నవతెలంగాణ – హైదరాబాద్ : అక్టోబర్ 13న జరగనున్న గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్-సిసి అధ్యక్షత వహించనున్నట్లు ఈజిప్ట్ కార్యాలయం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం షర్మ్ ఎల్ -షేక్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇరవైకి పైగా దేశాల నేతల భాగస్వామ్యంతో ఈ సమావేశం జరగనుందని ఈజిప్ట్ కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గాజా భూభాగంలో యుద్ధాన్ని ముగించడం, మధ్య ప్రాచ్యంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయడం,ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వంతో కూడిన కొత్త శకానికి నాంది పలకడం ఈ సమావేశం లక్ష్యమని పేర్కొంది.
యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్‌స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌లు హాజరుకానున్నారని తెలిపింది.
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేది లేదని హమాస్ తేల్చిచెప్పింది. ఈ సమావేశంలో తమ భాగస్వామ్యం ఉండబోదని హమాస్ రాజకీయ విభాగ సభ్యుడు హసమ్ బద్రన్ తెలిపారు. గాజా శాంతి ఒప్పందంపై చర్చల కోసం గతంలో హమాస్ ప్రధానంగా ఖతార్ మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో వ్యవహరించిందని అన్నారు.