Sunday, November 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వాస్పత్రిలో వికటించిన ఇంజక్షన్‌

ప్రభుత్వాస్పత్రిలో వికటించిన ఇంజక్షన్‌

- Advertisement -

17 మంది చిన్నారులకు అస్వస్థత
సకాలంలో చికిత్స.. నిలకడగా పిల్లల ఆరోగ్యం
హాస్పిటల్‌ను సందర్శించిన అడిషనల్‌ కలెక్టర్‌, వైద్యాధికారులు

నవతెలంగాణ- నాగార్జునసాగర్‌
ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు అప్రమత్తమై వైద్యం అందించడంతో వారు వెంటనే కోలుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగార్జునా సాగర్‌ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో మూడేండ్ల నుంచి 10 ఏండ్లలోపు చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉండే చిన్నారులు సైతం శుక్రవారం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు.

వారందరికీ యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు (మోనోసేఫ్‌) వైద్యులు ఇచ్చారు. ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులు చలిజ్వరం, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరితో ఇంజక్షన్‌ తీసుకున్న స్థానికంగా ఉండే పిల్లలు కూడా అస్వస్థతకు గురవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. విషయం తెలిసిన సూపరింటెండెంట్‌ భానుప్రసాద్‌ వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేసి చికిత్స ప్రారంభించారు. ఇంజక్షన్‌ తీసుకున్న మిగతావారికి సైతం సిబ్బంది ఫోన్‌ చేసి పిలిపించి చికిత్స అందించారు. శనివారం ఉదయం వరకు పిల్లల ఆరోగ్యం సాధారణ స్థితికి చేరింది. ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ ఇవ్వడంతోనే ఘటన చోటుచేసుకుందని తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అడిషనల్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌ శనివారం డీసీహెచ్‌ డాక్టర్‌ మాత్రునాయక్‌తో కలిసి ఆస్పత్రిలోని పిల్లలను పరిశీలించారు.

తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌, వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ నారాయణఅమిత్‌ మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు సాధారణంగా ఇచ్చే యాంటీబయాటిక్‌ ఇంజక్షనే వేశారని తెలిపారు. ఇంజక్షన్ల విషయంలో పిల్లల తల్లిదండ్రుల ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడ్రోజుల్లో విచారణ కమిటీ పూర్తి నివేదికను అందజేస్తుందని చెప్పారు. ఆయన వెంట పెద్దవూరు ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీదేవి, నందికొండ మున్సిపల్‌ కమిషనర్‌ వేణు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు హరికృష్ణ, భానుప్రసాద్‌, సీఐ శ్రీనునాయక్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ ముత్తయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -