– జంపన్న వాగు ఉగ్రరూపంతో కొట్టుకుపోయిన వంతెన
– వరదలతో ‘కొండాయి’కి పొంచిఉన్న ముప్పు
– పట్టించుకోని పాలకులు, అధికారులు
– ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస బాట పట్టిన దళిత కుటుంబాలు
– అడవుల్లో డేరాలు ఏర్పాటు
– తొలగించిన అటవీ అధికారులు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ముంచుకొస్తున్న వరదలను దృష్టిలో పెట్టుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొండాయి ప్రజలు వాగు దాటి వలస బాట పట్టారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి అడవుల్లో డేరాలు వేసుకొని నివసించడానికి సిద్ధమయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని పూర్తిగా ముంపు ప్రాంతమైన కొండాయి ప్రజల దీన గాథ ఇది. గత 20 ఏండ్ల నాటి కష్టాలు మళ్లీ వచ్చాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023లో జులై 27న జంపన్న వాగు ఉగ్ర రూపానికి వాగుపై ఉన్న వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకు పోయి గ్రామాన్ని ముంచెత్తింది. ఆ సమయంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండ్లన్నీ మునిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అప్పటినుంచి ఆ గ్రామానికి రక్షణ కల్పించాల్సిన పాలకులు ప్రజలను విస్మరించారు. రెండేండ్లు గడుస్తున్నా నేటికీ ఆ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇదిగో అదిగో అంటూ పాలకులు మాట దాటేస్తున్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మళ్లీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని కొండాయి గ్రామానికి చెందిన 28 దళిత కుటుంబాలు వాగు దాటి సమీప సురక్షిత ప్రాంతమైన దొడ్ల గ్రామానికి వలస వెళ్తున్నాయి. సురక్షిత ప్రాంతంలో ఇల్లు కట్టిస్తామని అప్పటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పాలకులు దళితులు, గిరిజనులకు అనేక హామీలను గుప్పించినా నేటికీ అమలుకు నోచుకోలేదు.
నిధులు ఉన్నా.. కొనసాగని బ్రిడ్జి పనులు
నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.16.50 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం రూపం దాల్చలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగకపోవడంతో ఈ సంవత్సరం కూడా మల్యాల కొండాయి ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.
ప్రభుత్వం అండగా ఉంటుంది : కాంగ్రెస్ నాయకులు
కొండాయి మల్యాల ప్రజలు భయపడొద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు చిటమట రఘు తదితరులు గ్రామానికి వెళ్లి భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రెవెన్యూ స్థలం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.
స్థలాలను ఖాళీ చేయాలి
కొండాయి ప్రజలు డేరాలు వేసుకున్న ప్రాంతానికి అటవీ అధికారులు వెళ్లి ఇక్కడ ఎవరూ నివసించరాదని, ఇది అటవీ శాఖ పరిధి అంటూ వారి డేరాలను తొలగించారు. దిక్కు తోచని స్థితిలో దళిత కుటుంబాలు గుడారాలు లేక, ఉన్న ఇండ్లను ఖాళీ చేసి బిక్కు బిక్కుమంటూ రోడ్డుపైన తిష్ట వేశారు. చావైనా బతుకైనా రోడ్డుపైనే బతుకుతామని చెబుతున్నారు.
– అటవీ అధికారులు
రెండేండ్లైనా నిర్మాణానికి నోచని బ్రిడ్జి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES