పుస్తకాలు చదవడం చాలా బాగుంటుంది. చదువుతున్న సమయంలో మనకేమీ అనిపించకపోవచ్చు. ఆ ప్రభావం మాత్రం తప్పకుండా మనపై ఉంటుంది.
ఆ పుస్తకంలో ప్రవహించే కాలానికో, మనుషుల ప్రవర్తనకో, పరివర్తనకో… ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం వదిలేసుకుని సంబ్రమంగా ఆలోచనలో పడిపోతాం. అటువంటి ఓ సందర్భమే మాలిమిగా నన్ను చేరి నా ఆలోచనలో ఏకమైంది.
‘పంజరం’ నవల అనువాద పుస్తకం. ఒరిజినల్ పంజాబీ రచయిత అమతాప్రీతం రచించిన ‘పింజరి’ నుండి అనువదించబడింది.
ఈ పుస్తకం ఇప్పటికి మూడు సార్లు చదివాను. చదివిన ప్రతిసారీ కొన్ని పరిస్థితులు మారని చరిత్రకు ప్రతిరూపాలుగా నిలబడుతున్నాయి. కొన్ని మాత్రం ఎన్నో సందర్భాల్లో ఆధునికతలో రూపం మార్చుకున్న అవే సంకెళ్ళు మన చుట్టూ పంజరాల్ని నిర్మించినట్లుగా తోస్తుంది.
ఈ నవలా కథానాయక పూరో పాత్ర ఎందరో స్త్రీల స్వాతంత్రాన్ని పంజరంలో బంధించడం చూపిస్తూ ఉంటుంది.
ఒక సందర్భంలో ఇల్లు అంటే రక్షణ ఇచ్చేది గానే ఉన్నా.. ఆ గోడలకు తెలుస్తుంది, ఆ ఇంటి స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్రం అని చెప్తారు.
ఏ కులం, మతంలోనైనా స్త్రీ అస్తిత్వానికి ఆంక్షల సంకెళ్లు ఎప్పుడూ ఉంటాయి. సాంప్రదాయాల పంజరాన్ని తొడిగినప్పుడు ఆమె ఆలోచనల్లో వచ్చే మార్పుతో ఈ సాంప్రదాయ గోడలు కూలిపోతాయన్న భయంతో, ఆ ఆలోచనని కూడా అందనంత దుర్లభంగా కుటుంబ ఇంటి గోడలు దఢంగా నిర్మించబడ్డాయని నమ్మితీరాలి.
యుద్ధకాలాన్ని రచించిన పుస్తకం ఇది. ఆ యుద్ధ కాలంలో స్త్రీని ఆస్తిగా, కుటుంబ గౌరవానికి ప్రతీకగా పరిగణించే చోట స్త్రీలు అధిక హింసకు గురి అవుతారు ఈ పురుషాధిక్య ప్రపంచంలో.
యుద్ధం ఎవరికీ మంచి చేసింది లేదు. ఈ యుద్ధ కాలం మాత్రం స్త్రీలకి హింసా కాలం. ఏ దేశ స్త్రీలైనా, ఏ ప్రాంతపు స్త్రీలైనా.. తరతమ బేధాలు లేకుండా మతరహితంగా, మతోన్మాదంతో.. హింసకు గురి అవుతారు.
అటువంటి సందర్భాన్ని వివరిస్తుంది ఈ నావలలోని కథాసమయం. అంతటి హింసలో కూడా వెనకడుగు వేయకు అని అస్తిత్వ పోరాటాన్ని కొనసాగించిన కథానాయక ‘పూరో’ ని అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా నిలబెట్టిన ఈ రచన నన్ను ప్రభావితం చేసింది. స్త్రీల పక్షాన ఆలోచించే ప్రేరణ కలిగించింది. స్వాతంత్య్ర సమయంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రాసిన నవలే కానీ, ఆధునికంగా మనం ఎంత ఎదిగినా స్త్రీ పరిస్థితి, మత మౌడ్యం, నానాటికీ దిగజారిపోతున్న వ్యవస్థలో అప్పుడూ, ఇప్పుడు నలిగిపోయింది, పోతుంది మాత్రం స్త్రీనే. నైతికత లోపించిన మానవత్వం లేని మూకలు పేట్రేగిపోతున్నాయి.
గత రెండు వారాలుగా జరుగుతున్న యుద్ధకాలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పుస్తకాన్ని మీ అందరితో పంచుకుంటున్న.
- రూపరుక్మిణి. కె