– విశాఖలో నాల్గో టీ20 నేడు
– జోరుమీదున్న టీమ్ ఇండియా
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
తీరంలో ధమాకాకు రంగం సిద్ధం. హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని జోరుమీదున్న టీమ్ ఇండియా నేడు విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో నాల్గో టీ20లో బరిలోకి దిగుతోంది. విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు, మెరుపు బౌలింగ్ ప్రదర్శనలతో భారత జట్టు ఏకపక్ష విజయాలు సాధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట సూర్యసేన ఫామ్ ప్రత్యర్థులకు ఆందోళన కలిగిస్తోండగా.. సిరీస్‌లో వరుసగా నాల్గో విజయంపై భారత్ కన్నేసింది.
నవతెలంగాణ-విశాఖపట్నం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భారత్‌కు మరో రెండు మ్యాచ్‌లే ఉన్నాయి. తుది జట్టు సమీకరణాలను బేరీజు వేసే పనిలో నిమగమైన జట్టు మేనేజ్‌మెంట్.. చివరి రెండు టీ20ల్లో పెద్దగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా లేదు. బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ దాదాపుగా కుదిరినా.. రెండింటిలోనూ ఒకట్రెండు మార్పులు చేయాలనే ఆలోచన సూర్యకుమార్, గౌతం గంభీర్‌లో కనిపిస్తోంది. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నేడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సిరీస్‌పై ఆశలు ఆవిరి చేసుకున్న న్యూజిలాండ్.. ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యేందుకు ఊరట విజయంపై ఆశలు పెట్టుకుంది. పరుగుల పండుగ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా విశాఖపట్నంలో నేడు భారత్, న్యూజిలాండ్ నాల్గో టీ20 పోరు.
సంజుపై ఫోకస్
వికెట్ కీపర్, ఓపెనర్ సంజు శాంసన్ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా మూడు సెంచరీలు సాధించిన సంజు శాంసన్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. కివీస్‌తో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చినా.. వరుసగా 10, 6, 0 సున్నా పరుగులే చేశాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. భయమెరుగని క్రికెట్ ఆడుతున్న కిషన్.. తొలి మ్యాచ్‌లో 8 పరుగులే చేసినా, రారుపూర్‌లో 32 బంతుల్లోనే 76 పరుగులు పిండుకున్నాడు. 6/2తో భారత్ ఒత్తిడిలో ఉండగా కెప్టెన్ సూర్యకుమార్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచకప్ ముంగిట భారత్ మరో 2 మ్యాచ్‌లే ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో రాణించి, ఫామ్ చాటుకుంటేనే ప్రపంచకప్‌లో తుది జట్టులో సంజు శాంసన్ నిలువగలడు. లేదంటే, ఇషాన్ కిషన్ ఓపెనర్ స్థానం సొంతం చేసుకునేందుకు పరుగుల దాహంతో ఎదురుచూస్తున్నాడు. క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు అలవోకగా ఆడగల సత్తా, సామర్థ్యం సంజు శాంసన్ సొంతం. కానీ అతడికి మరో రెండు అవకాశాలే మిగిలి ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్‌లో సంజు మినహా అందరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు సిరీస్‌లో రెండేసి అర్థ సెంచరీలు సాధించారు. రింకు సింగ్, శివం దూబె అవకాశం దొరికినప్పుడు దంచికొట్టారు. హార్దిక్ పాండ్య సైతం టచ్‌లోనే ఉన్నాడు. బౌలింగ్ లైనప్‌లో పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రాకు నేడు విశ్రాంతి లభించే సూచనలు ఉన్నాయి. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగం చూసుకోనున్నారు. కుల్‌దీప్ యాదవ్‌ను కివీస్ బ్యాటర్లు లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నారు. వన్డే సిరీస్‌లోనూ కుల్‌దీప్‌ను న్యూజిలాండ్ టార్గెట్ చేసింది. వికెట్ల వేటతో పాటు పరుగుల నియంత్రణపై కుల్‌దీప్ యాదవ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ఊరట లభించేనా?
చారిత్రక వన్డే సిరీస్ అనంతరం టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ఊహించిన చేదు గుళిక వరుస ఓటములు. మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది. నాగ్‌పూర్‌లో 48 పరుగులతో, రారుపూర్‌లో 28 బంతులు ఉండగానే, గువహటిలో 60 బంతులు ఉండగానే లక్ష్యాలను ఛేదించింది. బ్యాట్‌తో, బంతితో భారత్‌కు పోటీ ఇవ్వటంలో విఫలమైన న్యూజిలాండ్.. నేడు విశాఖలో ఊరట కోసం తపిస్తోంది. విజయం మాట అటుంచి.. కనీసం భారత్ విజయం కోసం ఆఖరు ఓవర్ వరకు చెమట్చోడేలా చేసినా చాలు అనే స్థితిలో న్యూజిలాండ్ కనిపిస్తోంది. గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, మార్క్ చాప్‌మన్ బ్యాట్‌తో మరింత బాధ్యత తీసుకుంటే కివీస్ 200 ప్లస్ స్కోరు సాధించగలదు. జాకడ్ డఫ్ఫీ, ఇశ్ సోధి సహా కైల్ జెమీసన్‌లు భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు కొత్త ప్రణాళికలతో రావాలి. లేదంటే, విశాఖలోనూ కివీస్‌కు చేదు అనుభవం తప్పదు.
పిచ్, వాతావరణం
విశాఖపట్నం పిచ్ ఛేదనకు అనుకూలం. ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో మూడింట రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. సగటు స్కోరు 150 పరుగులే అయినా, గత మ్యాచ్‌లో ఓవరాల్‌గా 400 ప్లస్ పరుగులు నమోదయ్యాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. నేడు విశాఖలో అత్యధిక స్కోరు లాంఛనమే!. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది. మ్యాచ్ సమయంలో వాతావరణం ఆహ్లాదరకంగా ఉండనుందని సమాచారం.



