Thursday, February 5, 2026
E-PAPER
Homeక్రైమ్బిల్లుల క్లియరింగ్‌కు రూ.30 లక్షల లంచం

బిల్లుల క్లియరింగ్‌కు రూ.30 లక్షల లంచం

- Advertisement -

– రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ
– జోనల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌పై కేసు
– మరో కేసులో డిప్యూటీ ఈవో ఆఫీస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌..
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/సిటీబ్యూరో

అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భారీ లంచం డిమాండ్‌ చేసిన ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ చిన్నారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆయనతోపాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏసీబీ రంగారెడ్డి జోన్‌ అధికారి ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌ ప్రాంతాలకు సంబంధించిన చెరువుల క్లియరింగ్‌, నిర్వహణ పనులు గతేడాది ఓ కాంట్రాక్టర్‌కు బిడ్డింగ్‌లో వచ్చాయి. ఈ పనులకు సంబంధించి మూడు ప్యాకేజీల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. వాటి మొత్తం సుమారు రూ.1.40 కోట్లుగా ఉంది. ఈ బిల్లులను ప్రాసెస్‌ చేసి అప్రూవల్‌ ఇవ్వాలంటే రూ.40 లక్షలు లంచంగా ఇవ్వాలని ఎస్‌ఈ చిన్నారెడ్డి డిమాండ్‌ చేసినట్టు కాంట్రాక్టర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు రూ.30 లక్షలకు బేరం కుదిరిందని, అందులో ముందుగా రూ.15 లక్షలు, పని పూర్తయ్యాక మరో రూ.15 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్టు కాంట్రాక్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు కాంట్రాక్టర్‌ నుంచి కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో చిన్నారెడ్డి రూ.15 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. ఎస్‌ఈ, కంప్యూటర్‌ ఆపరేషన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ ఈవో ఆఫీస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌
రూ.10 వేలు లంచం తీసుకుంటూ..

బండ్లగూడలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ శివప్రసాద్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకెళ్తే.. నగరంలోని ఓ ప్రయివేట్‌ పాఠశాలను ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించకుండా ఉండేందుకు, అధికారిక పని నిమిత్తం బాధితుడిని జూనియర్‌ అసిస్టెంట్‌ శివప్రసాద్‌ రూ.10వేల లంచం డిమాండ్‌ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. బుధవారం తన కార్యాలయంలో బాధితుడి నుంచి శివప్రసాద్‌ రూ.10వేలు తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా, అక్రమ మార్గంలో లబ్ది పొందేందుకు ప్రయత్నించిన శివప్రసాద్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని నాంపల్లిలోని స్పెషల్‌ జెడ్జి ఫర్‌ ఎస్పీఈ అండ్‌ ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -