నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్ మండలం రామ్ రెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గద్వాల జిల్లా మల్దకల్ పట్టణ కేంద్రానికి చెందిన నగేష్, పద్మమ్మ దంపతుల ఐదు మంది ఆడపిల్లల్లో మూడో కూతురు ప్రియాంక (15) పదవ తరగతి వరకు అదే మండలం గురుకులంలో చదువుకుంది. ఇంటర్‌లో కూడా అక్కడే సీటు వస్తే అక్కడ నుంచి ఆమెను మహబూబ్‌నగర్ గురుకులానికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఆమె ఇక్కడే చదువుతుంది.
మూడు రోజుల క్రితం హాస్టల్ వాతావరణం సక్రమంగా లేదని, ఇక్కడ చదువుకోను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు వివరించింది. అయితే తాము సోమవారం వస్తామని కూతురికి నచ్చజెప్పారు. అయితే సోమవారం ఉదయం హాస్టల్ బాత్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి చనిపోయింది. బాత్‌రూం తలుపు తీయకపోవడంతో విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ వచ్చి గమనించి ఆమెను వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని మృతిచెందని నిర్ధారించారు. హాస్టల్‌లో 800 మందికి పైగా విద్యార్థులు ఉండడంతో అసౌకర్యంగా ఉన్నందుకే తన కూతురు హాస్టల్ నచ్చక చనిపోయిందని తండ్రి ఆరోపించారు.