Monday, October 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్‌రంగంపై బీజేపీ కుట్ర‌లు

విద్యుత్‌రంగంపై బీజేపీ కుట్ర‌లు

- Advertisement -
  • సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలో విద్యుత్‌రంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎ) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. కేంద్ర ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో అదానీకే లాభం కలుగుతుందన్నారు. ప్రజలు, రైతులు, వినియోగదారులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్‌ సబ్సిడీలు రద్దయ్యే అవకాశముందని చెప్పారు. విద్యుత్‌ ప్రయివేటీకరణ దేశానికే ప్రమాదకరమని అన్నారు. విద్యుత్‌ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. విద్యుత్‌ సవరణ చట్టం`2025 పేరుతో ఈనెల తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను విడుదల చేసిందన్నారు. 30 రోజులపాటు అభ్యంతరాలను తెలపాలంటూ గడువు విధించిందని చెప్పారు. 2021లో విద్యుత్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తే తీవ్ర ప్రతిఘటనతో వెనక్కి తగ్గిందని అన్నారు. 2022లో మళ్లీ సవరణలు తెస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయనీ, దాన్ని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అప్పగించిందని వివరించారు. అది చట్టరూపం దాల్చలేదన్నారు.

పాత అంశాలతోపాటు కొత్తవి జోడిరచి విద్యుత్‌ సవరణ చట్టం ప్రతిపాదనలను దుర్మార్గం, ప్రమాదకరంగా రూపొందించిందని విమర్శించారు. ఈ సవరణలు అమల్లోకి వస్తే విద్యుత్‌రంగమంతా ప్రయివేటీకరణ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌రంగం అదానీ ఆధీనంలోకి వెళ్తుందన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రయివేటుపరమవుతాయని అన్నారు. రైతులు, విద్యార్థులు, బలహీనవర్గాలకు వర్తించే విద్యుత్‌ సబ్సిడీలు రద్దవుతాయని చెప్పారు.

విద్యుత్‌ రంగం రాష్ట్రాల పరిధిలో ఉన్నా వాటికి హక్కు లేకుండా కేంద్రం సవరణలు చేస్తున్నదని విమర్శించారు. ఫెడరలిజంపై దాడి చేస్తున్నదని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అమలు చేయడం వల్ల రైతాంగానికి మేలు కలుగుతున్నదని వివరించారు. విద్యుత్‌ సవరణలు అమలైతే ఉచిత విద్యుత్‌ ఉండబోదనీ, రైతులు విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుందనీ, లేదంటే విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించాల్సి ఉటుందని చెప్పారు.

విద్యుత్‌ చార్జీలు, వినియోగదారులకు సంబంధించిన నిర్ణయంపై ఈఆర్సీకి కొంత వెసులుబాటు ఉండేదని గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం ఖర్చుకు అదనంగా లాభం జోడిరచి విద్యుత్‌ చార్జీలను నిర్ణయిస్తారని అన్నారు. వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం పెరుగుతుందన్నారు. ఈఆర్సీలు రబ్బర్‌స్టాంపులుగా మారిపోయే ప్రమాదముందని చెప్పారు. విద్యుత్‌ చార్జీలను సవరించాలంటే ప్రస్తుతం ఈఆర్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తాయని గుర్తు చేశారు. కొత్త చట్టం వస్తే సుమోటోగా ఏప్రిల్‌ ఒకటి నుంచి విద్యుత్‌ చార్జీల పెంపు అమల్లోకి వచ్చేలా మార్పులు చేస్తున్నారని విమర్శించారు.

ఈ ప్రమాదకరమైన మార్పులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు, రైతులు, సంఘాలు ముందుకు రావాలనీ, కేంద్రం తీరుకు నిరసనగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్‌ మీటర్లు కూడా ఇందులో భాగమేనన్నారు. కేంద్రం నిర్ణయాలను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. విద్యుత్‌ కూడా నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా అదానీకి కట్టబెట్టాలను కోవడం సరైంది కాదన్నారు. విద్యుత్‌రంగం ప్రజలకు సేవగా ఉండాలని సూచించారు. ప్రభుత్వరంగంలో విద్యుత్‌ రంగం ఉండాలనీ, కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం కుట్రలో తెలంగాణ భాగం కావొద్దు
తెలంగాణలో ప్రస్తుతం సీపీడీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ రెండు డిస్కంలు ఉన్నాయని రాఘవులు వివరించారు. కొత్త డిస్కం తేవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, ప్రజలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ అమలవుతున్నదని గుర్తు చేశారు. సబ్సిడీ వినియోగించే వినియోగదారులను కొత్త డిస్కం పరిధిలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. కొత్త విద్యుత్‌ సవరణ చట్టం అమల్లోకి వస్తే ఉచిత విద్యుత్‌ అమలయ్యే అవకాశం లేదన్నారు. విద్యుత్‌ రంగం ప్రయివేటుపరం అవుతుందని విమర్శించారు. సీపీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ కాకుండా కొత్త డిస్కం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కుట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిరదన్నారు. కేంద్రం కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగం కావొద్దని కోరారు. దేశంలోని ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు విద్యుత్‌ సవరణలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

భారత్‌పై ట్రంప్‌ కక్ష
భారత్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్‌లతో తీవ్ర నష్టం కలుగుతుందని రాఘవులు చెప్పారు. చైనా మీద వంద శాతం టారిఫ్‌లను పెంచిందన్నారు. ఇరాన్‌లో చమురు దిగుమతి చేసుకుంటున్నారనే పేరుతో ట్రంప్‌ కొత్త టారిఫ్‌ జాబితాను విడుదల చేశారని అన్నారు. హెచ్‌1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచారని వివరించారు. భారత్‌పై ట్రంప్‌ కక్ష పెంచుకున్నారని విమర్శించారు. ట్రంప్‌ పెత్తనాన్ని, దాష్టీకాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అందుకోసం ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ట్రంప్‌ విధించే టారిఫ్‌లో వ్యవసాయరంగంపై ప్రభావం పడుతుందని వివరించారు. దేశంలో వ్యవసాయరంగాన్ని రక్షించుకోకుంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుపీఠిన ఉండాలని కోరారు. ఇంకోవైపు దిగుమతి సుంకాలను రద్దు చేస్తే భారత్‌ తీవ్రంగా నష్టపోతుందన్నారు. సోయాబీన్‌, మొక్కజన్న, పత్తి, పాల ఉత్పత్తుల రైతులు నష్టపోతారని చెప్పారు. మందుల పరిశ్రమ, ఐటీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ఈ పరిశ్రమలను రక్షించుకోవడానికి మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

బీహార్‌లో ఎంఐఎం కక్షసాధింపుతో పోటీ చేయొద్దు
బీహార్‌లో మహాకూటమిలో చేరేందుకు నిరాకరిస్తున్నందుకే వంద సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకున్నట్టు అసదుద్దీన్‌ఒవైసీ ప్రకటించారని రాఘవులు చెప్పారు. రాజకీయ బలం ఉంటే పోటీ చేయొచ్చని అన్నారు. చెప్పినట్టు వినలేదు కాబట్టి నచ్చినట్టు పోటీ చేస్తామంటే సరైంది కాదని వివరించారు. అలా అయితే బీహార్‌ తూర్పు ప్రాంతంలో వామపక్షాలు బలమైన శక్తిగా ఉన్నాయనీ, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశముందని చెప్పారు. కానీ బీజేపీని ఓడించ‌డం కోసం తాము అవసరం మేరకే పోటీ చేస్తున్నామని వివరించారు.

ఫాసిస్టు ధోరణితో ఉన్న బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాజ్యాంగానికి, దేశానికి తీవ్ర నష్టమని అన్నారు. ఒవైసీ కూట‌మి తో క‌లిసి వ‌స్తే బీజేపీని ఓడించ‌డం సులభమవుతుందన్నారు. లేదంటే పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించిందన్న అపవాదు ఒవైపీ మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. లద్దాఖ్‌లో వాంగ్‌చుక్‌ అరెస్టు అప్రస్వామికమని విమర్శించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, రాష్ట్ర ప్రతిపత్తి హామీని నెరవేర్చాలని కోరారు.

న్యాయపోరాటంతోపాటు కేంద్రంతో పోరాడాలి : జాన్‌వెస్లీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. కేంద్రం ఆమోదించకుంటే ఆర్డినెన్స్‌ను తెచ్చి గవర్నర్‌కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్‌ తొమ్మిదిని విడుదల చేసిందని చెప్పారు. దానిపై హైకోర్టు స్టే విధించిందని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. న్యాయపోరాటంతోపాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని కోరారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా చూడాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలనీ లేదంటే ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాల‌ని ఆయన పిలుపునిచ్చారు. పోటీపై నగర పార్టీతో చర్చిస్తామన్నారు. పోటీ చేయకుంటే బీజేపీని ఓడించే పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితులకు సంబంధించి రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. రైతులతో చర్చలు జరపాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -