Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeసోపతిగాలివాన రేపిన సొగసు పాట

గాలివాన రేపిన సొగసు పాట

- Advertisement -

అమ్మాయి తన అందంతో మనసులో కొత్త అలజడి కలిగిస్తుంటే అబ్బాయిలోని ఆశలు నింగినంటుతాయి. అబ్బాయి వల్ల అమ్మాయిలో కూడా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దాని ఫలితంగా ఉరకలెత్తుతూ పాటలు పరవళ్ళు తీస్తుంటాయి. అలా పరవళ్ళు తీసిన పాటే ఇది. 2024 సం.లో రామ్‌ ప్రసాద్‌ కొండూరు దర్శకత్వంలో వచ్చిన ‘బహిర్భూమి’ సినిమాలో దేవేంద్ర రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.
అమ్మాయి నాజూకైన అందంతో అబ్బాయిలో తీయని ఆశలు కలిగిస్తోంది. ఆ ఆశలతో గంతులేస్తూ అబ్బాయి ఈ పాట పాడుతుంటాడు. దానికి ప్రతిగా అమ్మాయి కూడా పాడుతుంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. తనివి తీరని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఇద్దరూ ఒక్కటై కలిసి విహరిస్తూ ఉంటారు.
ఇక్కడ.. అబ్బాయి అమ్మాయి అందాన్ని చూసి ముగ్ధుడై, ఆమె తన ఎదలో చేసిన సందడిని గూర్చి ఇలా చెబుతున్నాడు. వెనువెంటనే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి అతను తన ఎదలో చేసిన మాయ గురించి చెబుతుంది.. గమ్మత్తైన గాలివానను నా ఎదలోయలో రేపావు నువ్వు అని అంటాడు. గాలివానను రేపడం మామూలే.. కాని గమ్మత్తైన గాలివానను రేపడం వినూత్నంగా ఉంది. గాలి వాన రెండూ కలిపి వేగంగా దూసుకొస్తే విపరీతమైన అలజడి చెలరేగుతుంటుంది. ఇక్కడ అమ్మాయి రేపిన గాలివాన శంగారప్రాయమైనది.. కాబట్టి గమ్మత్తుగానే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేమను లేఖగా రాసి ఆమె తన పెదవంచున దాచుకొచ్చిందట.. పెదవంచున ప్రేమను దాచిందని ఎలా చెబుతున్నాడంటే ఆ పెదవి చేసే గారడిని బట్టి ఆ విషయాన్ని పసిగట్టాడని అర్థమవుతోంది.
ఈరోజే పుట్టిన లేగదూడలాగా గెంతాలన్నంత సంతోషంగా ఉందతనికి.. చన్నీళ్ళలో ముంచినపుడు కెవ్వుమని ఏడ్చే చంటిపాపలాగా అతనికి ఎదలో జిల్లుమంటుదట.. అతని ఎదలో ఆమె ఊపిరి చల్లిందట.. అంటే అప్పటిదాకా అతను ఊపిరి లేకుండా బతికాడని అన్నట్టే కదా.. అంటే.. జీవచ్ఛవంలా అతనుడున్నాడని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. ఆమెనే ఊపిరి చల్లి మళ్ళీ ప్రాణం పోసిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. తనను ఒక్కసారి గట్టిగా హత్తుకొమ్మని కోరుకుంటాడు. వెంటనే అమ్మాయి.. అతన్ని చూడకపోతే మనసుకి నిమిషమైన గాలి ఆడదని అంటుంది.
అతని చిన్ని సైగకే ఆమె చీరకొంగును అడ్డుగా పెట్టుకొని మురిసిపోతుంది. తన మిత్రులు, తోటివారు ఎవ్వరూ చూడకూడదని చీరకొంగును చాటు చేసుకుని మైమరచిపోతుంది. అంతలా ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు. ఆమె చేతిగీతల్లో తన పేరే రాసుందని.. అంటే.. ఆమెకు కాబోయే భర్త తనే అని ఆమె చేతిగీతలు చెబుతున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఆ చేతిగీతలు అంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ నేను ఇన్నిరోజులు గమనించలేదెందుకు? నేను పిచ్చివాడినా? అని అంటున్నాడు. ఆమె కనులు అనే అద్దంలో కూడా తన బొమ్మే ఉన్నప్పటికీ ఆమెనే రెప్పను అడ్డుగావేసి కలను తెరగా వేసి దాచేసిందని చెబుతున్నాడు. అంటే.. అమ్మాయి తన ప్రేమను కనబడకుండా దాచుకుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.
గుండెలో సిగ్గే నిండిపోయి పొంగుతోంది. అయినా మనసు ఎందుకో పదే పదే ఆపుకుందే అని ఆ అమ్మాయి చెబుతోంది. దానికి సమాధానంగా అబ్బాయి.. చిలిపి కలలు అంతే.. సప్పుడు చేయవు.. ఆ కలలు పరుగులు తీసి తీసి, అలసి సొలసి చివరకు తీరాన్ని చేరుకుంటాయి. ఆ తీరమే ఇక్కడ ప్రేమ అని మనం అర్థం చేసుకోవచ్చు. మన బాధలన్నీ తొలగిపోవాలి. నీలో నేను కలిసిపోవాలి అని అమ్మాయి అంటోంది.
అబ్బాయికి చెప్పలేని ఆనందం కలుగుతోంది అందుకే ఆకాశం అంచుల్లోన తాను ఏమి చేస్తున్నానని ఆశ్చర్యపోతుంటాడు. అతడు భూమి మీదే ఉంటాడు. కాని ఆకాశంలో ఉన్నానా? అని అనుకుంటాడు. దానికి కారణం ఆనందంలో తేలుతున్నాడు.. కాబట్టి ఆకాశంలో ఉన్నానేమో అన్నంత సందడి అతనిలో చెలరేగుతోందిక్కడ. ఆ సందడితో, ఆ ఉబలాటంతో ఆమెను తొందరగా పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అందుకే సన్నాయి మేళాలు సాయంత్రం కల్లా తెప్పిస్తాను. పెళ్ళి చేసుకుంటాను. ఇక ఒక్క పూట కూడా నేను ఆగలేను. నాలోని తపన ఆగలేదు అని అంటాడు.
అప్పుడు అతని ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెబుతుంది. కాలికింద ఉన్న ముగ్గు నీకు మెల్లగా చెప్పలేదా? నువ్వంటే నాకు ఇష్టమని. ముగ్గు వేసి నా ప్రేమను నిశ్శబ్దంగా తెలియజేశాను. ఇక ఇంతకంటే కొత్తగా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను..అంటుంది. అప్పుడు అబ్బాయి ఆనందం రెక్కలు తొడిగి ఎగురుతుంటోంది. అందుకే అంటాడిలా..గువ్వలై మనం రివ్వును ఎగురుదాం. ఒకే గూటిలో బతుకుదాం. చివరిదాకా కలిసి ఉందాం. చచ్చేటప్పుడు కూడా కలిసి చచ్చి చితిలోకి ఒకేసారి చేరుకుందాం అని అంటాడు. అంత బలమైన ప్రేమ వాళ్ళిద్దరిదని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. అప్పుడామె ఈ రాత్రిని రానివ్వు. నీలో నన్నే జతపడనివ్వు. నన్ను నీకు అర్పించుకుంటాను. నాదంతా నీదే. నేను నీ దానినే..నా సర్వస్వం నీవే అని ఆ అమ్మాయి తన ప్రియుడికి నివేదించుకుంటుంది.
అన్యోన్యమైన ప్రేమబంధం ఈ పాటలో తొంగి చూస్తోంది.

పాట:

గమ్మత్తైన గాలివాన రేపినావే ఎద లోయనా/ ప్రేమనంతా లేఖరాసి దాచినావే పెదవంచునా/ ఇవ్వాలే పుట్టిన లేగదూడలా గెంతాలనున్నదే భామా/ చన్నీళ్ళో ముంచిన చంటిపాపలా జిల్లుమంది నాలోపలా/ ఊపిరే చల్లినావే నా గుండెలా/ గట్టిగా హత్తుకోవే ఒక్కసారిలా/ నువ్వు చూడక నిమిషమైన గాలి ఆడదే మనసుపైనా/ చిన్నిసైగకే మురిసిపోనా చీరకొంగున చివరనా/ నీ చేతిగీతల్లోన నా పేరే రాసున్నా ఇన్నాళ్ళు చూడలేదే వెర్రినా/ నీ కంటి అద్దంలోన నా బొమ్మ గీసున్నా రెప్పేసి దాచేశావా నీ కలనా/ నిండిపోయి గుండెలో పొంగుతుంటే సిగ్గు/ ఆపుకుందే ఎందుకో పదే పదే మనసు/ సప్పుడే సేయవే చిలిపి కలలు పరుగు పరుగున/ దూకెనే తీరమే చివరి మజిలి అలసి సొలసి తిరుగగా/ పోనీ పోనీ కలతలనీ నీలో నన్నే జతపడనీ/ ఆకాశం అంచుల్లోన నేనేమి చేస్తున్నా/ అయ్యయ్యో ఆనందంలో తేలినా/ సన్నాయి మేళాలన్ని సాయంత్రం తెప్పీనా/ ఓ పూట ఆగనందే నా తపన/ చెప్పలేదా చిన్నగా కాలికింద ముగ్గు/ అంతకన్నా కొత్తగా ఎలా సరే అననూ/ రివ్వున గువ్వలై చివరి వరకు జతను విడువక/ ప్రేమనే గూటిలో ఒదిగి బ్రతికి చితికి కలిసి నడవనా/ రానీ రానీ ఈ రాతిరినీ నీలో నన్నే జతపడనీ..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad