నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ పేసర్ యశ్ దయాల్ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయనపై నమోదైన లైంగిక ఆరోపణల కేసులు ఆయన క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసుల కారణంగా ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆయనపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆయన దేశవాళీ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో గోరఖ్‌పూర్ లయన్స్ ఫ్రాంచైజీ రూ. 7 లక్షలకు యశ్ దయాల్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆయనపై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమతి నిరాకరించినట్లు ప్రముఖ హిందీ పత్రిక ‘దైనిక్ జాగరణ్’ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ విషయంపై గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు యజమాని విశేష్ గౌర్ స్పందిస్తూ, యూపీసీఏ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశారు.