భూమి ఎక్కడున్నా భూమే.. గాలి ఎక్కడ వీచినా గాలే.. కానీ మనిషి మాత్రమే ఎక్కడున్నా మనిషి కాలేకపోతున్నాడన్న రచయిత నివ్వెరపాటును ఆవేదనగా ఆరబోసిన అక్షరాల తడి ఇది..
శాస్త్ర సాంకేతికతలో ప్రపంచం శరవేగంతో దూసుకుపోతున్నా కుల వల తాళ్ల మధ్య ఊపిరి గిలగిల కొట్టుకున్న మూలవాసిని వలపోత ఇది.తాతల తలపుల్లో తరాలుగా సమాధి కాబడ్డ మాలబ్రాహ్మణిల ఆత్మఘోషలివి..
ఓ నిద్ర పట్టని రాత్రి తాత రాజేసిన అగ్గి రవ్వ పెద్దన్నలో పెద్ద చిచ్చే రగిల్చింది.ఋగ్వేద కాలం నుండి కాలకూటం చిమ్ముతున్న కుల సర్పం దర్పం అణచడానికి నిరంతరం జరుగుతున్న ప్రతిఘటనల పరంపరే ఈ మాల బ్రాహ్మణి. సాంప్రదాయపు ముసుగులో తెలివిగా సమాజాన్ని చాతుర్వర్ణ చట్రంలో బిగించి సష్టించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అనాది కాలంగా ఒక జాతి మరో జాతిపై ప్రదర్శిస్తున్న ఆధిపత్యపు అవరోహణ క్రమం, అహంకారపు పెత్తందారితనం రచయితను అణువణువున దహించి వేసింది. గాలి,నీరు, వెలుతురు అన్ని ప్రాణులకు ప్రకతి సమంగా ఇచ్చింది.కూడు,గుడ్డ, గూడు ఇవి చాలు కదా మానవ మనుగడ సాగడానికి..? మరి కులం ఎక్కడి నుండి వచ్చింది..? కులం ఇంతలా మనిషి చిరునామాగా ఎందుకు మారింది..?మతం మనిషి అస్తిత్వం గా ఎందుకు రూపుదిద్దుకుంది..? పాఠకున్ని పరి పరి విధాలుగా మెదడు తొలిచే ప్రశ్నలివి. జక్కన్న శిల్పం చెక్కినట్టు దశ్యాలను అలా అల్లాడు పెద్దన్న. ఏకబిగిన చదివించే కథా కథన శిల్ప చాతుర్యం.అబ్బురమనిపించే దళితవాడ జీవిత వర్ణన. వస్తువు పాతదయినా కథను కొత్త తరీకాలో తీసుకెళ్తూ,ఉత్కంఠ రేపుతూ, ఊహకందని ముగింపుతో చదువరి గుండెను పిండేస్తాడు. పాఠకుని హదయం తుదకు శూన్యాకాశం.
చరిత్రను పరిశీలిస్తే కామమెప్పుడూ కులాన్ని కోరలేదు. పెళ్లి మాత్రం అనేక సందర్భాల్లో కులాన్ని కోరకుండా లేదు. ఓ దళిత యువకుడు అగ్రవర్ణ అమ్మాయిని ఇష్టపడితే ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అదే అగ్రవర్ణ అబ్బాయి దళిత యువతిని ప్రేమిస్తే లేదా కామిస్తే పర్యవసానం ఏమిటో రచయిత తన రచనా నైపుణ్యంతో రక్తి కట్టించాడు. కథ మొత్తం మనో సౌందర్యవతి అయిన మాలపిల్ల శారద కేంద్రంగా సాగినా, నిర్మల ప్రేమ మూర్తి అయిన ప్రేమమ్మ పాత్రలోకి రచయిత పరకాయ ప్రవేశం చేసి సమకాలీన సమాజ రుగ్మతలు, లోకం పోకడ, అగ్రకుల అరాచకాలు, దళిత జనుల నిస్సహాయత, ప్రేమైక జీవనం,విశ్వ మానవ శ్రేయస్సునే కాక మత మౌఢ్యాలనూ మాట్లాడిస్తాడు.
పాఠకుని ఊహా వైశాల్యానికే వదిలి రచయిత మన హదయంపై భారం మోపుతాడు.
దీక్షితులు..ఆధునిక భావాలున్న సాధారణ యువకుడు. విద్యావంతుడు.అభ్యుదయవాది.తాను నమ్మిన సిద్ధాంతమే తుదకు తనను బలిజల్లింది. ప్రేమమ్మ తోనే కాదు రచయిత తాను దీక్షితులు ఆత్మ లోకి ప్రవేశించి రంగయ్య పంతులు నెపంతో సమాజానికి హితబోధ చేస్తాడు. మనిషి మనిషిలాగ ఉండడమే ప్రాథమిక సూత్రమనీ, తెచ్చి పెట్టుకున్న విశేషణాలేవి మనిషి స్థాయిని పెంచబోవని ప్రగాఢ నమ్మకం వున్నవాడు. తన పిల్లలను తాను మింగిన పాములా తన కులమే తుదకు దీక్షితులు రక్తంతో తన పరువు దాహం తీర్చుకుంది.
కుల అహంకారానికి మనిషి రూపం రంగయ్య పంతులు. తక్కువ కులం వాడితో తన భార్య సాన్నిహిత్యాన్ని పసిగట్టి, అతడిని జీతం నుండి తొలగించి, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒళ్ళు పచ్చులారని దళిత బిడ్డను చెరబట్టబోయి ఆమె చేతిలోనే హతమైన కామోన్మాది. దీక్షితులు హత్యలో ప్రధాన అనుమానితుడైన అగ్రకుల అహంభావి. మనం ఒప్పుకోకపోయినా బయటపడని రంగయ్య బాబులు సమాజంలో కోకొల్లలు. ఇకపోతే కథ మొత్తంలో రెండు మూడు సార్లు మాత్రమే తారసపడే పాత్ర పెద్ద పంతులు. దీక్షితులు తండ్రి. గోముఖ వ్యాఘ్రం. ఎదలో కుల చెదల పుట్ట ఉన్నా ముప్పొద్దులా గాయత్రి పఠించే సత్యనిష్టాగరిష్టుడు. పంచదార పాకంలో ముంచి తీసిన విష గుళిక వీడు.
నిజమో కాదో ఇతమిద్దంగా తెలియనప్పటికీ తాత చెప్పిన ఈ కథలోని పాత్రలన్నీ సమాజంలో ప్రతి నిత్యం మన కళ్ళ ముందు తారసపడేవే. ప్రతి సందర్భంలో మనతో సంభాషించేవే.
ప్రపంచం ఒక దివ్య ధామం. సూర్యుడు, చుక్కలు, సముద్రాలు, నదులు, అడవులు, పూలు మానవునిచే సష్టింపబడలేదు. అనంత విశ్వ సౌందర్యంలో కురచనైన మానవ జన్మకు,మనిషి కులాలు మతాలు జాతులు వర్గాలుగా విడిపోయి ఆ అద్భుత దివ్యత్వాన్ని చవిచూడటం లేదు.
గాలి మతం పేరుతో తన ఉనికి చాటుకోదు. పర్వతాలు కులం పేరుతో ప్రసిద్ధికెక్కలేదు. మనిషి మనిషిగా కాకుండా కులం మతం ప్రాంతం జాతి వర్గం ఆస్తి అందం పేరుతో అస్తిత్వమవడం వ్యర్థమైన విషయం. తన మొట్టమొదటి కథగా చెబుతున్న పెద్దన్న దీని ద్వారా తాను చెప్పదలచుకున్న అంతిమ విషయం ఇదే. తాను చెబితే తప్ప ఇది పెద్దన్న మొట్టమొదటి రచన అని సాధారణ పాఠకుడు గ్రహించలేడు. పెద్దన్న పుట్టుకవి. ప్రకతి కొందరిని అలా కరుణిస్తుంది. కవితాత్మక వాక్యాన్ని తనకు కళగా నియమించుకుంది.
ఈ పెద్దన్న కలంలోనూ బిగువుంది. జిగివుంది. ఒక్క వాక్యమైనా విసుగు పుట్టించని అందమైన వచనం వుంది. సమాజాన్ని విడదీసేది కులమైతే కలిపేది ప్రేమ. ప్రేమజిగురు ఆరిపోయిన హదయాలకు ఈ నవలిక వరదాయిని. నవలిక పేరులోనే ఆక్సిమొరాన్ ప్రయోగంతో సమతాకాంక్షను ప్రతీకించిన నైపుణ్యానికి అబ్బురపడ్డాను. పుస్తకం ఆసాంతం ఒక్క గుక్కలో చదివిస్తుంది.
- తులశ్రీనివాస్, 9948525853