Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు

ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు

- Advertisement -

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోళ్ళు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు.

అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల ఎక్కడైనా రైతులు ఆందోళనలకు దిగితే, సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో తహసిల్దార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అన్ని శాఖలతో పరస్పర సమన్వయం పెంపొందించుకుని వరి ధాన్యం కొనుగోళ్ళు సజావుగా జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి తప్పనిసరిగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేస్తూ, ఆ కేంద్రంలోనే ధాన్యం కోనుగోలు ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, తగిన నీడ వంటి కనీస వసతులు అందుబాటులో ఉండాలని, 

నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చి ధాన్యం కోయకుండా రైతులను, హర్వేస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. తూకం యంత్రాలు, గ్రెయిన్ క్యాలిపర్స్, తేమ కొలిచే యంత్రాలు వంటివి సరిపడా అందుబాటులో ఉండాలన్నారు. క్రాప్ బుకింగ్, ధాన్యం సేకరణ వివరాలను వెంటదివెంట నమోదు చేస్తూ, రిజిస్టర్లను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలనేది జిల్లా యంత్రాంగం నిర్ణయిస్తుందని, ట్రక్ షీట్లలో అవకతవకలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తున్నామని, అయితే గన్నీ బస్తాల పంపిణీ ఇష్టారీతిన కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి ధాన్యం తరలించిన రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఆర్డీఓ సాయగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగవ్వ, అన్ని మండలాల తహసిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -