– ప్రతి సొసైటీ అకౌంట్లలో రూ.10 లక్షలు జమ చేయాలి :తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ
నవతెలంగాణ- వనస్థలిపురం
మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం రైతుబజార్ చేపల మార్కెట్ వద్ద సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అక్టోబర్ 23న సంఘం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక, ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలపై సంఘం అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలు, దేశంలో 3 కోట్ల కుటుంబాలు మత్స్య వృత్తిపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు.మత్స్యకారుల అభివృద్ధికి నిధుల కేటాయింపు, వృత్తి రక్షణ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్‌లో ప్రభుత్వం రూ.10 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణీకరణ, పారిశ్రామీకరణ వల్ల జలవనరులు, చెరువులు, కుంటలు కబ్జాలు, కాలుష్యానికి గురవుతున్నాయని, ఫలితంగా మత్స్యకారులు వృత్తికి, ఉపాధికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని.. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేసి పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సౌళ్ల లలిత, తడబోయన కృష్ణమూర్తి, పర్రె చంద్రయ్య, పర్రె సునీత, చెక్క కుమారి, చెక్క కృష్ణమూర్తి, అంకర్ల గంగ, కొనింటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES