కర్రతో కొట్టి.. కాళ్లతో తన్నిన వైనం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ తీరుపై వెల్లువెత్తిన విమర్శలు
భోపాల్: ఓ మహిళపై బీజేపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఆమెను కర్రతో కొట్టి … కాళ్లతో తన్నాడు. అంతేకాక ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ సంఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సిహావల్‌కు చెందిన బీజేపీ నేత సంతోష్ పాఠక్ ఓ మహిళను కర్రతో చితకబాదాడు. కాళ్లతో తన్నడంతో పాటు వీపుపై పిడిగుద్దులు గుద్డాడు. అయితే ఆయన ఆ మహిళను ఎందుకు అలా కొట్టాడో తెలియలేదు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు.
బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ”ప్రధాని మోడీ ‘బేటీ పడావో.. బేటీ బచావో’ గురించి మాట్లాడుతారు. కానీ బీజేపీ నాయకుల నుంచి కూడా కూతుళ్లను రక్షించుకోవాలని చెప్పడం మర్చిపోయారు. ఇందుకు ఉదాహరణే సిద్ధిలో జరిగిన సంఘటన” అని ఆయన పేర్కొన్నారు.అంతేకాక హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం మోహన్ యాదవ్‌ను కూడా జీతూ పట్వారీ విమర్శించారు. మహిళల భద్రతను నిర్ధారించడం ఆయన బాధ్యత అని, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళను కొట్టిన బీజేపీ నేతపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓ మహిళపై బీజేపీ నేత దాడి
- Advertisement -
- Advertisement -



