బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్ది రాములు డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
బిజెపి కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీ ని ఎత్తివేయాలని బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్ది రాములు బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు 2025 అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. 11న పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో మొదటి రోజు బహిరంగ సభ అనంతరం రెండవ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో 13 జిల్లాల నుండి హాజరైన బహుళజన బీడీ కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశంలో ఎస్. సిద్ది రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు చాలిచాలని వేతనాలతో ఉపాధి పొందుతున్నారని ఎస్. సిద్ది రాములు తెలిపారు.
పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడంతో పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 6 వేలు రాష్ట్ర ప్రభుత్వం 4 వేలు కలిపి నెలకు 10 వేల రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు పీఎఫ్ తోపాటు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసియుటిసి రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. ఎల్లయ్య, చాట్ల పోశవ్వ, బి. అరుణ, బి. జగదీష్, ఎస్.డి. సయ్యద్, లక్ష్మి, భారతి, గంగా మణి, బిఎల్ టీయూ నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి గంగా శంకర్ బీడీ పరిశ్రమ విస్తరించిన13 జిల్లాల నుండి 300 మంది కార్మిక ప్రతినిధుల హాజరయ్యారు.