ఒక వ్యక్తి అంత సులువుగా కవిగా రూపొందడు. కవిగా రూపొందడం వెనుక అతని మీద చాలా ప్రభావాలు పడుంటాయి. గతంలో అతను చదివిన సాహిత్య రచనలు, సాహితీ విషయాలు అతనిలో ఎంతో కొంత ప్రహహించడం వల్లే అతను సాహితీ రచన వైపు ఉద్యుక్తుడవుతాడని నేను భావిస్తాను. నా విషయంలోనూ అదే జరిగింది. 2013 నుండి చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. ప్రేమ, ప్రకతి, మానవత్వం వంటి కొన్ని అంశాల మీదే రాయగలిగేవాణ్ణప్పుడు. 2015 దాకా నేను కవిత్వ పుస్తకాలేవీ చదవలేదు ఒక్క శ్రీశ్రీ ‘సిప్రాలి’ తప్ప. 2015 ఫిబ్రవరి నుండి సాహితీ సభలకు వెళ్ళడం మొదలుపెట్టాను. నేనుండే హనుమకొండ ప్రాంతంలో ఎక్కడ పుస్తక విడుదల సభ ఉందని తెలిసినా వెళ్ళేవాణ్ణి. నా చేతికి పుస్తకాలు వస్తుండేవి. అలా ఆగస్టు నెలలో ఓ వచన కవితా సంపుటి నా చేతిలో పడింది. ఆ పుస్తకం పేరు ‘వేయి సంకెళ్ళు – పిడికిలొక్కటే’. రచయిత మొగిలిచర్లకు చెందిన నసీరుద్దిన్. నాకూ అప్పటిదాకా తెలియని కవే.
చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు ఉండడం వల్ల పేరు చూసే ఆ పుస్తకానికి ఆకర్షితుణ్ణయ్యాను. నా చేతికి అందిన మొదటి వచన కవిత్వ సంపుటి అయ్యేసరికి ఇంకా ఆత్రంగా ఉండి చదవడం మొదలు పెట్టాను. పుస్తకంలోని మొదటి కవిత నుండి చివరి కవిత దాకా అన్నీ సామాజిక అంశాల ఆధారంగా రాయబడినవే. ఊరు, రైతులు, వారసత్వ కట్టడాలు, అత్యాచారాలు, విద్య, ప్రపంచీకరణ, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, జీవవైవిధ్యం…. ఇలా ఎన్నో భిన్నమైన సామాజిక అంశాల మీద రాయబడ్డ కవితలు ఆ పుస్తకం నిండా పరుచుకొనున్నాయి. ఎంతో చరిత్ర, సంస్కతి కలిగిన తన ఊరు ఆగమౌతోందన్న ఆవేదనతో రచయిత రాసుకున్న మొదటి కవిత నుండి మొదలుకుంటే, ‘సారూ.. మీరే చెప్పాలి’ అంటూ ఓ సామాన్యుడు సమస్యలన్నింటిని ఏకరువు పెడుతూ జడ్జీని న్యాయాన్యాయాలు తేల్చమని అడుగుతున్నట్టుగా రాసిన చివరి కవిత దాకా ప్రతి కవితా ఓ ఉద్వేగం నిండినదే. చదువుతూ ఒక్కో పేజీ తిప్పుతున్న కొద్దీ నేనూ భావోద్వేగానికి లోనౌతూనే ఉన్న. కొన్నిసార్లు చదవడం ఆపేసి మళ్ళీ తేరుకున్నాకే చదివాను.
మొత్తంగా పుస్తకం చదవడం అయిపోయాక నేను గ్రహించిన విషయాలు కొన్నున్నాయి. అవేంటంటే… కవిత్వమనేది అధిక అలంకారాలతో, సమాసాలతో ఉండవలసిన అవసరమేమీ లేదు. సరళంగానూ రాయవచ్చు. పాఠకుడిలో ఉద్వేగాన్ని నింపేలా, ఆలోచింపజేసేలా, ఓ చలనాన్ని కలిగింపజేసేలా రాస్తే చాలు. అదే గొప్ప కవిత్వం. కవిత నిడివి పెంచాలంటే తీసుకున్న వస్తువు మీద ఎక్కువ అవగాహన అవసరం. అవగాహన రావాలంటే అధ్యయనం అవసరం. ఈ పుస్తకంలో ఎక్కువగా ఉన్న కవితా వస్తువు రైతు. పుస్తకం చదివిన ప్రభావం వల్ల ఎక్కువగా రైతు గురించి ఆలోచన, ఆవేదన కలిగి నేను ‘రైతు జీవన చక్రం’ శీర్షికతో కవిత రాసాను. అప్పటిదాకా పది పంక్తులకు మించకుండా రాయలేని నేను అంతకు మించి రాయగలిగాను. అంతేకాక స్టాంజా(ఖండిక)లుగా విభజించి కూడా రాసాను. నా మొదటి కవితా సంపుటి ‘అలికిడి’లో దీన్నే మొదటి కవితగా ఉంచాను. ఎందుకంటే ఆ కవిత నుండే కొంచెం పూర్తిస్థాయిలో వచన కవితా పద్ధతిని అనుసరించానుకుంటున్నాను.
ఆ పుస్తకం చదివి సరిగ్గా దశాబ్ద కాలం గడిచిపోయిందిప్పటికి.
ఈ దశాబ్ద కాలంలో పూర్వకవులవి, ప్రస్తుత కవులవి కలిపి వందకు పైగా వచన కవితా సంపుటాలు చదివాను. నచ్చిన, స్ఫూర్తినిచ్చిన వాటి సంఖ్య కాస్త పెరిగింది. స్ఫూర్తినిచ్చిన కవిత్వం నా చేత మరింత బాగా కవిత్వమల్లే ప్రయత్నం చేయిస్తూనే ఉంది. తర్వాతి కాలంలో స్ఫూర్తినిచ్చిన కవిత్వంతో పోలిస్తే నసీరుద్దిన్ కవితా సంపుటిలోని కవిత్వం చాలా గొప్పదేమీ కాకపోవచ్చు. దాన్ని పూర్తిస్థాయిలో గొప్ప వచన కవితా సంపుటని చెప్పలేకపోవచ్చుగానీ, నాలోని కవిత్వపు మొలకను చెట్టుగా ఎదిగించడంలో తొలి మూలకమయ్యింది కాబట్టి బాగా గుర్తుండిపోయింది. నా పరంగా నాకు గొప్పదయ్యింది. కవిత్వ స్ఫూర్తిని పెంచిన పుస్తకంగా నా మనసులో నిలిచిపోయింది. తన ఆ మొదటి పుస్తకం విడుదల చేసిన కొంత కాలానికే కవి నసీరుద్దిన్ అనారోగ్యం పాలయ్యి సాహిత్య రంగానికి దూరమయ్యారు. ఆయన ఎక్కడున్నా బావుండాలని, వీలైతే రాస్తూ పుస్తకాలుగా తన కవిత్వాన్ని వెలువరించాలని ఆశిస్తూ, నన్ను పరోక్షంగా సామాజిక కవిత్వం రాసేలా ప్రేరేపించిన ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
- కార్తీక రాజు, 8977336447



