– గిరిజన సంక్షేమ శాఖó కార్మికుల నిరవధిక సమ్మె
– రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
వేతనాల తగ్గింపును నిరసిస్తూ కనీస వేతనం అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని హాస్టల్ వర్కర్ల రాష్ట్ర జేఏసీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు డిమాండ్ చేశారు. నెలరోజుల నుంచి గిరిజన సంక్షేమ శాఖ పరిధి డైలీ వేజ్ పీఎంహెచ్ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తక్షణమే సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ఎదుట ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా గిరిజన సంక్షేమ శాఖలో 3,000 మంది డైలీవేజ్ పీఎంహెచ్ వర్కర్లు సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు పీఎంహెచ్‌ల నిర్వహణలో 35ఏండ్లుగా డైలీ వేజ్, పీఎంహెచ్ వర్కర్ల పాత్ర గణనీయంగా ఉందని అన్నారు. 30 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ల గెజిట్‌ల ప్రకారం పొందుతున్న వేతనాలను 2021లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 64 పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వేతనాలను తగ్గించడం సరికాదన్నారు. రూ.26,000 వేతనాన్ని రూ.11,700కు తగ్గించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్న్రించారు. జీఓ 16లో డైలీ వేజ్ అనే పదం లేదనే పేరుతో వీరు పర్మినెంట్ కాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడున్న జీతాలను తగ్గించి వారందరినీ ఔట్‌సోర్సింగ్‌లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. టైంస్కేల్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని తెలిపారు. తక్షణం వారి సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎం.పాపారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ దావూద్, రత్నం రాజేందర్, వర్కర్లు నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సారీ బాబు, శ్రీను, సారక్క, వెంకటలక్ష్మి, కిషన్, ప్రభాకర్, చెప్పు ప్రభాకర్, రవీందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
డైలీ వేజ్ వర్కర్లకు కనీసవేతనం అమలుచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES