ఇక్కడ ఏం చేశారని అక్కడికెళ్లి గొప్పలు చెబుతున్నారు?
గిరిజనులకు కాంగ్రెస్ చేసింది సున్నా.. వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ- దామరగద్ద
”గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా.. ఇక్కడ చేశారని చాలదని కేరళకు పోయి గొప్పలు చెబుతున్నారు.. ఇంట్లో ఈగల మోత అంటే కేరళపోయి పల్లకీల మోత అన్నట్టు ఉంది..” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ‘కేరళ ప్రజలు రేవంత్‌లాగా తెలివి తక్కువ వారు కాదు.. మీరు చెప్పింది నమ్మేవారు ఎవరూ లేరు అక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేశాం.. ఇక్కడా చేస్తామంటున్నావ్.. అసలు ఏమి అమలు చేశారు? కాంగ్రెస్ పార్టీ పాలన ఏంటో కేరళ యువత గూగుల్‌లో సెర్చ్ చేసి ఉంటారు.. రేవంత్‌రెడ్డి ఏమి చెప్పినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవదు..’ అన్నారు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బావోజీ జాతర(లోక్ మసంద్ మహారాజ్ జాతర)కు శుక్రవారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘లోక్ మసంద్ మహారాజ్ జాతరకు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి రూ.8 కోట్లతో బ్రిడ్జి వేయించింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈ దేవాలయ అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ ఇచ్చి వారు చేసిందేమీ లేదు. రూ.2,730 కోట్లు ఎస్టీలకు బడ్జెట్‌లో పెట్టి కేవలం రూ.50 కోట్లే ఖర్చు చేశారు.
గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.. ఒక్కరికీ ఇవ్వలేదు..” అని విమర్శించారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తున్నారని, సీఎం రేవంత్, ఆయన మనుమడు ఫుట్‌బాల్ ఆడేందుకు డబ్బులు ఉంటాయి కానీ ఎస్టీలకు ఇచ్చేందుకు లేవా?.. అని ప్రశ్నించారు. లగచర్లలో లంబాడీల భూములు గుంజుకుని వారిని జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో రుణమాఫీ వంద శాతం జరిగిందో రేవంత్ చూపించాలని సవాల్ విసిరారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, ప్యాకేజ్-3లో కొంత పని మాత్రమే మిగిలి ఉందని, త్వరగా ఆ పని పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని చేయల్లేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని, మీ నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు.



