నరక ప్రాయంగా మారిన ప్రయాణం..
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి నాగులమ్మ వరకు ఉన్నది 13 కిలోమీటర్ల రోడ్డు. కానీ 1300కు పైగా..గుంతలున్నాయంటే రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ గుంతల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు పడి పలువురు ప్రయాణికులు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఈ రోడ్డుపై నిత్యం వందలాది ఇసుక, బొగ్గు లారీలు అధిక లోడ్లతో నడవడంతో రోడ్డు అడుగుకో గుంతగా మారడమే కాకుండా.. అరేవాగుపై నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి రాడ్స్ ధ్వంసమై ప్రమాదకరంగా మారింది.
తాడిచెర్ల-నాగులమ్మ రోడ్డుపై 1300 గుంతలు..
మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి నాగులమ్మ వరకు రోడ్డు గుంతలమయం కాగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రతీ అడుగుకో గుంత చొప్పున రోడ్డు జల్లెడ మాదిరిగా తయారైంది. దీంతో రోడ్డుపై ప్రయాణికులు భయపడుతూ ప్రయాణిస్తున్నారు. ఈ 13 కి.మీ. ప్రయాణం చేయడానికి గంటకు పైగా పడుతోంది. గుంతల్లో పడి ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి పూట ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నామని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, దుబ్బపేట, అడ్వాలపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.