Tuesday, October 14, 2025
E-PAPER
Homeమానవిచిన్న‌స్థాయి నుండి కేంద్ర అధిప‌తి వ‌ర‌కు

చిన్న‌స్థాయి నుండి కేంద్ర అధిప‌తి వ‌ర‌కు

- Advertisement -

శిల్పా మీనన్‌… డిజిటల్‌ మార్పులపై పని చేసే యూఎస్‌టీ తిరువనంతపురం క్యాంపస్‌లో 25 ఏండ్ల వయసులో చేరారు. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖమైన ఆ కంపెనీలో సెంటర్‌ హెడ్‌గా తన అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారు. కంపెనీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. తన 25 ఏండ్ల ఈ ప్రయాణంలో లింగ వివక్షపై పోరాడుతూ, ధైర్యంగా నిలబడితే డిజిటల్‌ ప్రపంచంలో మహిళలు ఎలా రాణించగలరో ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. ఆ వివరాలు నేటి మానవిలో…

శిల్పా మీనన్‌ 2000లో తిరువనంతపురం క్యాంపస్‌లో 53వ ఉద్యోగిగా యూఎస్‌టీ (అప్పటి యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌) అనే డిజిటల్‌ మార్పుల పరిష్కార సంస్థలో చేరారు అప్పట్లో కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగలు కానీ ప్రాజెక్టులు కానీ లేవు. 50-60 మంది ఉన్న బృందంతో కలిసి పనిచేశారు, ఎంతో నేర్చుకున్నారు. తన మార్గంలో వచ్చిన ప్రతి బాధ్యతను తీసుకున్నారు. ‘ఒక రోజు నేను డెవలపర్‌ని, మరుసటి రోజు టెస్టర్‌ని, ఆ తర్వాత రోజు అవసరాలను విశ్లేషిస్తాను. ఇలా చాలా రకాల పనులు చేశాను. ఇది నన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. కేవలం ఒక పనిపై దృష్టి పెట్టడమే కాకుండా విభిన్న పాత్రలలో విస్తృత అనుభవాన్ని పొందగలిగాను’ అని శిల్పా గుర్తుచేసుకున్నారు.

సాధారణ ఉద్యోగిగా చేరి
25 ఏండ్ల తర్వాత శిల్పా 7,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో అతిపెద్ద అభివృద్ధి కేంద్రమైన యూఎస్‌టీ తిరువనంతపురం క్యాంపస్‌లో సెంటర్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ కేంద్రంలో జరిగే ప్రతి పనినీ పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ క్లయింట్‌లను కూడా ఆహ్వానిస్తున్నారు. ది. యూఎస్‌టీ ప్రారంభ ఉద్యోగులలో ఒకరిగా చేరిన ఆమె నేడు ఆ సంస్థ ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎలా ఎదిగిందో చూశారు. కేరళ రాష్ట్రానికి చెందిన శిల్పా తన తండ్రి ఉద్యోగ రీత్యా చిన్నతనంలో రాజస్థాన్‌లో గడిపారు. స్కూలింగ్‌ తర్వాత ఉన్నత విద్య కోసం కేరళకు తిరిగి వెళ్లారు.

కంప్యూటర్‌ ట్రైనర్‌గా…
అప్పట్లో విద్యార్థులందరూ సాధారణంగా ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌ మాత్రమే ఎంచుకునేవారు. శిల్ప తన మొదటి ప్రయత్నంలో మెడికల్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. దీని కోసం మరో ఏడాది ఎదురు చూడకుండా కెమిస్ట్రీ, గణితం, భౌతిక శాస్త్రాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా అభ్యసించారు. ఇక్కడే ఆమెకు కంప్యూటర్లు, కోడింగ్‌ పట్ల మక్కువ కలిగింది. ఈ ఆసక్తితో మూడేండ్ల ఎంసీఏ పట్టా పొందారు. యూఎస్‌టీలో చేరడానికి ఎనిమిది నెలల ముందు కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ట్రైనింగ్‌ ఇచ్చారు. అలాగే కొన్ని నెలలు నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేశారు.

వృద్ధి కోసం స్థిరమైన మార్పు
‘త్రివేండ్రంలోని టెక్నోపార్క్‌లోని కంపెనీల నుండి నాకు కాల్స్‌ వచ్చాయి. ఫ్రెషర్స్‌ను ప్రోత్సహించే అక్కడి సానుకూల వాతావరణం నాకు బాగా నచ్చింది. అందుకే యూఎస్‌టీని ఎంచుకున్నాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. చేరిన మొదటి ఏడాదిలోనే డేటన్‌, ఒహియోలో 10 నెలల పాటు ఆన్‌-సైట్‌లో పనిచేసే అవకాశాన్ని పొందారు. ‘ఈ పని కస్టమర్‌ సంబంధాలపై నా దృక్పథాన్ని, వాటి ప్రాముఖ్యతను నేర్పింది’ అని ఆమె పంచుకున్నారు. క్రమంగా తన నైపుణ్యాలను వృద్ధి చేసుకున్నారు. ఆమెకు గ్రూప్‌ను నడిపే బాధ్యతలు అప్పగించారు. తర్వాత ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేటాయించారు. ప్రతి చోటా తన ప్రత్యేకను చాటుకున్నారు. చేరిన మూడేండ్ల వరకు కొత్త కస్టమర్‌లతో పని చేశారు. ప్రధాన డెలివరీల బాధ్యతలు కూడా చూశారు. ఆ తర్వాత వారికి ప్రత్యేక క్లస్టర్‌లకు అప్పగిస్తారు.

సెంటర్‌ హెడ్‌గా…
మూడున్నరేండ్లు ఆమె నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఉమెన్‌ అసోసియేట్స్‌కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో మహిళా ఉద్యోగుల సాధికారత, శిక్షణ, మెంటర్‌షిప్‌పై దృష్టి సారించారు. 2017లో ఆమెను సెంటర్‌ హెడ్‌గా నియమించారు. ఆమె బాధ్యతలు ఇప్పుడు కేంద్రాన్ని పెంచడం, ఉద్యోగులను నిలుపుకోవడం, బ్యాక్‌-టు-ఆఫీస్‌ రేటును నిర్వహించడం. ఆమె కేరళలోని అతిపెద్ద ఐటీ పార్క్‌ అయిన టెక్నోపార్క్‌లోని ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ‘ఏండ్లుగా ఈ పరిశ్రమలో పని చేసే మహిళలు, వారి కెరీర్లు, వివిధ బాధ్యతలు స్వీకరిస్తున్న వారిని చూశాను. మొత్తం మీద టెక్‌ పరిశ్రమ మహిళలను స్వాగతించడానికి చాలా అనుకూలంగా ఉందని నేను భావిస్తున్నాను’ అని అంటున్నారు.

పక్షపాతాలు ఉండవచ్చు
శిల్పా ప్రకారం మహిళలు అదనపు బాధ్యతలను కోరుకోరని, వారికి రాత్రి షిఫ్ట్‌లు ఇవ్వకూడదనే ఊహల నుండి పక్షపాతాలు మొదలవుతాయి. ‘ఇవన్నీ సాకులు మాత్రమే. మహిళలు దీన్ని ఎత్తి చూపాలి. వీటిని అధిగమించకుంటే ముందుకు సాగలేరు. సంస్థలు కూడా మీరు ఈ పనికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మహిళలను అడగాలి. అయితే యూఎస్‌టీలో పని విధానం బహుముఖంగా ఉంటుంది. నిర్దిష్ట సమయాలు ఉండవు. కెరీర్‌ విరామం తర్వాత మహిళలను తిరిగి తీసుకురావడానికి, శిక్షణ, నియామకాల కోసం కంపెనీ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తుంది. అలాగే ఉద్యోగులకు పక్షపాతం గుర్తించడం, తొలగించడంపై కోర్సులు కూడా ఉన్నాయి’ అని ఆమె చెబుతున్నారు.

ఏఐ సహకారంతో…
‘మీరు ఎప్పుడూ మీ కాళ్లపై ఉండాలి, నిరంతరం అధ్యయనం చేయాలి, మిమ్మల్ని మీరు నవీకరించబడాలి. నేటి యుగంలో ఏఐ మహిళలకు ఎంతో ప్రయోజనంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన జీవితాలను సులభతరం చేస్తుంది. పనిని త్వరగా పూర్తి చేయవచ్చు. ఆఫీసులో ఎక్కువ సమయం గడపకుండానే పని చేయవచ్చు. అప్పుడు పని, ఇంటిని సమతుల్యం చేసుకోవడానికి సమయం ఉంటుంది. ఇలా ఏఐ నాకు ఎంతో సహకారంగా ఉంది’ అని ఆమె పంచుకున్నారు.

సందేహంలో ఉండొద్దు
‘మహిళలు తమ స్థాయిని విస్తృతం చేసుకోవాలి, తమ గురించి తామే మాట్లాడుకోవాలి, నమ్మకంగా ఉండాలి. ‘నేను ఉద్యోగం చేయగలనా లేదా’ అనే సందేహంలో ఉండొద్దు. నా మునుపటి కెరీర్‌లో నేను దాన్ని ఎదుర్కొన్నాను. ఇప్పుడు దాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాను’ అని ఆమె చెప్పారు. యూఎస్‌టీకి మించి, శిల్పా మొత్తం టెక్నోపార్క్‌ కమ్యూనిటీకి మహిళా వేదికైన eWIT(ఎంపవరింగ్‌ ఉమెన్‌ ఇన్‌ టెక్నాలజీ)కుమార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రారంభం నుండి డెలివరీ వరకు నాయకత్వ కోర్సులు, ప్యానెల్‌లు, ప్రాజెక్టులు నడపడంలో మహిళలకు
శిక్షణ ఇస్తుంది.
– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -