Sunday, September 28, 2025
E-PAPER
Homeసందర్భంమస్తకానికి పదును పెట్టాలి పుస్తకం

మస్తకానికి పదును పెట్టాలి పుస్తకం

- Advertisement -

సాహిత్యం అన్ని కాలాలలో ఒకేలా ఉండదు. కాలంతో మారుతూ, కొత్తపోకడలను సంతరించుకొంటూ ముందుకు సాగుతుంటుంది. వేయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో చాతుర్వర్ణ వ్యవస్థను విధిగా వర్ణించడం కవిసమయంగా మారిపోయి ఆ పునాదుల్ని మరింత బలిష్ఠం చేసే ఇతిహాసాలూ, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు ఎన్నో పుట్టుకువచ్చాయి. అగ్రవర్ణ జన్ములే రచనార్హులని, శూద్రులు రాసిన కవిత్వం కాకిముట్టిన పాయసంలా ఆస్వాదనీయం కాదని నాటి అలంకారికులు నిస్సిగ్గుగా ప్రకటించారు. ఆధ్యాత్మికత కేంద్రకంగా పురాణ ప్రోక్తకథలే కావ్య వస్తువులై వివిధ ప్రక్రియల్లో కాషాయ కాంతులు విరజిమ్మాయి.

మారేకాలం సమాజంతో పాటూ, సాహిత్యాన్ని కూడా అనేక మార్పులకు గురిచేస్తుంది. ఇలాంటి యుగసంధి కాలంలోనే కాలం కడుపుతో ఉండి కనేక కవులు జన్మిస్తారు. అలాంటి కారణజన్ముడు గుర్రం జాషువా. ఆకాలంలో విద్యాసౌకర్యాలు అంతగా లేవు. ఉన్నా అగ్రవర్ణ ధనికులకు తప్ప దళితులకు అవకాశాలు మగ్యం. విద్యను అమితంగా ఇష్టపడే జాషువా చదువు అతికప్టం మీదనే కుంటుతూ సాగింది. జాషువా కవిత్వ ప్రేమికుడు అందువల్ల ”కంటబడ్డ పద్యకావ్యం సాధించి/ చదవకుండనెపుడు వదలలేదు/ కవితచెప్పువారు గనిపింపనేయంబు/ సేయకుండ వెడలనీయలేద” అని చెప్పుకొన్నాడు. జాషువాకు సంస్కతం అందని ద్రాక్ష. మాలలకు సంస్కతం చెప్పడానికి ముందుకు రాలేదు నాటి నామాలవారు. ఐతే జూపూడి హనుమచ్చాస్త్రి దయాపరుడు, శతావాధాని ”యవ్వాజకపన్‌/ నాపైనినెరిపికరపెన్‌/ దాపరికములేక కాళిదాసత్రయమున్‌” అని సాశ్రునేత్ర యుగళితో గురువుని స్మరించుకొన్నాడు. జాషువా జీవితమే కాదు అతని చదువు కూడా వడ్డించిన విస్తరి కాదు.

ఆధునిక యుగంలో ఆంగ్లసాహిత్య పరిచయం పెంచుకొన్న యవకహదయాలు తెప్పవోలిక తేలిపోయే చంద్రవదనల దరహాస వెన్నెలలో జలకాలాడుతూ ”ఎవరి కోసమో కుమిలియేడ్చే” రోజులలో భావ కవిత్వం క్రమంగా బావకపితంగా మారి కోణంగి గంతులు వేస్తున్న తరుణం. జాషువా భావ కవిత్వాన్ని వ్యతిరేకించాడు. ”కవి సమయంబు దప్పి నుడికారపు సొంపును బాడుసేసి నీ వెవతుక కోసమో కుమిలి యేడ్చుచు జక్కని తెల్గు కైత కా యువులు గుదించి యేమిటి కయోమయముం బొనరింతువీవు నీ కవనము పాడుగాను! వెడగా! యిక నేనియు రమ్ము దారికిన్‌” అని నేల విడిచి సాము చేయలేని గుర్రం జాషువా నీలికిరణాల నిప్పుగొంతుకతో వెలివాడల మూకివేదనలను కావ్యవస్తువులుగా మార్చాడు. గుళ్ళోను, బళ్ళోను, ఊళ్ళోను ఎవరినీడ పడటమె ఘోరాపరాధంగా భావించే సామాజిక వెలివేతను తట్టుకొని జాషువా అక్షరంతో స్నేహం చేసాడు. కవులందురూ చదువులరాణిని తల్లిగా భావించే చోట పినవీరభద్రుడు ‘వాణీనారాణి’ అన్నాడు. స్వయంప్రతిభాశాలీ, ప్రయత్నశీలి అయిన జాషువా ఎలుగెత్తి ”ననువరియించిన శారద లేచిపోవునే” అని గవ్వకు సాటిరాని పలుగాకుల మతోన్మాద మూకలమీద రవ్వలు రువ్వే ధిక్కారస్వరం వినిపించాడు జాషువా. అరుణ కాంతుల ఆలోచనల విభాప్రభాతంలో నీలికాంతుల తొలిపల్లవుల దళితవైతాళిక గీతాలు పాడాడు జాషువా.

అభ్యుదయ కవిత్వోన్ముఖ ఆలోచనలు రెక్కలు తొడుగుతున్న సన్నివేశంలో ఆమ్నయ భావజాల కులకుడ్యాలను కూల్చే కళాకుఠారం చేతబూని ప్రత్యామ్నయ సాహిత్య సష్టి చేసిన సమయజ్ఞడు జాషువా. ‘వాని రెక్కల కష్టంబు లేనివాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు/ భోజనము బెట్టువానికి భుక్తి లేదు- సమాజంలో అసమానతలకు శ్రమదోపిడి కారణంగా మార్క్సీయవాదులు చెపుతారు. అది వాస్తవమే అయితే భారతదేశంలో ఆర్థికదోపిడితో పాటూ వర్ణవివక్ష రాపిడీ మరో ప్రధాన కారణం.
మస్తకానికి పదును పెట్టాలి పుస్తకం. ఊకను నింపిన బస్తాలా పుస్తకం ఊహలతో నింపేది కాకూడదు. సామాజికవాస్తవికత భూమికగా కథలైనా. కవితలైనా రాయడం కాలంతో నడిచే బాధ్యతాయుత సజనకారుల పని. తన కాలపు భావాజాలానికి ఎదురొడ్డి సాహిత్యసజన చేసిన కవివీరుడు జాషువా. అటు పేదరికంతోనూ ఇటు వర్ణవివక్షతోనూ ఏకకాలంలో పోరాడిన యోధుడు జాషువా. ఖాళీ జేబు, ఖాళీ కడుపు చెప్పే పాఠాలు లోకంలో ఏ గురువూ చెప్పలేడు. అందుకే జాషువా పేదరికం, వర్ణ వివక్ష రెండూ నా గురువులని పేర్కొన్నాడు.

జాషువాది పదునైన దక్కు. సమాజంలోని అన్ని రకాల అంతరాలను ఎదుర్కొన్నాడు స్వయంగా ఎందరో సమకాలీన జీవితాలను దగ్గరగా చూసాడు. మార్కిస్టు సాహిత్యమంతా ధారణచేసి ఉండక పోవచ్చు, పద్యాలలో ఎక్కడా అలాంటి పారిభాషిక పదజాలం ఉపయోగించి ఉండకపోవచ్చు. కానీ జాషువా సమస్త సాహిత్యం పీడితుల జీవితాలనే చిత్రించింది. జాషువాలో మానవీయ కోణం ప్రగాఢంగా ఉన్న కారణంగానే సమాజం వర్గవిభాజితంగా ఉందని తేలికగానే గుర్తించగలిగాడు. పేద ధనిక తేడాకు కర్మఫలం కారణం కాదని, అది శ్రమ దోపిడిగానే పసిగట్టాడు.
”ఎవడారగించు నమత భోజనంబున/ గలిసెనో యీ లేమ గంజిబువ్వ/ ఎవడు వాసము సేయు శంగార సౌధాన/ మునిగెనో యిన్నారి పూరిగుడిసె/ ఎవని దేహము మీది ధవళాంబరములలో/ నొదిగెనో యిన్నారి ముదుక పంచె/ ఎవడు దేహము సేర్చు మదుతల్పములలోన/ నక్కెనో యీ యమ్మ కుక్కిపడక/ వసుధపైనున్న భోగ సర్వస్వమునకు/ స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు/ నెవడపహరించె నేమయ్యె నీమె సుఖము/ కలుషమెఱుగని దీని కొడుకుల సుఖము.”

ఈ పద్యం జాషువా వర్గస్పహకు తార్కాణం. భర్తను కోల్పోయి గంపెడు పిల్లలతో బిక్షాటన చేస్తూ బతుకునీడ్చే ఓ ‘అనాథ’ మీద రాసిన కావ్యం ఇది. ఇందులోని ప్రతిపాదం అసమసమాజం మీద ఎక్కు పెట్టిన ప్రశ్ననే.
కాళిదాసు మేఘసందేశంతో సందేశ కావ్యాల ధోరణి మొదలైంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని వేదాంత దేశికులు హంస సందేశం వచ్చింది. తెలుగులో సందేశ కావ్యాలకు కొదవ లేదు. వైయక్తికమైన ప్రేమనో, విరహమో ప్రేమికులకు పంపడమే కనిపిస్తుంది. మబ్బునో, హంసనో పెట్టి శ్లోకాలు పద్యాలు రాసిన కవులు ఉన్నారు. ఒక్క జాషువానే తన, తన జాతి జనుల వేదనను, అణచివేతలను, పరాభవాలను సందేశంగా పంపడం ఒక పెనుమార్పు. ఏ పక్షీని చూస్తే అశుభంగా బెదిరిపోయే శకునాల సంకుచిత సమాజంలో గబ్బిలాన్ని సందేశహారిగా చేసుకొని ‘గబ్బిలం’ రాసారు జాషువా. లోకం అంటరానివాడిగా ఊరవతలికి నెట్టేసిన వారి జీవన వేదన. అదే లోకానికి కంటరానిదిగా బావించే పక్షితో సందేశం పంపడం తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వం. ఇది జాషువా జీవన సాఫల్య కావ్యం అనడంలో సందేహం లేదు.

చిక్కినకాసుచేఁ దనివిఁ జెందు నమాయకుడెల్ల కష్టముల్‌/ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న/ ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం/ డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగట్టు బిడ్డడై”
ఇది కేవలం జాషువా జీవన నేపథ్య పద్యమేగాక పంచములని అంటరానివారని ఊరవతలకి నెట్టివేయబడిన దళితుల మూగవేదనలకు, అమానుష వర్ణ వివక్ష, సమాజ తీరు తెన్నుల్ని ఈ కావ్యం కళ్ళకెత్తుంది. సహజంగా ఇంట్లో చివరి బిడ్డను గారాబంగా చూసుకొంటారు. కాని చిత్రంగా భారత సమాజంలో ఈ కడగొట్టు బిడ్డను మాత్రం కష్టాల పాలుచేసింది. వెలివాడల అంతర్లోక శోకాన్ని గబ్బిలంలోని ప్రతి అక్షరం చిత్రికపడుతుంది.

దుఃఖం తెలియని వాడు ఓదార్చ లేడు. జాషువా శోకానలదగ్ధమూర్తి కనుకనే జాషువా పద్యం ఓదార్చినంతగా మరో కవి పద్యం వేదనామయ జీవితాలను ఓదార్చలేదు. జాషువాది అనుభవం మిగతా కవులది అనుభూతి. జాషువాది కరుణవీరం. కేవలం వ్యథ చెప్పి ఊరడించదు కథ మార్చే కదనాన్ని పురిగొలుతుంది. పోరాడుతూ పోరాడాల్సిన అవసరాన్ని శషబిషల్లేకుండా బలంగా చెప్పిన ఆచరణశీలి జాషువా. పాత పద్యంలో ఆధునిక భావాలు పలికించిన మనకాలపు మహాకవి జాషువా. పంచెకట్టులో కనిపించే ప్రగతిశీల కవిత్వం. అందుకె ఒకచోట ”కొడవటి టెక్కేమున్‌ దలయు గూరిచి.కార్మిక కర్షకాళితో/ నడుము బిగించే నీ యుగము నందొక నూతన సామ్యవాదమని’ సుత్తికొడవలి జెండా స్పూర్తిని చాటారు.
ఆప్పకవి శూద్రుడు రాసిన కవిత్వం కాకి ముట్టిన పాయసం అన్నాడు కానీ జాషువా కాలికి వెంకట గండపెండేరం తొడిగిన గురువులకే గురువు శతావధాని చెళ్ళపెళ్ళ శాస్త్రీ గారు జాషువాలాంటి కవి బ్రాహ్మణ కవులలో సైతంయెవ్వడో వేత్తల్లో తప్ప ఉండడన్నారు
”ఎంత దూరమో యెందుల కెవడు జాషు వాయను కవిప్రవరుడు కవనము నందు వాని బోలెడువారె యెవ్వారరేని విప్రకవులందు యెవ్వడో వేత్త దక్క”

షుకూర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -