Thursday, December 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జ్ఞానానికి వారధి..పుస్తకం

జ్ఞానానికి వారధి..పుస్తకం

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో బుక్‌వాక్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పుస్తకాలు జ్ఞానవారధులని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. 38వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ‘బుక్‌ వాక్‌’ను బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం నుంచి ఎన్టీఆర్‌ స్టేడియంలోని అందెశ్రీ ప్రాంగణం (బుక్‌ ఫెయిర్‌)వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ప్రపంచంలో సాంకేతికత ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ, పుస్తకానికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. పుస్తకాలు మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే కిటికీల వంటివని అభివర్ణించారు. వ్యక్తిగత వికాసం, ఇతరుల జీవిత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి పఠనం ఒక వారధిలా ఉపయోగపడుతుందని అన్నారు.

బాహ్య ప్రపంచం వేగంగా మారినా, పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠకులు, సందర్శకులకు పుస్తక దాన ప్రాధాన్యతను వివరించారు. బుక్‌వాక్‌ అనంతరం తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎస్వీ.సత్యనారాయణ బుక్‌ ఫెయిర్‌లో భాగంగా ఏర్పాటు చేసిన బుక్‌ డొనేషన్‌ బాక్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యమ్రంలో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్షులు యాకుబ్‌, ఉపాధ్యక్షులు బాల్‌ రెడ్డి, కార్యదర్శి వాసు, ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి, సుద్దాల అశోక్‌తేజ, ఎం.వేణుగోపాల్‌, ఎస్‌వి.సత్యనారాయణ, నిఖిలేశ్వర్‌, బిఎస్‌. రాములు, విరాహత్‌ అలీ, వల్లీశ్వర్‌, విజయ్ కుమార్‌, శిల్పి రమణారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎకె ప్రభాకర్‌, ఆనందాచారి, మోహన కృష్ణ, జయదేవ్‌, మెర్సీ మార్గరెట్‌, సజయ్, రియాజ్‌, వెన్నెల గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా సాగుతున్న అక్షర పండుగ
ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన డిసెంబరు 29 వరకు కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని తమకు నచ్చిన పుస్తకాలను సేకరిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించేలా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను సీఎస్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -