శాతాల చెల్లింపుపై గందరగోళం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌తో సుంకాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే భారత ఉత్పత్తులపై ఇప్పటి నుంచి 10 శాతం టారిఫ్ మాత్రమే వసూలు చేయనున్నట్టు అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. వాణిజ్య భాగస్వాములపై ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత ఇప్పుడు భారత ఎగుమతులపై విధించే సుంకాలు ఎలా ఉంటాయోనన్న గందర గోళం నెలకొంది. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా మన ఎగుమతిదారులు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్‌పై విధించిన సుంకాలను యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తూ ట్రంప్ గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై ఇంకా సంతకం చేయలేదు.
మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనం ఎంత సుంకాన్ని…18 శాతమా, 15 శాతమా లేక 13.5 శాతమా…ఎంత చెల్లించాలన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ నెల ప్రారంభంలో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ 18 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంది. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అన్ని దేశాల దిగుమతులపై పది శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత శనివారం దీనిని 15 శాతానికి పెంచారు. ఈ ఉత్తర్వు 24వ తేదీ నుంచి అమలులో ఉంటుంది. భారత్‌పై విధించే టారిఫ్ రేటు ఎంత ఉంటుందని ట్రంప్‌ను ప్రశ్నించగా ముందుగా అంగీకరించిన విధంగా అది 18 శాతంగానే ఉంటుందని ఆయన బదులిచ్చారు. శ్వేతసౌధం మాత్రం భారత్‌పై కూడా 10 శాతం సుంకమే అమలులో ఉంటుందని వివరణ ఇచ్చింది.
సాంకేతికంగా చూస్తే సుంకం 13.5 శాతంగా ఉంటుందని అంచనా. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ విషయంలో అమెరికా నుంచి వివరణ పొందేందుకు భారత ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డీసీకి వెళుతుంది. ప్రస్తుతానికి చూస్తే సుంకాలు తగ్గడంతో ఎగుమతిదారులకు కొంత ఊరట లభించింది. ముఖ్యంగా వస్త్రాలు, రత్నాల పరిశ్రమలకు అమెరికా కోర్టు తీర్పు ఎంతో ఉపశమనం కల్పించింది. కనీసం వచ్చే 150 రోజుల వరకూ వెసులుబాటు ఉంటుంది. భారత్‌పై గతంలో విధించిన 18 శాతం సుంకాన్ని ఎలా కొనసాగించాలన్న విషయంపై అమెరికా అధికారులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కొనసాగిన పక్షంలో, తదుపరి చర్చలు జరగకపోతే భారత్ ఎగుమతులపై గతంలో మాదిరిగా 18 శాతం టారిఫ్ పడుతుంది.



