Tuesday, March 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

- Advertisement -

ఈగల్‌, హైడ్రా తరహాలో ఏర్పాటు
సన్నబియ్యానికి రూ.14,560 కోట్లు ఖర్చు
86 శాతం మందికి పంపిణీ చేశాం
డీలిమిటేషన్‌తో నియంత పాలన వస్తుంది
దీనిపై హైదరాబాద్‌లో ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేస్తాం : పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈగల్‌, హైడ్రా తరహాలో అది పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని శాసన మండలి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సీఎం పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆహార కల్తీ నియంత్రణకు దేశంలోని అన్ని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు. పంటలకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు.

నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేయటమనేది హత్యానేరం కంటే ఎక్కువని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు దొడ్డుబియ్యం ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించామని తెలిపారు. అందువల్లే సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ ప్రక్రియకు ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం 86 శాతం మంది ప్రజలు, అంటే 3.36 కోట్ల మంది లబ్దిపొందుతున్నారని వివరించారు. భవిష్యత్‌లో ఇది 90 శాతం కూడా కావచ్చని చెప్పారు. రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా 40 ఏండ్లుగా దొడ్డు బియ్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో సన్న బియ్యం ఇస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వివరించారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇచ్చామని పేర్కొన్నారు. రైతులకు లాభం చేకూర్చడంతోపాటు పేదల ఆకలిని సైతం తీరుస్తున్నామని అన్నారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్‌ మార్కెట్‌ మాఫియా తగ్గిందని చెప్పారు. వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించటమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 50 శాతం సీట్లను పెంచితే దక్షిణ భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని హెచ్చరించారు. దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రంలో సర్కారు ఏర్పాటుచేసుకోవడానికి అవకాశమేర్పడు తుందని వివరించారు. సీట్ల సంఖ్యను పెంచిన తర్వాత.. వాటి మధ్య అంతరం కూడా అదే విధంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ అనేది పార్టీల సమస్య కాదని వ్యాఖ్యానించారు.

50 శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలని సూచించారు. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే తన ఉద్దేశమని అన్నారు. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే, అది ఎంతకాలమో కొనసాగదని పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయినప్పటికీ దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ తమకు ఉందన్నారు. లోక్‌సభలో రాష్ట్రాల వారీగా ఇప్పుడున్న సీట్ల సంఖ్య, నిష్పత్తి తగ్గొద్దని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై గతంలో ఇండియా కూటమి తరపున చెన్నైలో మీటింగ్‌ పెట్టాం..త్వరలో తెలంగాణలో కూడా పెడతామని వెల్లడించారు. డీలిమిటేషన్‌పై బండి సంజయ్, లక్ష్మణ్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఉన్న ఎంపీ పదవులు కూడా ఊడతాయని హెచ్చరించారు.

కేసీఆర్‌ లేకపోతే నేను లేను…
కేసీఆర్‌ లేకపోతే తాను లేనని.. ఆయన వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మహాభారతంలో శకుని లేకుంటే కృష్ణుడు లేనే లేడని, రావణాసురుడు లేకుంటే రాముడు ఎవరికి తెలుసని ప్రశ్నించారు. కేసీఆర్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారని అందరు అనుకుంటున్నారు.. కానీ ఆయన్ను కేటీఆర్‌, హరీశ్‌ కలిసి గృహ నిర్బంధం చేశారని సెటైర్లు వేశారు. కాలనాగుకంటే హరీశ్‌ ఎంతో ప్రమాదకరమని విమర్శించారు.

ఆ క్రెడిట్‌ సీఎందే : ఉత్తమ్‌
సన్న బియ్యం పథకం క్రెడిటంతా సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ అన్నారు. సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దీంతో పేదలు కడుపునిండా తింటున్నారని అన్నారు. 86 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. ఆహార భద్రతా చట్టానికి తెలంగాణలో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా ఫరవాలేదు.. సన్నబియ్యం పథకం కొనసాగిస్తామని తెలిపారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాలో ఇప్పటివరకు రూ. 40 వేల కోట్లు వేశామన్నారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లో రైతులకు వేస్తున్నామని వివరించారు.

సన్నబియ్యంతో సీఎం భోజనం
రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్‌ హాల్‌లో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా భోజనం చేశారు. మీడియాకు సైతం అదే సన్నబియ్యంతో భోజనం పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -