Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుప్రీంకోర్టు చీఫ్ పై దాడికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా

సుప్రీంకోర్టు చీఫ్ పై దాడికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా

- Advertisement -

నిందితుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ, కొమ్ము చెన్నకేశవులు మాదిగ
నవతెలంగాణ – వనపర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ, గంధం గట్టయ్య మాదిగ, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి మద్దిలేటి, సిరివాటి శ్రీనివాసులు బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడారు. దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదని,  అందుకే ఈ దాడికి తెగబడుతున్నారని విమర్శించారు. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద అన్నిటికన్నా ప్రధానంగా రాజ్యాంగం పై ఈ దాడి జరుగుతుందని దేశ ప్రజలు భావించాలని అన్నారు. 

రాజ్యాంగం వల్లనే ఈ దేశంలోని దళిత వర్గాలు స్వేచ్ఛ స్వాతంత్రం గౌరవం గుర్తింపును సంపాదించుకున్నారు. అందువల్ల భగవద్గీత బైబిల్ ఖురాన్ కన్నా రాజ్యాంగమే మాకు ముఖ్యం రాజ్యాంగం కంటే ముందు దళితులు పశువుల కన్నా హీనంగా చూడబడ్డారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనుషులుగా గుర్తించబడ్డామని, ఆరాజ్యాంగం వల్లనే గవాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబడ్డారన్నారు. అది జీర్ణించుకోలేకనే ఈ దాడి జరుగుతుందన్నారు. అందువల్ల ఈ దాడిని సీరియస్ గా తీసుకొని నిందితుల మీద కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నామన్నారు. తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చట్టపరంగా కేసులు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నామన్నారు. నిందితుడు బూటు విసిరి వేయడాన్ని తెలీకగా తీసుకోవద్దని, బూటు కాకుండా అతని చేతిలో మరేదైనా మారణాయుధం ఉంటే ఈ దాడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు.

పత్రికల్లో వచ్చిన వార్తలను అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన కథనాలు చూసి సుమోటోగా న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ కేసులు నమోదు చేస్తున్నాయన్నారు. అయితే దేశ ప్రజలందరూ ఖండిస్తున్న చీఫ్ జస్టిస్ పై దాడి ఘటనలో కేసులు చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గవాయి ఖర్జూరహో విష్ణుమూర్తి విగ్రహ విషయంలో చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చినప్పటికీ కావాలనే దాడి చేశారని విమర్శించారు. ఇవే వాక్యాలు ఏ ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి చేసిన ఈ దాడి జరిగి ఉండేది కాదన్నారు. బి.ఆర్ గవాయ్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఈ దాడి జరిగిందనేది ముమ్మాటికి వాస్తవమన్నారు. గతంలోనూ బాబ్రీ మసీదు కేసులోనూ రాముడు జన్మస్థలం మీద ఉన్నత వర్గాల చెందిన న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ  వారి విషయంలో ఎవరు కనీసం విమర్శ కూడా చేయలేదన్నారు.

అలాగే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు వచ్చిందన్నారు. ఆ తీర్పును మత విశ్వాసాల ఆధారంగా చూసుకుంటే విరుద్ధమైనప్పటికీ రాజ్యాంగ ప్రకారం చట్టపరంగా సరైన తీర్పుగా ఉందన్నారు. కానీ ఆ తీర్పు ఇచ్చింది కూడా ఉన్నత వర్గాలకు న్యాయమూర్తులు కనుక ఎవరు విమర్శ చేయలేదన్నారు. కానీ బి ఆర్ గవాయ్ దళితుడు కావడం వల్ల దళితులు కనీసం నోరు విప్పే స్వేచ్ఛ కూడా లేదనే వైఖరితో అహంపూరిత దాడి జరిగిందన్నారు. ఈ దాడిని దేశం మొత్తం ఖండిస్తుందన్నారు. కాబట్టి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని, అందుకోసం గవాయిపై దాడిని నిరసిస్తూ అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని, సమగ్రమైన విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ వనపర్తి జిల్లా నాయకులు మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి మండల నాయకులు మచ్చ తిరుపతి మాదిగ ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -