Friday, December 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివెనిజులాపై సరికొత్త దాడి!

వెనిజులాపై సరికొత్త దాడి!

- Advertisement -

ఏ క్షణమైనా వెనిజులాపై దాడి చేసేందుకు అసాధారణ రీతిలో త్రివిధ దళాలను మోహరించిన అమెరికా వ్యూహాన్ని మార్చుకున్నదా? వ్యవధి తీసుకుంటున్నదా? క్యూబాపై గత కొద్ది దశాబ్దాలుగా ఆర్థికంగా దిగ్బంధనం కావించి లొంగదీసుకొనేందుకు చూస్తున్నారు. ఇప్పుడు వెనిజులా మీద కూడా అలాంటిదాడికే సిద్ధమౌతున్నదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే, వెళ్లే చమురు టాంకర్ల దిగ్బంధనంతో ఆయువుపట్టుగా ఉన్న చమురు ఎగుమతులను అడ్డుకుంటే వెనిజునియన్లు మదురో ప్రభుత్వానికి దూరమౌతారని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తున్నది. ఆ మేరకు చమురు టాంకర్ల దిగ్బంధనాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చాడు.వెనిజులా సముద్రతీరాన్ని అమెరికా చుట్టుముట్టడం యుద్ధంతో సమానమే. దీని అర్ధం మిలిటరీ భౌతికదాడి ప్రమాదం తప్పిందని అనుకొనేందుకు లేదు. దక్షిణ అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ అమెరికా ఖండంలో నౌకా దళాన్ని దింపినట్లు స్వయంగా ట్రంప్‌ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నాడు.

వాటిలో విమానవాహక యుద్ధనౌకతో సహా పదకొండు అధునాతన యుద్ధనావలున్నాయి.’ వాణిజ్యం కొనసాగుతుంది, చమురు, ఇతర సహజ సంపదలన్నీ మావే, మా సంపద, మా భూమి, మా చమురుకు చట్టబద్దమైన యజమానులం మేమే’ అని వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో మరోసారి బుధవారం నాడు స్పష్టం చేశాడు. అమెరికా గత కొద్ది నెలలుగా ప్రచారదాడి సాగిస్తున్నది. వెనిజులా నుంచి ముప్పు ఉందంటే సాధారణ అమెరికన్లు నమ్మే స్థితి లేదు. మన దేశం రష్యా నుంచి చమురుకొనుగోలు చేసి పరోక్షంగా ఉక్రెయిన్‌పై దాడులకు ఊతమిస్తున్నదని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెనిజులా అధ్యక్షుడు స్వయంగా మాదక ద్రవ్యాల మాఫియా నాయకుడని, వాటితో పాటు నేరగాండ్లను అమెరికాలోకి పంపుతున్నాడని, ఇతర దేశాల ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాడని, చమురు సంపదలను కొల్లగొట్టి అమ్మకాలతో సామ్ము చేసుకుంటున్న ఉగ్రవాది అని చిత్రిస్తున్నది. మాదక ద్రవ్యాల ఉగ్రవాదం మీద పోరాటం జరుపుతున్నట్లు నమ్మించేందుకు పూను కుంది. అమెరికా భూమి, చమురు, ఆస్తులన్నింటినీ గతంలో చోరీ చేశారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నట్లు చెప్పటం వాటిలో ఒకటి.

అవేమిటి అంటే 2007 వెనిజులాలో ఉన్న ప్రవేటు అమెరికన్‌ కంపెనీలను నాటి అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ జాతీయం చేయలేదా అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇతర దేశాల మీద భౌతికంగా దాడులు జరపటానికి జంకుతున్న అమెరికా ఆంక్షలతో దాడి చేస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి రష్యా చమురు రవాణా చేసే 183, ఇరాన్‌తో సంబంధం ఉన్న 170టాంకర్లపై గత కొద్ది వారాలుగా ఆంక్షలు విధించింది. ఆ ప్రభుత్వాలను ఏమీ చేయలేక ఇతర దేశాలకు చెందిన వాణిజ్య టాంకర్లను బెదిరించి చమురు రవాణాను అడ్డుకోవటం తప్ప మరేమీ కాదు. ఇప్పటివరకు వెనిజులా చమురు సరఫరా చేసే 30 టాంకర్లపై ఆంక్షలు, ఇప్పుడు దిగ్బంధనానికి పూనుకున్నారు. సెప్టెంబరు నుంచి విమానాలు, నౌకాదళంతో అనేక దాడులు చేసి వెనిజులా నుంచి వస్తున్న పడవలలో ప్రయాణిస్తున్న తొంభై ఐదు మందిని అమెరికా హత్య చేసింది, వారిని అమెరికాకు మాదకద్రవ్యాలను సరఫరా చేసే మాఫియా సభ్యులుగా చిత్రించింది. మదురో దిగిపోయేంతవరకు దాడులు ఇలాగే కొనసాగుతాయని అధ్యక్ష భవన సిబ్బంది ప్రధాన అధికారి సుశీ వైల్స్‌ చెప్పాడు.

వెనిజులాపై అమెరికా మిలిటరీ దాడి జరుపుతుందా? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఛావెజ్‌ పురోగామి భావజాలం కలిగిన ఒక మిలిటరీ అధికారి.లాటిన్‌ అమెరికా దేశాలలో మిలిటరీ పచ్చిమితవాదులతో కూడినది, దానికి భిన్నంగా వెనిజులాలో అనేక మంది పురోగామివాదులు ఉండబట్టే ఛావెజ్‌ నిలదొక్కుకున్నాడు, తన హయాంలో, తరువాత కూడా రాజకీయంగా మిలిటరీలో రాజకీయ భావజాలాన్ని చొప్పించిన కారణంగా అమెరికన్లకు అంత సులభంగా లొంగిపోయే అవకాశం లేదని చెబుతున్నారు. దీనికి తోడు బ్రెజిల్‌, మెక్సికో, కొలంబియాల్లో వామపక్ష, పురోగామి శక్తులు అధికారంలో ఉన్నాయి. మొత్తం లాటిన్‌ అమెరికా జనాభాలో సగం ఈ మూడు దేశాల్లోనే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాలు వెనిజులాకు మద్దతిస్తున్నాయి. ఇలాంటి అనేక ప్రతికూల అంశాలు ఉన్న కారణంగా ప్రస్తుతం మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటున్నదని చెప్పవచ్చు.ఈలోగా వెనిజులాను రెచ్చగొట్టేందుకు పూనుకుంది, సామ్రాజ్యవాదులు ఎప్పుడైనా దురాగతానికైనా పాల్పడవచ్చు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -