Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమునుగోడులో మద్యం అమ్మకాల్లో రాజన్న రూల్స్‌!

మునుగోడులో మద్యం అమ్మకాల్లో రాజన్న రూల్స్‌!

- Advertisement -

– అలా అయితేనే దరఖాస్తు చేసుకోవాలి
– మద్యపాన నిషేధమే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లక్ష్యం
– ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుల వినతి
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిబంధనలు పాటించేటట్టు అయితేనే లిక్కర్‌ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలి. మునుగోడు రూల్స్‌ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ పాలసీతో సంబంధం లేదంటూ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఇంటి పెద్ద మద్యానికి బానిసలై కుటుంబాన్ని పట్టించుకోక అనారోగ్యం పాలై అర్ధాంతరంగా మరణించడంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. నియోజకవర్గంలో రెండేండ్లుగా బెల్ట్‌ షాపులను నిషేధించి.. సమయపాలన పాటించడం, సిండికేట్లను నిరోధించడం వంటి నిబంధనలను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అమలు పరుస్తున్నారన్నారు. కొత్తగా వైన్స్‌షాపులకు ప్రభుత్వం దరఖాస్తు కోరిన నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేవారు కూడా తమ నిబంధనలు పాటించాలని, షాపు తీసుకున్న తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు తమ నియోజకవర్గంలో పాటించొద్దంటూ లిక్కర్‌ వ్యాపారులకు, అధికారులకు హెచ్చరిక చేశారు. రాజన్న రూల్స్‌ మాత్రమే పాటించాలన్నారు. వైన్‌షాప్స్‌ నిర్వాహకులు ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని, మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని సూచించారు. వైన్స్‌షాపుకు అనుబంధంగా (సిట్టింగ్‌) పర్మిట్‌ రూమ్‌ ఉండొద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్‌ షాపులకు మద్యం అమ్మొద్దని, లాటరీ విధానంలో వైన్స్‌షాప్‌లు దక్కించుకున్న ఓనర్స్‌ సిండికేట్‌ కాకూడదన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన రవి, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నాయకులు పల్లె వెంకన్న, కత్తి రవీందర్‌రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, జూనియర్‌ రఘుపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, దోటి వెంకటేష్‌యాదవ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, సత్యం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -