Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుఫోన్లకు దూరంగా.. పుస్తకాలకు దగ్గరగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు

ఫోన్లకు దూరంగా.. పుస్తకాలకు దగ్గరగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు

- Advertisement -

– డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ..
నవతెలంగాణ – దుబ్బాక 

విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా పుస్తకాలకు దగ్గరగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, గతేడాది లాగే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో.. జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు ఫంక్షన్లు, బంధువుల పేరిట విద్యార్థుల్ని స్కూలుకి పంపకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోవడమే కాకుండా చదువు పట్ల ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థినీల కు.. పాఠశాల ఇంగ్లీష్ టీచర్ నీలం శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు “రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ 17, టీబ్రీవాలా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్” స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా బహుకరించిన 44 సైకిల్ లను జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినర్ లక్ష్మయ్య, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ వీరేశం, పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంఈఓ అంజయ్య లతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 30 మంది తో కలిపి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 106 కు చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని మనమే రక్షించుకోవాలని సూచించారు.

డబ్బు కన్నా.. సేవా భావమే ముఖ్యం..

విద్యార్థుల సమయం వృధా కాకుండా స్కూల్ కి ఇన్ టైంలో చేరుకోవడానికి సైకిల్లు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థుల కష్టాన్ని గుర్తించి డబ్బు కన్నా సేవా భావమే ముఖ్యంగా కృషిచేసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో రవాణా సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తే  మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడిన వాళ్లమవుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ ను, స్వచ్ఛంద సంస్థ ల ప్రతినిధులను, నీలం శ్రీనివాస్ లను స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం శాలువాలతో సత్కరించి మెమెంటో లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రఘురామకృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ శ్యామల, నాయకులు పూజారి మల్లేష్, దశరథ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -