ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 18శాతం పెంచాలని తీర్మానం చేసినా అమలు కాలేదు
మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శలు చేస్తున్నారు : మంత్రి వివేక్ వెంకటస్వామి
గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా మాలల సదస్సు
నవతెలంగాణ-కంఠేశ్వర్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి ఉత్సవం సందర్భంగా మాల సంఘం జిల్లా అధ్యక్షులు చోక్కం దేవిదాస్, కన్వీనర్ అలుక కిషన్ ఆధ్వర్యంలో మాలల ఐక్య సదస్సును నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన మాలల గర్జనతో మాలల్లో ఐక్యత పెరిగిందని అన్నారు. దేశంలో ఒక సామాజిక తరగతికి చెందిన సభ అంత పెద్దగా జరగటం అదే మొదటిసారని తెలిపారు. మాలల కోసం పోరాటం చేస్తుంటే.. కొందరు కుట్రలు చేసి.. సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేశారని అన్నారు. ఆనాడు ఎస్సీ రిజర్వేషన్‌ను 15 నుంచి 18శాతం పెంచాలని తీర్మానం చేశామని.. కానీ అమలు కాలేదన్నారు. దేశంలో ఇంకా కులవివక్ష ఉందని.. అందుకే మాల ఉద్యోగులకు వేధింపులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నానని, అయినా తన మీద కావాలనే కొందరు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి లక్ష్మణ్ అంశంలోనూ అనవసరంగా తన పేరు ప్రచారం చేశారని గుర్తు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకా అని, మంత్రి లక్ష్మణ్ కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు మాట్లాడుతూ.. మాలల వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాడుతూనే వస్తున్నామని అన్నారు. అన్ని కుల సంఘాలు సహకరించి బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. తాను ఐపీఎస్‌గా తన విధులకు ఆటంకం కలిగించకుండా పనిచేశానని గుర్తు చేశారు. కానీ రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతుందని, దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల గ్రూప్-1, గ్రూప్-2లో విజయం సాధించిన అభ్యర్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నాయకులు దయానంద్, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఇంకా కులవివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES