Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో 50 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

మేడారంలో 50 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

- Advertisement -

– 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలను కల్పించింది. మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. మొత్తం జాతరలో ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 5,192 మంది మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకుగాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్‌ వైద్యాధికారులు, 673 నర్సింగ్‌ అధికారులు, 1,905 ఆశావర్కర్లు, 1,111 పారా మెడికల్‌ సిబ్బంది, 331 పర్యవేక్షక సిబ్బంది, 700 ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజను లకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కలుగకుండా 10 మెడికల్‌ క్యాంప్స్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు మేడారం చుట్టూ పక్కలా ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవింద రావుపేట, మంగపేట ఆస్పత్రులను సిద్ధం చేశారు.

జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్మిమ్మర్లు, రక్షణ సిబ్బంది
మేడారం వచ్చే భక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జంపన్న వాగులో ప్రమాద వశాత్తూ పడి ప్రమాదాలకు గురు కాకుండా ఉండేందుకు జంపన్నవాగు పొడుగునా సురక్షితులైన స్విమ్మర్లు, సింగరేణి, ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్‌ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. వీరిలో మత్శ్య శాఖ ద్వారా 210 స్విమ్మర్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ టీమ్‌ సభ్యులు, 100 మంది ఎస్‌.డీ.ఆర్‌.ఎఫ్‌ టీమ్‌ సభ్యులు న్నారు. వీరందరికీ లైఫ్‌ జాకెట్లు, ప్రత్యేక టీ షర్ట్స్‌, సెర్చ్‌ లైట్స్‌, లైఫ్‌ సేవింగ్‌ పరికరాలు అందచేశారు. జాతర మొత్తం ప్రాంగణంలో ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్‌ బ్రిగేడ్స్‌, 12 మిస్ట్‌ బుల్లెట్స్‌, రెండు ఫైర్‌ ఇంజన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -