Tuesday, May 13, 2025
Homeప్రధాన వార్తలుసా..గుతున్న కొనుగోళ్లు

సా..గుతున్న కొనుగోళ్లు

- Advertisement -

– రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు
– వీడని అకాల వర్షాల భయం
– బీహారీ కూలీల రాక ఆలస్యంతో ఇబ్బందులు
కొత్తూరు ప్రియకుమార్‌

జూలూరులో రోజుకు నాలుగు లారీల లోడ్‌ మాత్రమే వెళ్తుండటంతో ధాన్యాన్ని ఎండబెట్టుకు నేందుకు కూడా స్థలం దొరకడం లేదని రైతు గువ్వల యాదగిరి వాపోయారు. లారీలు సమయానికి రావడం లేదనీ, తాలు, తవుడు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కొమ్ము బుచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి, రాఘవపూర్‌ కొనుగోలు కేంద్రంలోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. గతేడాది ఇదే సీజన్‌లో ఈ కేంద్రంలో 53 వేల బస్తాలను సేకరించగా, ప్రస్తుతం అదే మోతాదులో ధాన్యం వస్తుందనే అంచనా ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 30న కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా మే చివరి వరకు కొనుగోళ్లు కొనసాగుతా యని అంచనా వేస్తున్నారు. కేంద్రానికి 90 మంది రైతులు ధాన్యం తీసుకురాగా, 25 మంది నుంచి కొనుగోలు చేశారు. మరో 65 మంది ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇది ఒక ఊరికో, జిల్లాకో పరిమితమైన సమస్య కాదు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న గోస ఇది. గతంలో కన్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తొందరగా ప్రారంభించి నప్పటికీ, అదే స్థాయిలో వేగంగా కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియలో ఆలస్యమవుతున్నది. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెల క్రితమే ప్రారంభమైనప్పటికీ రైతులు రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితులే పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. దాదాపు 8 వేల కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా ఏప్రిల్‌ నుంచే కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయకపోవడంతో పంటను తీసుకొచ్చిన రైతులు 10 నుంచి 15 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హమాలీ కోసం గత కొన్నేండ్లుగా బీహార్‌ కూలీలే ఎక్కువగా వస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో స్థానికంగా కూలీలను సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది స్థానికంగా వచ్చే ధాన్యం, అవసరమైన కూలీల విషయంలో ముందస్తు అంచనా, సంసిద్ధత లేకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. అకాల వర్షాలు, ఇతర ఇబ్బందులు లేకుండా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేయడం, వెంటనే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియ అనుకున్నంత వేగం పుంజుకోలేదు. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి, బీబీనగర్‌ తదితర మండలాల్లో పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే, ఇప్పటికే కేంద్రానికి ధాన్యం తెచ్చి 10 రోజులకుపైగా ఎదురుచూస్తున్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచకపోతే, మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలంటే జూన్‌ 15 వరకు సమయం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈలోపు వర్షాలు పడితే తమ పరిస్థితి ఏంటని అలీవ్‌నగర్‌ కొనుగోలు కేంద్రంలో రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓ రెండకరాల రైతు ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎదురుచూడాల్సిన దుస్థితి.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి : రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాల రాజు గౌడ్‌
కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాల రాజు గౌడ్‌ డిమాండ్‌ చేశారు. కూలీల సమస్య, లారీల కొరత వంటివి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు కేంద్రాల్లో కనీసం సగం ధాన్యం కొనుగోలు కూడా పూర్తి కాలేదని తెలిపారు. మరోవైపు మిగిలిన రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుందని చెప్పారు. అదే జరిగితే ఆరబోసిన ధాన్యం ఏమౌతుందనే ఆందోళనతో ఉన్నారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లో రకరకాల రూపంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -