సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ – ధూల్ పేట్
నాగర్ కర్నూల్ జిల్లాలో పసికందు హత్యకు కారణమైన పెత్తందారులపై వెంటనే కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. కుమ్మెర జాతరలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట జోన్ ఫలక్‌నుమాలో సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుడి దగ్గరకు వెళ్ళిన దళితులపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. దళితులను దూషించి తన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మనుషులమనే మానవత్వాన్ని మరచి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పైకి మాత్రమే మనమంతా ఒక్కటే అంటూ దళితులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
రెండు నెలల పసికందు అని కూడా చూడకుండా హత్య చేసిన పెత్తందారులపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను, పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన పసిపాప కుటుంబానికి నష్టపరిహారం చెలించి న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. విట్టల్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.కోటయ్య, శశికళ, కృష్ణ నాయక్, చాంద్రాయణ జోన్ కార్యదర్శి ఎస్. కిషన్, జోన్ కమిటీ సభ్యులు రాంకుమార్, శ్రీను, జ్యోతి, శ్రీను, రంగా స్వామి, గౌస్, హమీద్, మురారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.


