విద్యకు సరిపోని కేటాయింపులు
పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకర
ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా ఉచిత వైద్యం స్వాగతిస్తున్నాం
టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ
నవతెలంగాణ – బోనకల్
జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగుచేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని టిఎస్ యుటిఎఫ్ కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది 26,674 కోట్లు మాత్రమే అన్నారు. ఇది మొత్తం బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే అన్నారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించిందగిందే. గత సంవత్సరం కంటే రూ. 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసమే సరిపోవచ్చు అన్నారు.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్నభోజనం నాణ్యత పెంపుగురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. గత సంవత్సరం 7.58 శాతం కేటాయించగా, ఈ సంవత్సరం 8.22 శాతం కేటాయించారు. విద్యకు 15 శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 15 శాతం కేటాయించాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ 1056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నామని, మరి పిఆర్సీ సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ. 1056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని టిఎస్ యుటిఎఫ్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో తెలంగాణ రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి గానీ బడ్జెట్ లో మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసింది అన్నారు. ఇప్పటికే పిఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైంది అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పిఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం విచారకరం అన్నారు. పెండింగ్ డిఎలు, పెండింగ్ బిల్లులు, 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించి ప్రస్తావన లేకపోవటం బాధాకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ, పెండింగ్ బిల్లులు, బకాయిల గురించి కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, ఉపాధ్యక్షురాలు బి సౌభాగ్య లక్ష్మి, కోశాధికారి పి నర్సింహారావు, ఎఫ్ డబ్ల్యూ ఎస్ కన్వీనర్ జల్లా కోటయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్ర సింహ, కే సురేష్, వి రామారావు, ఆలవాల నాగేందర్, ఎం నారాయణ, సిహెచ్ కోటేశ్వరరావు, యు గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.



