Friday, December 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు₹20 వేల కోట్ల భారం

₹20 వేల కోట్ల భారం

- Advertisement -

సెంట్రల్‌ ప్రాయోజిత పథకాల నిధుల్లో కోతలతో రాఫ్ట్రం సతమతం
ఒక్కో స్కీమ్‌ పేరిట రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు భారం
అప్పులు, వడ్డీలతో అల్లాడుతున్న రేవంత్‌ సర్కారుకు మరిన్ని ఆర్థిక కష్టాలు
బడ్జెట్‌ దగ్గరికొస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల తర్జనభర్జన

రాష్ట్రానికి భారంగా కేంద్రం నిర్ణయాలు

బి.వి.యన్‌.పద్మరాజు

మోడీ సర్కార్‌ దెబ్బకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత విలవిల్లాడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా ఆర్థికభారం పడనుంది. దీన్ని ఎలా అధిగమించాలనే అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల(సీ.ఎస్‌.ఎస్‌ లు)కు ఇచ్చే నిధుల్లో రాష్ట్రాలకు మోడీ సర్కార్‌ కోతలు పెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల రాష్ట్రంపై ఏడాదికి సగటున రూ.20 వేల కోట్ల భారం పడుతుందని లెక్కలు కట్టారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన భారీ అప్పులకు అసలు, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

ఇదే సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, మిడ్‌ డే మీల్‌, పీఎం గ్రామీణ సడక్‌ యోజన, ఐసీడీఎస్‌, నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌, టీచర్‌ ఎడ్యుకేషన్‌ స్కీమ్‌, రాష్ట్రీయ మాద్యమిక్‌ శిక్షా అభియాన్‌, పీఎం ఆవాస్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, గ్రీన్‌ రెవల్యూషన్‌ కృషోన్నతి యోజన, పీఎం ఫసల్‌ బీమా, ఉపాధి హామీ చట్టం తదితర పథకాల అమలుకు సంబంధించి కేంద్రం తన వాటాలను సగానికి పైగా తగ్గించటంతో రాష్ట్రాలపై పెను భారాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఒక్కో పథకం రూపంలో ఏడాదికి సగటున రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,500 కోట్ల చొప్పున భారం పడుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం డిసెంబరు ముగింపు దశలో ఉంది. మరో రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రతిపాదించాల్సి ఉంది. ఈ సమయంలో ఏకంగా రూ.20 వేల కోట్ల భారాన్ని భరించాల్సిరావటం, అందుకనుగుణం గా నిధులను సర్దుబాటు చేయటం అత్యంత కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు కత ఇది
మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిన గత పదకొండేండ్ల నుంచి కేంద్రం క్రమక్రమంగా తన సంక్షేమ బాధ్యతలను తగ్గించుకుంటూ వస్తోంది. ఆ భారాన్ని రాష్ట్రాలపైకి నెడుతోంది. చట్టబద్ధంగా రాష్ట్రాలకు చెందాల్సిన పన్నుల్లో వాటాను ఎగ్గొట్టేందుకు, కేంద్రం సెస్‌లు, సర్‌ఛార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేసుకుంటూ రాష్ట్రాల వాటాల్లో గండికొడుతోంది. కేంద్ర నిధులతో దేశంలో దశాబ్దాలుగా అమలవుతున్న అనేక పథకాల్లో తన వాటాను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వాటి నిర్వహణ వ్యయాన్ని రాష్ట్రాలపై మోపుతోంది. దీంతో రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన దెబ్బతింటోంది.

సెస్‌ పేరిట రూ.5 లక్షల కోట్లు వసూలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సెస్‌ల పేరిట రాష్ట్రాలకు చెందాల్సిన రూ.ఐదు లక్షల కోట్లను కేంద్రం కాజేసింది. మొత్తం పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో ఇది 21 శాతంగా నమోదైంది. ఈ రూ.5 లక్షల కోట్లలో సగం నిధులు వచ్చినా రాష్ట్రాలు సంక్షేమ పథకాలను సులభంగా అమలు చేసే వీలుంటుంది. కానీ మోడీ సర్కార్‌ దీనికి మోకాలడ్డుతోంది. పైగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటాను తగ్గించుకుంటూ…రాష్ట్రాల వాట పెంచుతూ పోతుంది. తద్వారా ఒక్క 2025-26 బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం రూ. 91 వేల కోట్ల సెంట్రల్‌ షేర్‌ను తగ్గించుకుంది. ఆ మేరకు రాష్ట్రాలపై అదనపు భారాలు పడ్డాయి.

ఉపాధిలో 40 శాతం భారం
ఇప్పుడు ఉపాధి హామీ చట్టం పేరును, దాని నియమ నిబంధలను, విధి విధానాలను మోడీ సర్కార్‌ పూర్తిగా మార్చేసింది. ఆ చట్టానికి సంబంధించి 40 శాతం నిధులను రాష్ట్రాలే భరించాలంటూ చట్ట సవరణ చేసింది. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చే చర్య!

కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే
ఈ మొత్తం పరిణామాల వెనుక అసలు ఉద్దేశం రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడేట్టు చేయటమేననే విషయాన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. రాష్ట్రాలను ఈ దుస్థితికి నెట్టేసి, ఆర్థిక-పరిపాలనా స్వావలంబనను క్రమంగా దెబ్బతీయాలన్నది కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశ్యంగా కనిపిస్తున్నదని ప్రభుత్వ విధానాల విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే సమాఖ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావటం ఖాయమనీ, ఆ తర్వాత యూనిటరీ పాలనా విధానాన్ని రాష్ట్రాలపై బలంగా రద్దుతారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -