సుప్రీం కీలక ఆదేశాలు
తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలు నిలిపేసిన సీజేఐ ధర్మాసనం
అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
స్వాగతించిన కాంగ్రెస్, సీపీఐ(ఎం)
కోటా: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఆరావళి పర్వత శ్రేణులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలను నిలిపివేస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదించిన నిర్వచనంపై వివాదం చెలరేగడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఆరావళి పర్వత శ్రేణులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. నాలుగు రాష్ట్రాల సీఎస్‌లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్త కమిటీ నివేదిక వచ్చే వరకు నవంబర్ 20న ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై తగిన వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదం ఇలా..?
ఆరావళి పర్వతశ్రేణిలో అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. దీనిని సుప్రీంకోర్టు సైతం ఆమోదించింది. దీంతో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు కేంద్రం అనుమతించింది. ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల పర్వతాల్లో అక్రమ మైనింగ్ పెచ్చరిల్లుతుందని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వెలిబుచ్చారు.
ముఖ్యంగా హర్యానా, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీకి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. అయితే ఈ పర్వతాలు థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా గ్రీన్ బారియర్‌గా నిలిచాయి. అలాగే ఢిల్లీ సహా నగరాల్లో కాలుష్యం మరింత పెచ్చరిల్లకుండా కూడా అడ్డుకుంటున్నాయి.
స్వాగతించిన కేంద్రం, కాంగ్రెస్, వామపక్షాలు
సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్వాగతించారు. ఆరావళి పర్వతాల పరిరక్షణ, పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు కొత్త కమిటీని నియమించడాన్ని ఆయన స్వాగతించారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, సీపీఐ(ఎం) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ”నాలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు, మీడియా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాయి.” అని అన్నారు.



