సమానత మాటల్లోనే – పనుల్లో వివక్ష!
దొంతికుంట పాఠశాలలో ప్రాంగణంలోకి చేరిన నీరు
విద్యుత్,పారిశుధ్యం సదుపాయాల కరువు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సమాజంలో అసమానతలను తొలగించేందుకు రూపుదిద్దుకున్న రాజ్యాంగం అమలవుతున్నా, వాస్తవ జీవితంలో వివక్ష మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం పథకాలు రూపొందించి నిధులు కేటాయించినా, వాటి ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదు. అశ్వారావుపేట మండలంలోని దొంతికుంట (అంబేద్కర్ నగర్) దళిత కాలనీ పాఠశాల దీనికి నిదర్శనం.
వర్షం వస్తే వరదలా మారే ప్రాంగణం
సోమవారం కురిసిన తేలికపాటి వర్షానికే పాఠశాల ప్రాంగణం నీటి కొలను గా మారిపోయింది. విద్యార్థులు నడవలేని పరిస్థితి,ఆడుకునే ప్రదేశమే బురదతో నిండి పోవడం, పారిశుధ్యం లేకపోవడం వంటి సమస్యలతో బడి రూపురేఖలు చెదిరిపోయాయి.వర్షపు నీరు నిలవడంతో పిల్లలు తరగతుల కెళ్లడానికే ఇబ్బంది పడుతున్నారు.
ఇతర కాలనీల పాఠశాలలు హంగులతో!
దొంతికుంట పాఠశాలకు ఆనుకుని ఉన్న వడ్డెర బజారు, ఉర్దూ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో మెరుగ్గా ఉన్నాయి.అయితే దళిత కాలనీ పాఠశాల మాత్రం ఇంకా అసంపూర్తి నిర్మాణాల మధ్య ఉసూరు మంటోంది.
1980 దశకంలో స్థాపితం మైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 – 5 తరగతుల వరకు 48 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అందరూ దళిత వర్గాల వారే.
నిధులు మంజూరయ్యాయి… కానీ పనులు నిలిచిపోయాయి
2021 – 22 ఆర్థిక సంవత్సరంలో నాటి ప్రభుత్వం “మన ఊరు – మన బడి” పథకం కింద ఈ పాఠశాలకు రూ.22 లక్షల 8 వేల 670 మంజూరు చేసింది. ఇందులో రూ.13 లక్షల 99 వేల 600 ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నా, తరగతి గది పూర్తి కాలేదు, నీటి సౌకర్యం లేదు,విద్యుత్ అసంపూర్తి, పారిశుధ్యం దయనీయ స్థితిలో ఉంది.
మిగిలిన నిధులు బ్యాంకు లోనే ఉన్నాయని హెచ్ఎం తెలిపాడు.
పనులు పూర్తి కాలేదు: హెచ్ఎం విజయ్ కుమార్
“మంజూరైన నిధులు ఇంకా పూర్తిగా వినియోగించ లేదు. పనులు చాలావరకు అసంపూర్తిగానే ఉన్నాయి. పారిశుధ్యం కూడా సరిగా లేదు” అని హెచ్ఎం విజయ్ కుమార్ తెలిపారు.
‘వర్షపు నీటి పారుదల పై ప్రత్యామ్నాయం చూస్తాం’ – ఎంఈఓ ప్రసాదరావు
సమాచారం తెలుసుకున్న ఎంఈఓ ప్రసాదరావు పాఠశాలను సందర్శించి, హెచ్ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. వర్షపు నీటి పారుదల సమస్యకు ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు.
‘సౌకర్యాలు కల్పించే వరకూ తాళం వేస్తాం’ – గ్రామస్తులు
ప్రాంగణంలో నీరు నిలవడంతో ఆవేదనకు గురైన గ్రామస్తులు పాఠశాలను సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివకుమార్ అనే యువకుడు మాట్లాడుతూ.. “కొద్దిపాటి వర్షానికే ప్రాంగణం వరద మయ మవుతోంది. మా పిల్లలకు రక్షణ లేదు. సౌకర్యాలు కల్పించే వరకూ పాఠశాలకు తాళం వేస్తాం. దళిత కాలనీల పాఠశాలలు నిర్లక్ష్యం పాలవుతుంటే, ఇతర కాలనీల పాఠశాలలు అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది స్పష్టమైన వివక్ష,” అని వాపోయాడు.
సంక్షిప్తంగా:
“మన ఊరు – మన బడి” పథకం లక్ష్యం అందరికీ సమాన విద్యా సదుపాయాలు కల్పించడం. అయితే దళిత కాలనీ పాఠశాలల్లో అభివృద్ధి అసంపూర్తిగా ఉండటం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం — సమానత సూత్రాన్ని దెబ్బతీస్తోంది.