Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్17న కలెక్టరేట్ ముందు త్రిబుల్ ఆర్ రైతులతో నిరసన దీక్ష, వంటా వార్పు

17న కలెక్టరేట్ ముందు త్రిబుల్ ఆర్ రైతులతో నిరసన దీక్ష, వంటా వార్పు

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ పిలుపు
నవతెలంగాణ – భువనగిరి

గత రెండేళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 మండలాల రైతులు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని తమ సారవంతమైన పంట పొలాలను, భూములను కోల్పోతున్నామని రైతులు జిల్లా కలెక్టర్ కు, ఎమ్మెల్యేలకు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా సంపన్న వర్గాల కొమ్ముకాస్తూ అలైన్మెంట్ మార్చడం లేదని అందుకే అలైన్మెంట్ మార్చాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 17న త్రిబుల్ ఆర్ రైతులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ” సామూహిక నిరసన దీక్ష – వంట వార్పు ” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు. అదివారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో ముఖ్య నాయకుల సమావేశం జరగగా ఈ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు.

త్రిబుల్ ఆర్ భూసేకరణ ప్రారంభంలో ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో త్రిబుల్ ఆర్ రోడ్డు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల, భూస్వాముల భూములను కాపాడడం కోసం నూతన అలైన్మెంట్ ను 25 నుండి 28 కిలోమీటర్ల కుదించారని విమర్శించారు. దీంతో చౌటుప్పల, భువనగిరి మున్సిపాలిటీలు మూడు ముక్కలుగా అవుతున్నాయని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తమ ఇష్టానుసారంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ చేస్తే దాన్ని మారుస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత యధావిధిగా అమలు చేస్తుందని విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే అలైన్మెంట్ కు అనుమతి ఇవ్వమని చెప్పిన బిజెపి ఉత్తర, దక్షిణ భాగాలలో అనుమతి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ మూడు రాజకీయ పార్టీలు రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని న్యాయబద్ధమైన రైతుల డిమాండ్ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిందిపోయి రైతులపై కక్షపూరితంగా వ్యవరించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

ఇప్పటికైనా బాధిత రైతులతో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరిపి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ” సామూహిక నిరసన దీక్ష – వంటావార్పు కార్యక్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ నెల 24, 25 తేదీలలో చౌటుప్పల, భువనగిరి ఆర్డిఓ కార్యాలయాల ముందు  దీక్షలు చేపడుతామని జహంగీర్ తెలిపారు.  ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి , గడ్డం వెంకటేష్ , నాయకులు ఈర్లపల్లి ముత్యాలు , లావుడియ రాజు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -