ గురించి ప్రకటన చేసినప్పుడు ఆయన (బార్క్) సిగ్గుపడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే తాలిబన్ మంత్రి దేవ్‌బంద్, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శిస్తున్నారు. యోగి ప్రభుత్వం ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తున్నది. ఈ ద్వంద ప్రమాణాలు ఎందుకు? ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలి? ఎవరిపై కేసు నమోదు చేస్తారు?’ అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన ప్రశ్నించారు. దీంతో ఎస్పీ ఎంపీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది. నెటిజన్లు కూడా బీజేపీ సర్కారు తన రాజకీయ ప్రయోజనాల కోసం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని ఆరోపిస్తున్నారు.