కాస్ట్రో అనంతరం క్యూబా
‘నిర్బంధం మాకు కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా క్యూబా అమెరికా నిర్బంధాన్ని ఎదుర్కుంటోంది. అదే ధైర్యంతో ట్రంప్ బెదిరింపులను కూడా ఎదుర్కుంటాము. మా ప్రజలు ఒత్తిడికి లొంగరు. క్యూబా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది.”
ఇరాన్ తరువాత క్యూబాను స్వాధీనం చేసుకుంటామంటూ కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపునకు ఇది క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ – కానెల్ స్పందన ఇది! క్యూబాపై అమెరికా ప్రత్యక్ష యుద్ధం చేయడం లేదు. కానీ, దశాబ్దాల తరబడి పరోక్ష యుద్ధం చేస్తూ క్యూబా ప్రజలపై విరుచుకుపడుతోంది. కనీస అవసరాల సంగతి అలా ఉంచితే, తాగే నీరు, తినే తిండికి అంగలార్చాల్సిన పరిస్థితిని సృష్టించింది. విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధితో పాటు, అన్ని రంగాల ప్రగతికి బ్రేకులు వేసింది. ప్రాణాధార ఔషధాల సరఫరాను అడ్డుకుంది.
ఎవరొచ్చినా ఏం చేయలేరు సంఘీభావమే క్యూబా బలం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న భీకర యుద్దం వల్ల తలెత్తుతున్న ఆర్థిక, మానవతా సమస్యలు, పర్యవసానాలు మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం దురహంకారపూరితంగా, సామ్రాజ్య వాద ధోరణితో తీసుకుంటున్న చర్యలు ఈ ప్రపంచాన్ని అస్థిరత, అభద్రత వైపు నడిపిస్తున్నాయి. నిన్న పాలస్తీనా, వెనిజులా, ఈ రోజు ఇరాన్, రేపు క్యూబా. ఇదీ ప్రస్తుతం అమెరికా లక్ష్యం. ప్రపంచ దేశాలపై అమెరికా రుద్దుతున్న ఈ నిరంకుశ వాదాన్ని నిలువరించాలని క్యూబా పోరాడుతోంది. అంతర్జాతీయ సమాజంలో ఐక్యత కోసం పిలుపునిస్తోంది. క్యూబాపై సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ మరోసారి బెదిరించారు. ఈ పరిస్థితిని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నాం. క్యూబా విప్లవం విజయం సాధించినప్పటి నుండే ఈ పరిస్థితికి సమాయత్త మవుతూ వస్తున్నాం. ఆర్థిక, ద్రవ్య, వాణిజ్య ఆంక్షలు అత్యంత అన్యాయమైనవి, అక్రమమైనవి, ఇది తీవ్రమైన నేరం అని క్యూబా ఎలుగెత్తి నినదిస్తోంది. ఇది పద్ధతి ప్రకారం సాగిస్తున్న ఊచకోతే, ట్రంప్ చెబుతున్నట్లుగా క్యూబాను వారు లాక్కోలేరు. క్యూబా ఏమీ ఒక కేకు ముక్క కాదు, తీసేసుకోవడానికి, ఇదొక సార్వభౌమాధికార దేశం, ప్రజల్లో విప్లవ చైతన్యం వుంది. శత్రువు ముందు మోకరిల్లే పరిస్థితి లేదు. అమెరికాతో చర్చలకు క్యూబా సిద్దమని ప్రభుత్వం ఎప్పుడూ చెబుతూనే వస్తోంది. కొన్ని ద్వైపాక్షిక చర్చలు జరిగాయి కూడా. క్యూబాలో ఏ ప్రభుత్వం వుండాలి, ఏ రాజకీయ వ్యవస్థ వుండాలో నిర్ణయించాల్సింది క్యూబా ప్రజలే. క్యూబాకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న శాశ్వత సంఘీభావానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా వుంటాం.
-పొగడ దొరువు



