Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచీఫ్‌ జస్టిస్‌పైనే కాదు రాజ్యాంగంపై దాడి

చీఫ్‌ జస్టిస్‌పైనే కాదు రాజ్యాంగంపై దాడి

- Advertisement -

దేశ ప్రజల్లో నింపుతున్న విద్వేషాల ఫలితమే …
సనాతన ధర్మం ముసుగులో ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు
గవారుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌, డీవైఎఫ్‌ఐ రౌండ్‌ టేబుల్‌లో అంబేద్కర్‌ వాదులు జేబీ రాజు, డాక్టర్‌ అప్పికట్ల భరత్‌భూషణ్‌
15న జిల్లా కేంద్రాల్లో నిరసనలు : రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్ పై జరిగిన దాడి వ్యక్తిపైనే కాదు..భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా చూడాలని అంబేద్కర్‌ వాదులు జేబీ.రాజు, డాక్టర్‌ అప్పికట్ల భరత్‌ భూషణ్‌ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు అధ్యక్షత వహించగా..గవాయ్ పై దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనెగంటి వెంకటేష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సామాజిక, ప్రజాస్వామిక సంఘాల వాళ్లు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా జేబీరాజు, భరత్‌భూషణ్‌ మాట్లాడుతూ..ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగులోని అరాచక న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ తన బూటును సీజే గవాయ్ పై విసిరి దాడికి పాల్పడ్డాడనీ, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ పథకం ప్రకారం జరిగిన దాడి అని చెప్పారు. చీఫ్‌ జస్టిస్‌గా దళితుడు ఉండటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. సనాతన ధర్మంలో సమానత్వం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలకు రావాలన్న ఆహ్వానాన్ని గవాయ్ తల్లి తిరస్కరించడం, యూపీలో బీజేపీ సర్కార్‌ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తున్న సందర్భంగా జస్టిస్‌ గవాయ్ బుల్డోజర్‌ న్యాయం చెల్లదు.. రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడమే ఈ ఘటనకు కారణమని వివరించారు. సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ మాట్లాడటాన్ని బట్టే దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉందని అర్థమవుతున్నదని చెప్పారు. సనాతన ధర్మం ముసుగులో దేశంలో ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలకు పూనుకోవడం, వినని వారిని చంపేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దాడికి ప్రధాని పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేటకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగులోని ఇద్దరు న్యాయవాదులు గవాయ్ పై సోషల్‌మీడియా వేదికగా అనుచిత పోస్టులు చేయడాన్ని తప్పుబట్టారు. గవాయ్ పై దాడిచేసిన సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశ ప్రజల, ముఖ్యంగా యువత మెదళ్లలో విద్వేషాలను నింపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఆయా సంఘాల నాయకులను డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌ వేదికపైకి ఆహ్వానించగా..కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.కృపాసాగర్‌ వందన సమర్పణ చేశారు.

కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ శ్రీరామ్‌ నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, టీపీఎస్‌కే రాష్ట్ర కన్వీనర్‌ భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌, ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, తెలంగాణ ప్రయివేటు టీచర్స్‌, లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏ.విజయ్ కుమార్‌, ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్‌ బంధు సొసైటీ వ్యవస్థాపక అద్యక్షులు పల్లెల వీరస్వామి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పరశురాం, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి (జార్జిరెడ్డి)ఎస్‌ నాగేశ్వరరావు, సామాజిక కార్యకర్త ఆంజనేయులు, చెన్నయ్య, రాజేశ్వర్‌ రావు, జై భీమ్‌ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, ఏఐఎస్‌ఎఫ్‌ ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఉప్పల ఉదయ్ కుమార్‌, పీడీఎస్‌యూ కార్యదర్శి మంద నవీన్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర మోహనకృష్ణ, సామాజిక ఉద్యమ కార్యకర్త మేడి రమణ, బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకులు.. ఎమ్‌డీ జావీద్‌, ఎస్‌ శ్రీనివాస్‌ హష్మీ, డి.రమేష్‌, విజయ్ కుమార్‌, బాణాల వెంకన్న, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -