Monday, October 13, 2025
E-PAPER
Homeదర్వాజమూలవాసుల స్వరం ద్రావిడ మహాసముద్రం

మూలవాసుల స్వరం ద్రావిడ మహాసముద్రం

- Advertisement -

గూండ్ల వెంకటనారాయణ తాజా కవితాసంకలనం ”ద్రావిడ మహాసముద్రం”. ఇది కేవలం ఒక కవితా సంకలనం కాదు- ఒక సైద్ధాంతిక ప్రకటన, ఒక చారిత్రక పునర్నిర్మాణ ప్రయత్నం, ఆధిపత్య భావజాలంపై ఎక్కుపెట్టిన ఒక వాడి అయిన అస్త్రం. డా. జిలుకర శ్రీనివాస్‌ తన ముందుమాటలో అన్నట్లు ఇది ‘ఒక ఐడియలాజికల్‌ మెటఫర్‌’. మరొక ముందుమాటలో పల్లెపట్టు నాగరాజు ”సత్యం కోసం నిలబడేవాళ్ళు, సత్యం కోసం పలవరించే వాళ్ళు, సత్యం ఎంత సౌందర్యవంతమైందో అనుభవించేవాళ్ళు, ఈ పుస్తకాన్ని తెరవండి, కాలం గుండె చప్పుడు వినండి అంటాడు. అది నిజం. ‘ద్రావిడ మహాసముద్రం’ ఈ కాలపు దళితబహుజనుల గుండెచప్పుడు.

ఈ పుస్తకం ఆత్మ ద్రావిడవాదం, కానీ అది కేవలం భౌగోళిక, రాజకీయ అస్తిత్వానికి పరిమితమైనది కాదు. కవి దష్టిలో ద్రావిడవాదం ఒక తాత్విక చింతన.
భరతఖండానికి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి మూలవాసుల (ద్రావిడుల) మహోన్నత నాగరికతను ధ్వంసం చేసి, వారి చరిత్రను వక్రీకరించారని కవి బలంగా వాదిస్తాడు. ఈ ఆర్య ఆధిపత్య సంస్కతిని, వారి దేవుళ్ళను, పురాణాలను కవి నిర్మొహమాటంగా తిరస్కరిస్తాడు.

”దేవుడికి ఆకలి అవుతుంది/ నోటిలో నెత్తురు పిండితే కానీ ఆకలి తీరదు అంటాడు”
ఇక్కడ ‘దేవుడు’ అనే ప్రతీక, కేవలం ఒక మతపరమైన భావన కాదు. అది ఒక దోపిడీ వ్యవస్థకు, తన ఆధిపత్యంతో తన ప్రజలనే బలులగా కోరే ఆధిపత్య శక్తికి రూపకం.

”అక్కడ ఒక తోట ఉండేది/ అది పూలతో, పండ్లతో ఇంకా నీడలతో గుబురుగా ఉండేది./ ఉదయసాయంత్రాల ఎండపొడితో ఒళ్ళుతోముకునేది/ రాత్రి నక్షత్రాలను అంటించుకుని మురిసిపోయేది/ చల్లని గాలులను మూటగట్టుకొని పైకి వెదజల్లుతూ ఉండేది/ కానీ ఒకనాడు అక్కడికో గోవు వచ్చింది/ పూలను తుంపేసింది/ తోకతో మొక్కలను విరిచింది/ అక్కడ తేనె నెత్తురులా పారింది/ నక్షత్రాలను, సీతాకోక చిలుకలను/ తేనెటీగలను కాళ్లకింద నలిపేసింది/ చల్లని గాలులను తరిమేసింది.”

ఈ కవితలో తోట అంటే కేవలం భౌతికమైన తోట కాదు. ఆర్యులరాక ముందు హరప్పాకాలం నుండీ ఈ నేలపై విలసిల్లిన ద్రావిడ సంస్కతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నేల మూలవాసులైన దళిత బహుజనుల సంస్కతి, వారి ప్రాకతిక కళలు, శాంతి, సౌభాగ్యం, సౌందర్యం, ఆనందం నిండిన జీవనవిధానం. ఆర్యుల రాకను పవిత్రమైన గోవుతో పోలుస్తున్నాడు కవి. ఇదొక గొప్ప మెటఫర్‌. ఆ గోవు తోటను నాశనం చేసిందడంలో, ఆర్యులు మూలవాసుల కళలను, జీవనవిధానాన్ని, సామాజిక సాంస్కతిక వ్యవస్థలను ధ్వంసం చేసిన వైనాన్ని మార్మికంగా చెబుతున్నాడు.
ఆధిపత్య గాథలలో రాక్షసులుగా, దస్యులుగా, దెయ్యాలుగా చిత్రీకరించబడిన వారే ఈ నేల అసలైన బిడ్డలని, ఒకనాటి పాలకులని కవి గర్వంగా ప్రకటిస్తాడు. నిరాకరించబడిన గుర్తింపులను తిరిగి స్వీకరించి, వాటిని గౌరవ చిహ్నాలుగా మార్చుతాడు.

”అప్పుడు ఈ నేల మీద ఎన్నో దెయ్యాలు ఉండేవి/ ఎంతో ముద్దుగా, ముచ్చటగా ఉండేవి”
ఈ వాక్యం ఒక అద్భుతమైన పునర్నిర్మాణం. ‘దెయ్యం’ అనే తిట్టును ఒక సహజమైన, అందమైన అస్తిత్వంగా మార్చడం ద్వారా, కవి ఆధిపత్య భాషను ధ్వంసం చేస్తున్నాడు.

”పంది తన రెక్కలతో నింగికి ఎగిరింది/ నేలను చూసింది/ అడవిని చూసింది/ ఊరిని చూసింది/ అలా ఎగురుతూ పక్షులతో స్నేహం చేసింది/ రకరకాల పండ్లను తిన్నది, తేనెను రుచి చూసింది/ మేఘాలపై నిద్రించింది/ గాలులతో ఆటలు ఆడింది”… (రెక్కలపంది)

బ్రాహ్మణవాద ఉన్నతవర్గాల సౌందర్యశాస్త్రం పందిని నీచ జంతువు అంటుంది. దాన్ని అణచివేతకు గురైన వర్గాలకు ప్రతినిధిగా, కవితా వస్తువుగా చేయటం ఒక ధిక్కారం.
ఆ రెక్కలు కేవలం కల్పన కాదు అవి చదువు, చైతన్యం, ఆత్మగౌరవం, తిరుగుబాటు. హెజిమోనిక్‌ బావజాలాన్ని తిరస్కరించటం.
ఈ కావ్యం మహాత్మా ఫూలే ఆవిష్కరించిన ఆర్య-అనార్య, బ్రాహ్మణ-అబ్రాహ్మణ ద్వైదీకత సంబంధాల వ్యక్తీకరణే అని స్పష్టమవుతుంది. రచయిత ఈ పుస్తకానికి రాసుకొన్న ముందుమాటలో తన స్వప్నం కోసం ”అంబేద్కర్‌, మార్క్స్‌ అనే రెండు కాగడాలను పట్టుకొని పెరియార్‌ చూపుతో” తన కవిత్వంలో తిరుగుతానని చెప్పుకోవడం ఈ భావజాల స్పష్టతకు నిదర్శనం.
”ఒరే బ్రాహ్మడా! నువ్వంటే ఎంతిష్టమో తెలుసా అంటూ మొదలయ్యే ఒక కవితలో

”రా, నా బిడ్డను నీ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను/ నీ కుమార్తెను నా కొడుక్కి ఇవ్వు” అనడం కేవలం పెళ్లి ప్రతిపాదన కాదు. అది కుల నిర్మూలనకు డా. అంబేద్కర్‌ ప్రతిపాదించిన సూటియైన, విప్లవాత్మక మార్గం.

”ఆ మడి కట్టులో నువ్వెంత మగ్గి పోయావో కదా/ ఊరి చివర వెట్టివాడిగా నేనూ అంతే కుమిలిపోయాను” అంటాడు. ఇక్కడ కులం అనేది కేవలం అణగారిన వర్గానికే కాదు, ఆచారాల చట్రంలో బందీ అయిన బ్రాహ్మణుడికి కూడా ఒక చెరసాలేనని కవి గుర్తిస్తాడు. ఇలాంటి వాక్యాలు రాయాలంటే మనుషులపట్ల అపారమైన ప్రేమా, లోతైన సామాజిక అవగాహనా ఉండాలి.

చారిత్రిక, సైద్ధాంతిక వస్తువును కవిత్వరూపంలో చెప్పటం సాహసం అయినప్పటికీ వెంకట నారాయణ తన భావజాలాన్ని కేవలం నినాదాల రూపంలో కాకుండా, శక్తివంతమైన కవితా శిల్పంతో ఆవిష్కరించారు. దీనిని సాధించడానికి కవి జానపద కథనాత్మకత, ప్రతీకాత్మక, సంభాషణాత్మక శైలులను ఎంచుకొని చెప్పదలచుకొన్న వస్తువును సూటిగా స్పష్టంగా, బలంగా చెప్పగలిగాడు.
ఈ సంకలనంలోని అనేక కవితలు చిన్నచిన్న జానపద కథల రూపంలో ఉంటాయి. కథనాత్మకత పాఠకుడిని సులభంగా కట్టిపడేస్తుంది. ‘రెక్కల పంది’ కవిత ఇందుకు చక్కటి ఉదాహరణ.
‘పల్లెలో వెన్నెల’ కవితలో ఒక పండితుడు అందమైన వెన్నెల తనపైనే కాకుండా ”అధముల పల్లె” పై (దళితులు) కూడా కురుస్తున్నందుకు అవమానంగా భావించి దొరకు చాడీలు చెప్పి ఆ పల్లెను తగలబెట్టిస్తాడు. ఇది కులాధిపత్యంలోని దౌష్ట్యాన్ని కళ్ళకు కడుతుంది.
ఈ కవిత్వంలో ప్రతీకలు కీలక పాత్ర పోషిస్తాయి. ‘ఆవు’ పూజ్యనీయమైనదిగా, ‘పంది’ అపవిత్రమైనదిగా నిర్మించిన సామాజిక సంకేతాలను కవి తలకిందులు చేస్తాడు. ‘నలుపు’ రంగును ఆత్మగౌరవానికి, సౌందర్యానికి ప్రతీకగా నిలబెడతాడు.

”నాయనా ఇలా రా! కాస్త నలుపెక్కుదాం/ నలుపు జాతరలో బూరలమవుదాం”
”పిల్లా! నీ కర్రెపెదాల మీద పూసిన వానపూగుత్తి ఇది/ నీకోసం నేను కట్టిన నల్లపదం ఇది” అంటాడు ‘నల్లపదం’ అనే కవితలో. ఇది కేవలం నలుపు రంగు గురించి కాదు, అణచివేయబడిన గుర్తింపును ఉత్సవంగా జరుపుకోవడం గురించి.

కవి ఎక్కడా అభ్యర్థన స్వరంతో మాట్లాడరు. ఆయన స్వరం నిండా ఆత్మవిశ్వాసం, ధిక్కారం, మరియు హక్కుగా అడిగే తత్వం కనిపిస్తుంది. ”మా కక్కయ్య మద్దూరి నగేష్‌ బాబుకి” అనే కవిత ఇందుకు పరాకాష్ట. బ్రాహ్మణుడిని సంబోధిస్తూ, ప్రేమను, ఆవేదనను, కోపాన్ని కలగలిపి, కుల నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకతను ఒక సంక్లిష్టమైన సంభాషణగా మలిచారు.
ఈ పుస్తకంలోని అతిపెద్ద బలం దాని సైద్ధాంతిక స్పష్టత. రచయిత దేని తరపున నిలబడుతున్నాడో, దేనిని వ్యతిరేకిస్తున్నాడో ఎక్కడా సందిగ్ధత లేదు.
‘ద్రావిడ మహాసముద్రం’ అనే శీర్షికే ఒక శక్తివంతమైన రూపకం. ఇది హిందూ మహాసముద్రం అనే ఆధిపత్య నామకరణాన్ని తిరస్కరించి, ఈ నేలపై, సముద్రంపై మూలవాసుల హక్కును ప్రకటిస్తుంది.

కవిత్వాన్ని అలంకారయుతం చేసే ప్రక్రియలో, అనివార్యంగా వస్తువును కొంతమేరకు రూపకాలు, ప్రతీకల మాటున కప్పి చెప్పవలసి ఉంటుంది. చారిత్రిక, రాజకీయ, సైద్ధాంతిక వస్తువును కవిత్వ రూపంలో చెప్పినప్పుడు పాఠకుడు దాని సౌందర్యాన్ని ఆస్వాదించే క్రమంలో దానిలోని చారిత్రక విమర్శను గుర్తించలేకపోవచ్చు.
సిద్ధాంతాలను కవిత్వరూపంలో చెప్పటం కత్తిమీద సాము. ఈ విషయంలో వెంకటనారాయణ వస్తువుకు సరిపడే రూపాన్ని ఎన్నుకోవటంద్వారా ఆ పరిమితిని అధిగమించి విజయం సాధించారని చెప్పవచ్చు.
‘ద్రావిడ మహాసముద్రం’ తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా దళిత-బహుజన, ద్రావిడవాద సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగం. తెలుగు సాహిత్యంలో ఇలాంటి వస్తువుపై వచ్చిన కవిత్వంలో ఇదే మొదటిది కావచ్చు.
ద్రావిడ మహాసముద్రం అణగారిన వర్గాల వేదనను, ఆగ్రహాన్ని, వారి ఆకాంక్షలను ఇంకా వారి ఉజ్వలమైన భవిష్యత్‌ స్వప్నాన్ని అత్యంత శక్తివంతంగా నమోదు చేసింది. ఇది కేవలం చారిత్రక గాయాలను తడమడమే కాదు, భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన ఒక సమసమాజపు చిత్రపటాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. గూండ్ల వెంకటనారాయణ కవిగా, ఒక సైద్ధాంతిక యోధుడిగా తన కలం ద్వారా ఒక బలమైన పొలికేక పెట్టాడు.

బొల్లోజు బాబా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -