Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక కళలను ప్రోత్సహించాలి

సామాజిక కళలను ప్రోత్సహించాలి

- Advertisement -

జస్టిస్‌ సూరెపల్లి నంద
సుద్దాల జానకమ్మ హనుమంతు పురస్కారాలు ప్రదానం
నవతెలంగాణ – ముషీరాబాద్‌

సామాజిక కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ సూరెపల్లి నంద అన్నారు. సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితీ జానపద నృత్య పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత్రి ఓల్గా, ప్రజాగాయని మధుప్రియ, లాలి నిధి(నృత్యం)కి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సూరెపల్లి నంద మాట్లాడుతూ.. సుద్దాల జానకమ్మ హనుమంతు జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్‌ ద్వారా పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్‌ సాహిత్యం, కళలను ప్రోత్సహిస్తూ తెలంగాణ వారసత్వానికి గుర్తింపు తెస్తోందన్నారు. కళలు, సాహిత్యం విశిష్టతను వివరించారు. సామాజిక కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ప్రజలే కళలకు నిధి అని అన్నారు. కళాకారులు తమ కళలను ప్రజల ముందుంచుతూ ఆ నిధిని ఆస్వాదించాలని సూచించారు. ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘు మాట్లాడుతూ.. ”నా తోడు నీడ జానకమ్మ” అని సుద్దాల హనుమంతు పేర్కొన్నారని, నేడు జానకమ్మ పేరుతో అవార్డులు ఇవ్వడం విశేషమన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాట గీతాలు రాసిన యోధుడు సుద్దాల అని చెప్పారు. మూడు తరాల వారికి అవార్డులు ఇవ్వడం నేటి వేడుక ప్రత్యేకత అన్నారు. ఉద్యమ గాయని, ప్రజాగాయని మధుప్రియ అని అన్నారు. స్వేచ్ఛ నవలతో ఓల్గా సంచలనం సృష్టించారని, నీలి మేఘాలు – స్త్రీవాద కవితా సంకలనం తీసుకురావడం సాహిత్యంలో విశేషమన్నారు. ‘విముక్త -కథలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నట్టు గుర్తు చేశారు.
సుద్దాల ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. తెలంగాణ నేల సాలు మీద పాటలతో తన తల్లిదండ్రులు జానకమ్మ హనుమంతు విత్తనమయ్యారని తెలిపారు. తన తండ్రికి అమ్మ ఇరువైపులా పాటై పాటల పల్లకి మోసిందన్నారు. 13 సంవత్సరాలు నాన్న పేరు మీద, ఈ సంవత్సరం అమ్మ పేరు మీద సాహితీ, జానపద, నృత్యం ముగ్గురమ్మలకు పురస్కారాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 14 సంవత్సరాలుగా పాట ఆటలకు పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతున్నదని, తన ప్రాణమున్నంత వరకు ప్రతిజ్ఞ లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పారు. పల్లె పల్లెనా సుద్దాల ఆశయాలను ముందుకు తీసుకుపోతానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -