నా అక్షర శాంతి వికిరణాలు
సామాన్యుని హక్కుల
స్వర దర్పణ స్వేచ్ఛా ప్రతిబింబాలు
కాలాస్తిత్వ జాడల మేఘాలను చెరిపేసే
నవ్య గగన ఉపగ్రహ దారులపై
యువతర ప్రేరణ పర్యావరణ గీతాలు
విప్లవ గుండెల సవ్వడి వినే
శబ్ద సౌందర్య ప్రమాణాల ప్రతిధ్వనులు
ఉద్యమ జనజీవన స్రవంతిని
నడిపే రథసారథుల జ్వాలలు
అజ్ఞాన బతుకు గోడలను
నిలువునా స్కానింగ్ చేసి
అడ్డంగా అలవోకగా కూల్చేసి
శాస్త్రీయ ఇటుకలతో రవీంద్రుని
గీతాంజలి సమానత సామ్రాజ్యాన్ని
నిర్మించే కలల తారల తళుకులు
నా కవిత
ఓ నూతన తత్వ ప్రభాత భవిష్యత్ గీత
నా సాహిత్యం
మహాత్ముని సత్య స్వప్న సం’దేశపు’
స్వాతంత్య్రపు స్ఫూర్తి రాత
భగత్ సింగ్ భావ కావ్యాల
దేశభక్తి యుద్ధ శంఖారావం
వివేకానంద అభ్యుదయ
మత సామరస్యపు సమర నినాదం
నా కవిత్వం ఓ నిత్యత్వం
నా కలం ఓ విజ్ఞాన శరం
నా ఆలోచనల ముఖచిత్రం
శతాబ్దాల ఉదయ యానం
అనంత విశ్వసేద్యంలో
గెలాక్సీల సముదాయం.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536