వారికి రాయితీలు.. సామాన్యులపై భారాలా? : సీపీఐ(ఎ) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం
కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన
జిల్లాల్లో బడ్జెట్ ప్రతుల దహనం
నవతెలంగాణ – ముషీరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా ఉందని, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులు, కూలీలు, కార్మికులు, పేద ప్రజానీకానికి అందే సంక్షేమ పథకాలపై కోతలు విధించారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎన్నోసార్లు కోరినప్పటికీ, బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేకపోవడం తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు ఈ బడ్జెట్ మొండి చేయి చూపిందని, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి అరకొర కేటాయింపులతో పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రాలకు కేటాయింపులలో భారీ కోత విధించారని, స్థూలంగా ఇది పేద, అణగారిన వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయమైన నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపని ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగేలా నిరసన తెలియజేయాలన్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ కాబట్టి మహిళా సంక్షేమానికి నిధులు కేటాయిస్తారని ప్రజానీకం ఆశించిందని, కానీ వారి ఆశలను వమ్ము చేశారని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి నిధుల కేటాయింపులు లేవని, హైదరాబాద్ నగర మెట్రో రైల్ విస్తరణకు మొండి చేయి చూపారని, రాష్ట్రం పట్ల వివక్ష చూపారని అన్నారు. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులుండి కేంద్రం రాష్ట్రానికి ఇంతటి అన్యాయం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.మహేందర్, నగర కమిటీ సభ్యులు జి.నరేష్, ఎన్.మారన్న, సి.మల్లేష్, ఎం.అజయ్ బాబు, జి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, వరలక్ష్మి, పి.విమల, షబానా తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల్లో బడ్జెట్ ప్రతుల దహనం
కేంద్ర బడ్జెట్‌పై మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం వద బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశారు. కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వికలాంగుల జాతీయ వేదిక జిల్లా కన్వీనర్ గొడుగు రామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దహనం చేశారు.
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి మాట్లాడారు. ఐద్వా సౌత్ జిల్లా ఆధ్వర్యంలో జంగంమెట్‌లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఎన్‌పీఆర్‌డీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జియాగూడలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్‌లో బీఈఎల్ రిటైర్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఈఎల్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు జె.రాఘవరావు, జె.శ్రీమన్నారాయణ పాల్గొని మాట్లాడారు. బాచుపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బీ.సీ డబ్ల్యూ కార్మికులు అడ్డా వద్ద నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో, వరంగల్‌లో నిరసన తెలపగా, మెదక్ జిల్లా కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.



