ఆయిల్‌ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు సరఫరా చేసిన మొక్కలు జన్యుపరమైన లోపంతో ఎదగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2019 నుంచి 2022 వరకు తోటల్లో పెంచిన మొక్కలకు లక్షల రూపాయలు పెట్టుబడులు ఖర్చుచేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వేల మొక్కలు ఆఫ్ టైపు వచ్చి గెలలు రావటం లేదని ఆయిల్ ఫెడ్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు. ఆయిల్ ఫెడ్ సంస్థ, ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ప్రయివేటు యాజమాన్యాలకి ఇవ్వటం మూలంగానే ఈ తప్పిదం జరిగిందన్నది వాస్తవం. ఐఐఓపిఆర్ శాస్త్రవేత్తలు పరిశీలించిన తోటల నుండి శాంపిల్స్ స్వీకరించాక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయిల్‌ఫెడ్ సంస్థకు అందించినా పట్టించు కోవడం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఏండ్ల తరబడి ఎలాంటి ప్రతిఫలం రాకున్నా పెట్టుబడులు పెట్టి, తోటలు పెంచి ఆదాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో గెలలు రాకపోవడంతో రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా వాటిని తొలగించి వేరే మొక్కలు నాటుకోవాలని ఆయిల్ ఫెడ్ సంస్థ ఉచిత సలహాలనిస్తున్నది. ఎకరాకు నాలుగోయేడు పది టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా ఏడేండ్లు గడుస్తున్నా గెలలు ఎదగలేదు. నాణ్యత లేని మొక్కలు అంటకట్టడంతోనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మొక్కలు తొలగిస్తే పది లక్షల రూపాయాల నష్టం వస్తుంది. ఈ నష్టం రైతులెందుకు భóరించాలి. ఆయిల్ పామ్ కంపెనీలు రైతులకు నాణ్యమైన మొక్కలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయిల్‌పామ్ మొక్కలు నాణ్యతలేకుంటే గనుక వాటికి నష్టపరిహారం అందించేందుకు కంపెనీలతో ముందుగానే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే బాగుండేది. అంతేకాదు, రైతులు ప్రూట్ కొనేటప్పుడు ఆయిల్‌ఫామ్ కంపెనీలు తరుగు తీస్తున్నాయి. ఇది కూడా అన్యాయం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట ఏరియాలో రైతులు ఆయిల్‌ఫామ్ తోటలు ఎక్కువగా పండిస్తున్నారు. ఫ్యాక్టరీలు తక్కువగా ఉన్నందున కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలి. వేంసూర్ మండలం కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ అనువైన ప్రదేశం ఉన్నందున 60డిటిహెచ్‌తో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి. డెబ్బయి వేల టన్నుల క్రూడాయిల్ ఉత్పత్తి అవుతున్నందున ముందుగా రిఫైనరీ ఇక్కడ నిర్మించాలి. ప్రతి ఆయిల్ ఫామ్ రైతు సంఘంతో ప్రతి నెలా రేట్ ఫిక్సేషన్ డీటెయిల్స్ అనగా ఆ నెల ఓఈఆర్ శాతం క్రూడ్ పామ్ ఆయిల్ సేల్స్ కెర్నల్ నట్, కెర్నల్ ఆయిల్ సేల్స్ వివరాలు అన్ని షేర్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ ఫెడ్ కెర్నల్ ఆయిల్ ప్రాసెస్ చేసి ఆయిల్ సేల్ మీద కాకుండా నట్ సేల్ మీద రేట్ ఫిక్సింగ్ చేసే విధానాన్ని సరిచేయాలి. ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్‌పుట్ సబ్సిడీస్ సక్రమంగా అందించాలి కొత్తగా ఆయిల్ పామ్ వేసిన ప్రాంతంలో కోత కూలీల సమస్య అధికంగా ఉంది కూలీలను దూర ప్రాంతాల నుండి తీసుకురావడంతో టన్నుకు మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది.ఈ సమస్య తీవ్రతను పరిగణలోకి తీసుకుని ప్రతి ఆయిల్ పామ్ కంపెనీ హార్టికల్చర్ సహకారంతో ముందుకు సాగాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఈ ఓ – ఓపి పథకం కింద ఆయిల్ ఫామ్ వేసిన అన్ని గ్రామాల్లో స్థానిక యువతకు శిక్షణ ఇప్పించాలి. వారికి ఉచితంగా హార్వెస్టింగ్ కత్తులు గెడలు, సేఫ్టీ గ్లౌజ్స్ గుంబూట్స్ లాంటి సేఫ్టీ పరికరాలు
ఇవ్వటానికి కృషి చేయాలి
ఆయిల్ పామ్ రైతుల కృషితో ఫ్యాక్టరీల సిఎస్ ఆర్ ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీల జోన్‌లలో ఆయిల్ పామ్ రైతుల తోటల రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే ఉపయోగించే విధంగా కృషిచేయాలి.ఆయిల్ పామ్ ఫ్రూట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం రైతులకు చెల్లించే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు గత ఐదేండ్లుగా పెంచలేదు, ట్రాక్టర్ కిరాయిలు విపరీతంగా పెరిగినందున దీన్ని యాభైశాతం పెంచాలి. ఐఐఓపిఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఆయిల్ పామ్ రైతుల తోటలను నిరంతరం ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్‌స్టాప్, హార్టికల్చర్ విభాగం వారు పరిశీలిస్తూ రైతులకు సూచనలు ఇవ్వాలి. జన్యుపరమైన లోపాలను గుర్తించేందుకు ఐఐఓపిఆర్ శాస్త్రవేత్తలతో పరిశీలించిన తోటల శాంపిల్ నివేదికను వెంటనే బహిరంగ పరచాలి. తోటల్లో నుంచి హెచ్‌టి, ఎల్‌టి విద్యుత్ లైన్లు టిజిఎన్‌పిడిసిఎల్ రైతులకు భారం లేకుండా షిఫ్టింగ్ చేయాలి. ప్రభుత్వాలు ఈ విధంగా చేయడం ద్వారా రైతులను ఆయిల్ పామ్‌ల వైపు ప్రోత్సహించాలి. ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు ఆయిల్‌ఫెడ్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై కూడా ప్రభుత్వం విచారణ చేయాలి.
బొంతు రాంబాబు, 9490098205