తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ – జోగులంబ గద్వాల
రజకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేటీ దొడ్డి మండలం పాగుంట గ్రామంలోని పెత్తందారులపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పెత్తందారుల చేతిలో గాయపడిన రజకులను పరామర్శించి, డీఎస్పీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పాగుంట గ్రామానికి చెందిన రమేష్, నతి రంగన్న, వీరేష్ అనే పెత్తందారులు, అదే గ్రామానికి చెందిన చాకలి దేవేంద్రప్ప ఇంటి పైకి మద్యం తాగి, ఖాళీ మద్యం సీసాలు విసిరేసి గొడవకు దిగారని, అయినా దేవేంద్రప్ప ఎటువంటి వాగ్వివాదం చేయలేదన్నారు. రాత్రి జరిగిన గొడవ గురించి మరుసటి రోజు ఉదయం పంచాయితీలో మాట్లాడదామని దేవేంద్రప్ప అతని కుమారుడు ప్రవీణ్‌ను పెత్తందారులే పిలిపించారని తెలిపారు. పంచాయితీ పెద్దల దగ్గరకు వెళుతుంటే మార్గమధ్యలోనే రమేష్, వీరేష్, నత్తి రంగస్వామి, బొండం వీరేష్, చిన్న వీరేష్‌తో పాటు బోయలగూడెం గ్రామానికి చెందిన కొంతమంది పిలిపించుకొని రాళ్లు, కట్టెలతో మూకుమ్మడిగా దేవేంద్రప్ప, ప్రవీణ్ కుమార్‌తో పాటు ఓ మహిళపై దాడి చేశారని తెలిపారు. అడ్డొచ్చిన రజక మహిళలపై కూడా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని అన్నారు. ”మా ఇంటి ముందు అడుక్కుతినే కుక్కలు మమ్మల్ని ప్రశ్నిస్తారా” అంటూ పురుషుల బీజాలపై దాడి చేసి, మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. పెత్తందారులు చేసిన దాడిలో దేవేంద్రప్ప బీజాలకు గాయాలై, నడుములు వీరిగాయని, అతని కుమారుడు ప్రవీణ్‌కు తల పగిలి నాలుగు కుట్లు పడ్డాయన్నారు. సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన పెత్తందారులను అరెస్ట్ చేయకపోవడం వల్ల రజకులు గ్రామంలోకి వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. తక్షణమే పెత్తందారులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో.. వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ నరసింహ, రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపాటి నరసింహులు, పట్టణ అధ్యక్షులు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ అంజి, వృత్తిదారుల సంఘం నాయకులు మద్దిలేటి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ తదితరులు ఉన్నారు.